అనగనగా అమెరికా-31
అమెరికన్ ఇంగ్లీషు
ఎయిర్ పోర్ట్ లో దిగుతూనే రెండు గంటలు క్యూ లో నిలబడ్డాడు ప్రవీణ్. మధ్య లో హఠాత్తుగా డౌట్ వచ్చింది. “అసలిది కరెక్టు క్యూయేనా?!” అని. తన ముందు నిలబడ్డ చైనీస్ వ్యక్తిని అడిగేడు. అర్థం కానట్టు చూస్తున్న అతనికి అసలు ఇంగ్లీషు సరిగా అర్థం కావట్లేదని గ్రహించి ఊరుకున్నాడు.
చివరకు ప్రవీణ్ వంతు రానే వచ్చింది.
కౌంటరు లో కూచున్న ఇమ్మిగ్రేషన్ అఫీసరు ప్రశ్నలడిగేలోగా తనే ముందు అడిగేసేడు. “ఇది సరైన క్యూయేనా సార్ ” అని .
జవాబుగా ఎగా దిగా చూసి అడిగినదానికి సమాధానం ఇవ్వకుండా అతనడగాల్సిన మొక్కుబడి ప్రశ్నలేవో అడిగి, “వెల్ కం టు అమెరికా” అన్నాడు.
ప్రవీణ్ కి పదో తరగతి లో ఆంగ్ల భాషలో వచ్చిన మార్కుల వల్ల “ఆంగ్ల భాషా ప్రవీణుడు” అనే బిరుదు కూడా ఉంది.
కానీ అమెరికాలో అడుగు పెట్టగానే ఇంగ్లీషు తనకు రాదో, ఎదుటి వాళ్ళకు రాదో అర్థం కావడం లేదు.
రాగానే అమెరికన్ ఇంగ్లీషు బాధ మొదలైంది.
“హలో, ఎక్స్యూజ్ మీ, బాగేజ్ క్యూ ఎక్కడ?” అని అటుగా పోతున్న మరో అమెరికన్ ఆసామీ ని అడిగేడు. అక్కడా ఇదే తంతు. పైగా ” క్యూ?” అని వెర్రి మొహం వేసాడు.
అప్పటికి గాని వీళ్లకి “క్యూ” అనే పదం అర్థం కావడం లేదని తెలియలేదు ప్రవీణ్ కి.
మరి ఆ పదాన్ని ఏమంటారు వీళ్లు? వరుసలో వెళ్లడం కాబట్టి “లైన్” అందామా అనుకుని, మరీ తనకు భాష రాదనుకుంటారేమోనని విరమించుకున్నాడు.
“ఇంతకీ ఆ క్యూ ఎక్కడ తగలడిందో!” ఇలా లాభం లేదని, కొంచెం తెలివి తేటలు ఉపయోగించి ఈ సారి భారతీయుడిలా కనిపించిన వ్యక్తిని అడిగేడు. అతను అన్నిటికీ “క్యూ” లు ఎక్కడున్నాయో చెప్పి పుణ్యం కట్టుకున్నాడు. ప్రవీణ్ అప్పటికి గండం గడిచి బయట పడ్డాడు.
మరో రెండు వారాల్లో భార్య, కూతురు వచ్చేరు.
ఇండియా లో ఉన్న కేజీలన్నీ పూర్తి చేసేసిన పాపని ఇక్కడి వయసు నిబంధనల ప్రకారం మళ్లీ కిండర్ లో జాయిన్ చేసుకున్నారు.
నిండా నెల రోజులు బడి కెళ్లడం మొదలెట్టిందో లేదో గానీ అమ్మాయి ఇంగ్లీషు దంచెయ్యడం మొదలెట్టింది.
“డాడీ , నువ్విందాకా షాపు లో “క్యూ” అన్నావు కదా, అంటే ఏమిటి?” అనడిగింది.
ఫ్రవీణ్ తెల్లబోయి, “అదేవిట్రా అప్పుడే మన భాష మర్చిపోయేవా? క్యూ అంటే లైన్” అన్నాడు.
అంతలోనే కుతూహలంగా “ఇక్కడేమంటార్రా” అని అడిగాడు.
“లైను” అంది నవ్వుతూ. ఇక అది మొదలు. అన్నిటికీ తప్పులు దిద్దడం మొదలెట్టింది కూడా.
“అమెరికా కాదు, ఆమెరికా” అంటుంది. స్కూల్ బాగ్ ని “బాక్ పాక్” అనాలనీ, స్పెట్స్ ని “గ్లాసెస్” అనీ, టాయ్లెట్ ని “రెస్ట్ రూమ్” అనీ.. ఒకటి కాదు. ప్రతీ పదం సరిచేస్తూనే ఉంది.
కూతురు త్వరగా ఎన్నో విషయాలు నేర్చుకున్నందుకు ఒక పక్క గర్వంగా ఉన్నా మరో పక్క అయిన దానికీ కాని దానికీ “సవరణ”లు చిన్న పిల్ల తో చెప్పించుకోవడం కొత్త బాధ అయిపోయింది ప్రవీణ్ కి.
“పిల్లలకిక్కడ కంపల్సరీగా ఏడాది పరీక్షలు ఉంటాయంటారా?” ఆ వారంలో ఓపెన్ హౌస్ (క్లాసు రూం సందర్శన) లో స్కూలు టీచరు ని అడిగేడు.
“కంపల్సరీ అంటే!” అని టీచరు అర్థం కాక తెల్ల మొహం వేస్తూంటే “మేండేటరీ” అని అందించింది భార్య.
టీచరు సమాధానం మాటికే గానీ ఇలా ప్రతీ పదమూ నేర్చుకోవలిసి రావడం గొప్ప ఇబ్బందిగా మారిపోయింది పాపం ప్రవీణ్ కి.
ఆదివారం ఇండియాకి ఫోను చేసినప్పుడు “పాపా, ఎన్నో క్లాసు చదువుతున్నావమ్మా” అడిగేరు అవతలి నుంచి.
క్లాసు కాదు “ఇక్కడ గ్రేడ్” అనాలి అని చెప్తున్న అమ్మాయిని చూసి
“పిల్లల దగ్గర్నించి మనం నేర్చుకోవలిసి వస్తూంది ఈ దిక్కుమాలిన అమెరికాలో” అని తల పట్టుకున్నాడు ప్రవీణ్.
“బయటికెళ్లి ఎవరికీ అర్థం కాక నెత్తి కొట్టుకునే కంటే ఇదే నయం కదా ” అంది భార్య.
………………
Published: 26 Apr 2014 in AndhraPrabha.com
http://www.andhraprabha.com/columns/a-calumn-by-geetha-madhavi/16254.html