అనగనగా అమెరికా-32 (ప్రతెసీయాంధ్రులు)

అనగనగా అమెరికా-32

ప్రతెసీయాంధ్రులు

ప్రతీ పదాన్ని తెలుగీకరించాలనుకునే భాషాభిమానులు అమెరికాలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నారు.

వాళ్లందరికీ ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడింది. ఒకప్పుడు  ఎన్నారై, Non -Resident Indian అనే పదాన్ని ఇంతకు ముందు “ప్రవాసాంధ్రులు” అని తెలుగీకరించి గర్వంగా ప్రకటించుకున్న వీరే, ఇప్పుడు ప్రాంతీయతా వాదాలతోనూ, విడిపోయిన రాష్ట్రాల నేపధ్యం లోను ఎన్నారై  పదాన్ని మళ్లీ తెలుగీకరించాలని పూనుకున్నారు.

ఇప్పుడా పదాన్ని “ప్రవాస తెలంగాణా” గా మార్చాలని తెలంగాణా ఎన్నారైలు, “ప్రవాస సీమాంధ్ర” గా మార్చాలని సీమ ఎన్నారైలు, అసలు సిసలు “ప్రవాసాంధ్రులం”  మేమే అని ఆంధ్రా ఎన్నారైలు లోపల్లోపల తలమునకలవుతున్నారు.

“ప్రవాస స్వర్ణాంధ్ర”  అంటే అందరికీ సరిపోతుందని నీరస గొంతుతో ఇంకా ఆంధ్ర ప్రదేశ్ అక్కడుందనే భ్రమలో ఉన్నవారు ఆలోచిస్తున్నప్పటికీ చివరికి తెలుగు భాషాభిమానులకి చిక్కు సమస్య వచ్చి పడింది.

సమస్య మొదలవ్వడమే  కాదు, తప్పనిసరిగా కొన్ని పదాలు సూచించాల్సి రావడం, అందుకోసం కమిటీ వగైరా వేయాల్సి రావడం, అందులో ప్రతీ ప్రాంతం నించీ ఇద్దరు సభ్యులతో కమిటీ ఏర్పాటు.. అన్నీ గబగబా జరిగి పోయాయి.

ఆ మీటింగుకి అధ్యక్షత ఎవరు వహించాలన్నది మరో ప్రశ్న. అక్కడ “రాష్ట్రపతి పాలన” అన్నంత తేలిగ్గా ఇక్కడ రిప్రజెంటెటివ్ దొరకడం కష్టం గనుక, పక్క రాష్ట్రమూ ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ కు తమ్ముడి వరసైన తమిళనాడు వ్యక్తిని పట్టుకొచ్చి అధ్యక్షుణ్ణి చేసారు.

అప్పటి వరకూ ఇంటర్నెట్టు వంటి పదాలకు “అంతర్జాలం” అని ఠక్కున కనిపెట్టేసిన వారికి కూడా ఈ సమస్య తెగని చిక్కుముడి అయికూర్చుంది. మొత్తం అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి, అందరికీ ఆమోద దాయక మయ్యే కొత్త పదాన్ని ఎన్నుకోవాలి. పైగా ఈ కమిటీ  రెండు వారాల్లో సమస్యని తీర్చెయ్యాలి.

ఒక సభ్యుడు ఇలా ప్రతిపాదించాడు “అందరికీ ఆమోదదాయకంగా ఒక పేరు ఎన్నుకోవడం అన్యాయం. కాబట్టి ఎవరి ప్రాంతాల్ని బట్టి వాళ్లం కొత్త పేర్లు పెట్టుకుందాం.”

అతనికి సపోర్ట్ చేస్తూ అదే ప్రాంతానికి చెందిన మరో సభ్యుడు “అవునవును.. అలాగే చేద్దాం” అన్నాడు.

అందర్లో కురు వృద్ధుడు, ఒకప్పటి “ప్రవాసాంధ్ర” పదం కనిపెట్టినప్పటి కమిటీ అధ్యక్షుడు లేచి “ఎన్నారై, అంటే  నాన్ రెసిడెంట్ ఇండియన్” అంటే మనందరం ప్రవాస భారతీయులం. కాబట్టి ఇకనైనా “ప్రవాస భారతీయులు” గా ఉందాం.”  తమిళ వ్యక్తి తప్ప ఎవరూ హర్షించలేదీ ప్రతిపాదనకి.

ప్రాంతీయ వాదాల్లో చేరి ఎంత త్వరగా గొప్ప వాళ్లయ్యిపోదామా అని పరితపించే ఈ రోజుల్లో “భారతీయత”  “బొత్తిగా చాతగాని  వాదం” అని తేల్చారు పైగా.

ఎవరి జెండా, ఎజెండా లతో వాళ్ళు రెడీ అయిన సభ్యులకు అసలిలా “ఒక పదం” అనేదే రుచించడం లేదు. ఇలా మధ్యే మార్గాలని పట్టుక్కూర్చునే, మాకు అన్యాయం జరిగి పోయిందంటే మాకు జరిగిపోయిందని అంతా కొట్టుకోవడంతో మొదటి వారపు సమావేశాలు ముగిసాయి.

రెండో వారం ముగిసే లోగా ఏదో ఒకటి తేల్చుకోకపోతే పాత పదమే వాడుకోవాల్సి వస్తుందని కురు వృద్ధుల వారు తమిళాయనను ఇన్ ఫ్లుయెన్సు చేసి చెప్పించాడు.

ప్రతీ ఒక్కరూ వారి ప్రాంత పదం ఉండక పోతే కుదరదనీ, లేదా తలా ఒక పేరు పెట్టుకుంటామనీ వాదోప వాదాలు ఎంతకీ తగ్గకపోవడం వల్ల, పుట్టక పుట్టక పుట్టిన ఒక్కగానొక్క మనవడి పేరు లా తయారైందీ సమస్య.

చివరిరోజు  అన్ని వాదాలూ సమీక్షించిన మీదట అధ్యక్షుల వారు ఇలా సెలవిచ్చారు.

“అందరూ ఎటూ తగ్గక పోవడం వల్ల అన్నీకలిపి “ప్రవాస తెలంగాణా సీమాంధ్రులు” గా  మనందరికీ కొత్త నామకరణాన్ని కురు వృద్ధుల వారు ప్రపోజ్  చేస్తున్నారు. దీనికి ఓటేసి మీరు గెలిపించుకోలేక పోతే పాత పదమే”… అని పాత పాట పాడేడు.

సీక్రెట్ ఓటింగ్ జరిగింది.  విచిత్రంగా ఫుల్ ఓట్లు వచ్చాయి కొత్త పదానికి. అయితే  “ప్రవాస తెలంగాణా సీమాంధ్రులు” బాగా పొడుగయిపోయినందువల్ల ” ప్ర.తె.సీ.యాంధ్రులు” అని పొట్టి పేరొకటి పెట్టుకుని అంతా ఏకాభిప్రాయానికొచ్చారు.

కొత్త తెలుగు పదం కనిపెట్టుకున్నందుకు కురు వృద్ధుల వారూ సంతోషించారు.

…………..

Published: 05 May 2014in Andhra Prabha.com

http://www.andhraprabha.com/columns/a-column-by-geetha-maadhavi/16759.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s