అనగనగా అమెరికా-34 (మార్కెటింగ్ ప్రతినిధి)

అనగనగా అమెరికా-34
మార్కెటింగ్ ప్రతినిధి
ప్రముఖ తెలుగు సాంస్కృతిక సంస్థలో చిన్నా చితకా వాలంటీరుగా పనిచేసిన సుబ్రహ్మణ్యం ఈ సంవత్సరం ఏకంగా ప్రమోషనొచ్చి మార్కెటింగ్ ప్రతినిధి అయిపోయాడు.

ఏదో ఒక పదవి రావడమే తరువాయని తీసేసుకున్నాడు కానీ, “మార్కెటింగ్ ప్రతినిధి ” అంటే దేశ ప్రతినిధి కంటే క్లిష్టమైనదని గ్రహించడానికి ఎంతో సమయం పట్టలేదు.

ఇంతకీ “మార్కెటింగ్” అంటే సంస్థ సేవా కార్యక్రమాల్ని గురించి టీవీలలో ఊదర గొట్టడం, పత్రికల్లో ఇంటర్వ్యూలివ్వడం, భేషుగ్గా వేదికల మీద వెలిగిపోవడం అనుకున్నాడు పాపం సుబ్రహ్మణ్యం. కానీ అసలు విషయం ఏవిటంటే, సంస్థ చేసే ప్రతి ఉ(చె)త్త కార్యక్రమానికీ విరాళాలు సేకరించడం, స్పాన్సరర్లని వెతికి పట్టుకోవడం, టిక్కెట్లు అమ్మే ప్రణాళికలు రూపొందించడమన్న మాట.

టిక్కెట్లమ్మడం వంటివన్నీ తనతో ఉన్న మరో ఇద్దరు “పిల్ల” మార్కెటింగ్ సభ్యులతో  చేయించవచ్చును కానీ, తన వంతు బాధ్యతైన విరాళాలు సేకరించడం, స్పాన్సరర్లని వెతికి పట్టుకోవడం ఎలాగో అర్థం కావడం లేదు సుబ్రహ్మణ్యానికి.

అసలే ఇటువంటి విషయాల్లో ఎటువంటి ఎక్స్ పీరియన్సూ లేదు.

ఇండియాలో ఉన్నపుడు చారు పోపులో కరివేపాకు లేకపోతే మానెయ్యమనేవాడు కానీ, పక్కింటికి వెళ్లొద్దని చెప్పేవాడు భార్యకి.

అటువంటిది ఇక్కడీ విరాళాల సేకరణ అనే  “అడుక్కునే” పని ఎలా చెయ్యాలా భగవంతుడా అని బాధ పట్టుకుంది.

మొత్తానికి ధైర్యం చేసి ముందుగా ఒక టాక్సు సంస్థ దగ్గిరికి వెళ్లేడు.

అవతలి అతను “ఇప్పుడు టాక్సు సీజన్ కాదే, మీరు సంవత్సరం చివర డిసెంబరులో కనిపించండి.” అని మర్యాదగా చెప్పేడు.

ఇదేదో నేర్చుకోవలసిన పాయింటుగా కనబడింది సుబ్రహ్మణ్యానికి. సీజను బట్టి కూడా స్పాన్సరర్లు దొరుకుతారన్న మాట.

మర్నాడు పేరు మోసిన రెస్టారెంటుకి వెళ్ళేడు. భోజనాల సమయం దాటిపోవస్తున్నా జనం కౌంటరులో పేరు రాయించుకుని లైనులో వేచి ఉన్నారు. ఆ జనం లో ఎలాగో సందు చూసుకుని ఓనరు దగ్గిరికి తన ఐడెంటిటీ చూపించి వెళ్లేడు. “చూసేరుగా బయట జనం ఎలా ఉన్నారో, ఇంకా మాకు ఎడ్వర్ టైజుమెంటెందుకండీ, అయినా  నాకు తెలీకడుగుతాను. మీకు మాలాంటి వాళ్ళు ఎంతిస్తారండీ.  మిలియనీర్లని

పట్టుకుంటే మీకు ఉపయోగం.” అని సెలవిచ్చాడు.

ఇది మరో ఉపయోగపడే పాయింటని నోట్ చేసుకున్నాడు సుబ్రహ్మణ్యం.

మిలియనీరు కనీసం అప్పాయింట్ మెంటు కూడా ఇవ్వలేదు ఎంత ప్రయత్నించినా. చివరికి సంస్థ వైస్ ప్రెసిడెంటు ప్రయత్నించి ఒక అప్పాయింట్ మెంటు సంపాదించి పెట్టేడు.

“ఏవయ్యా, నువ్వు బొత్తిగా కొత్త మనిషివి. నేను విరాళం ఇచ్చేనంటే మీ ఫంక్షనులో నాకు జరగాల్సిన మర్యాదలు చాలా ఉంటాయి. అవన్నీ సక్రమంగా జరిపించా గలవా మరి” అన్నాడు మిలియనీరు.

అన్నిటికీ బుద్ధిగా తలూపేడు సుబ్రహ్మణ్యం.

“అన్నిటి కన్నా ముఖ్యం- మీదే కార్యక్రమమైనా, అందులో స్పాన్సరర్లని ఎవర్ని వేదిక మీదకి పిలిచినా, పిలవక పోయినా, నన్ను మాత్రం పిలవాలి. అందరి కంటే ముందుగా పిలవాలి.”

అని, మళ్లీ

“నిజానికి అమెరికాలో మన వాళ్ళు  ఎక్కువ లేరని ఒకప్పుడు బాధ పడేవాళ్లం, ఇప్పుడు ఎక్కువైపోయేరని బాధ పడాల్సి వస్తూంది. అరే, వారం వారం ఎవరో ఒకరు చందా  కోసం రావడమే. గుడనో, బడనో, సంస్కృతనో, సంప్రదాయమనో చంపేస్తున్నారయ్యా. అయినా పదో పరకో ఇవ్వక తప్పడం లేదు.”

అని సణుక్కుంటూ వెయ్యి డాలర్లకి చెక్కు ముందు పడేసేడు.

సుబ్రహ్మణ్యం మొహం ఆనందంతో వెలిగిపోయింది. కానీ కూడా వచ్చిన వైస్ ప్రెసిడెంట్ ముఖం ఇంకా విచ్చుకోలేదు. “సార్, ఎప్పుడూ అయిదు, పది వేలకి తక్కువ కాకుండా ఇచ్చే ధర్మ ప్రభువులు…” అని తాళం కొట్టడం మొదలెట్టాడు.

“ఇలా ప్రాధేయ పడడం కాదయ్యా,  మొన్నీ మధ్యే ఒక గుడి వాళ్ళు ఎంట్రెన్సు లో మా పేరు తో తోరణ ద్వారం కట్టిస్తామన్నారు, అలాగే మరొకళ్లు బడికి మా ఇంటిపేరే పెడతామన్నారు. మీ సంస్థ మా పేరు తో ఏం చేస్తుందో  చెప్పండి.” అన్నాడు.

“ప్లాటినమనీ, బంగారమనీ బిరుదులు ఇస్తున్నాం కదా సార్ ” అన్నాడు వైస్.

మీరిచ్చే ప్లాటినం, బంగారం బిరుదులు ఏం చేసుకుంటాం? ఇంకేదైనా కొత్త ఆలోచనలతో రండయ్యా వచ్చేటపుడు…”

అన్న ఉపన్యాసం విని సుబ్రహ్మణ్యానికి తల తిరిగి పోయింది.

……………….

First Published: 23 May 2014 in Andhra Prabha

http://www.andhraprabha.com/columns/anaganaga-america-34-k-geetha-madhavi/17729.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s