అనగనగా అమెరికా-36 (కవి ప్రాంతం)

అనగనగా అమెరికా-36

కవి ప్రాంతం

కవి పేరు కవే. పేరుకి తగ్గట్టు చిన్నప్పట్నించీ కవే. పద్యాల తో  మొదలైన ప్రస్థానం వచన కవిత్వంతో కాలానుగుణంగా స్థిరపడింది. స్వతహాగా తెలివి తేటలున్న వాడు కాబట్టి కవిత్వాన్ని ప్రవృత్తిగానే కొనసాగించి, లెక్కలు బాగా నేర్చుకున్నాడు. డాట్ కాం బూం ప్రాంతంలో అమెరికా వచ్చి స్థిరపడ్డాడు. అయితే అంతకుముందే ఆంధ్ర దేశంలో కవిగా పేరూ తెచ్చుకున్నాడు. గోదావరి జిల్లాలో పుట్టినా, పై చదువుల వల్లా, ఉద్యోగ రీత్యా హైదరాబాదులో కొన్ని సంవత్సరాలు  ఉన్నాడు. ఇల్లు కట్టుకున్నాడు.

ఈ మధ్య అమెరికాలోనూ దాపురించిన ఒక ప్రశ్న అతన్ని బాగా వేధిస్తూంది.

ఎక్కడికెళ్లినా, ఎవరు చూసినా “మీరు  తెలంగాణా కవా, ఆంధ్ర కవా” అనడగడమే.

పుట్టి పెరిగిన ప్రాంతం కాబట్టి ఆంధ్ర అనాలో , లేదా జీవితం స్థిరపడ్డ ప్రాంతం కాబట్టి తెలంగాణా అనాలో అర్థం కాక అయోమయం లో పడ్డాడు కవి.

ఇండియాలో ఉన్న  తన బాపతు వాళ్లంతా ఏం చేస్తున్నారో గమనించి సమాధానం చెబ్దామనుకుని అలా అడిగిన వాళ్లందరికీ సమాధానంగా ఒక చిరునవ్వు నవ్వడం అలవాటు చేసుకున్నాడు.

రాజకీయ నాయకుల్లా ఈ మధ్య కవుల్లో కొందరు ఎటుంటే తర్వాత్తర్వాత లాభం ఉంటుందో ఆలోచించుకుని అటు ప్రాంతం వాళ్లమని ప్రకటించుకోవడం గురించి ఫేసుబుక్కు లో చూస్తున్నాడు.

అయినా  ధర్మ సందేహం తీరక అలాంటి  ఒక మిత్రుడికి ఫోను చేసి అడిగేడు.

“కాస్త సూక్ష్మంగా పరిశీలిస్తే అందులో చిన్న కిటుకు కూడా కనిపిస్తుంది” అన్నాడు అవతలి మిత్రుడు గొప్ప రహస్యం కనిపెట్టినట్టు.

“నాకు అర్థం కాలేదు” అన్నాడు కవి.

“ఇలాంటివి ఎవరూ విడమర్చి చెప్పరు. నీకు పుస్తకాల జ్ఞానం తో పాటూ కాస్త లోక జ్ఞానం ఉంటే చాలు అర్థం చేసుకోవడానికి. ఏ ప్ర్రాంతం వెనుక బడిన ప్రాంతమో అదే నీ ప్రాంతం అని చెప్పుకుంటే సరి.”

ఇంకా అర్థం కానట్లు నిశ్శబ్దంగా ఉన్న కవి గొంతు పెగుల్చుకునే లోగా మళ్లీ అన్నాడు మిత్రుడు.

“ఉదాహరణకి పుట్టిన ఊరునీ, ఉద్యోగ రీత్యా ఉన్న ప్రాంతాన్నీ తూకం వేసి, ఇప్పటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్ని బట్టి వెనుకబడిన ప్రాంతం ఏదైతే అదే నీ ప్రాంతం అన్నావనుకో, రేప్రొద్దున్న వెనుక బడిన ప్రాంతపు కవి అని నీ కవిత్వానికే ప్రభుత్వ అవార్డులు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. పైగా తక్కువ కాంపిటీషనూ ఉంటుంది. ఈ విషయం నీకు ఎప్పుడో అర్థమయ్యి ఉండాలి. అమెరికాలో ఉన్నావు కాబట్టి నీకు అస్తిత్వ సమస్య లేదన్నట్లు ఇన్నాళ్లూ మిన్నకుండిపోయావు. ఇప్పటికైనా మేల్కొన్నావు నయమే”

“అవును, ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. అయినా వచ్చే నెలలో వస్తున్నాలే. అప్పుడే “చూసి” తేల్చుకుంటే సరి.” అన్నాడు కవి.

వచ్చే నెల రానే వచ్చింది. ఎయిర్ పోర్టు లో దిగేసరికే కవి మిత్రులు ఎదురుపడతారు అనుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి కవికి.

మర్నాడు కలుద్దామని కొందరు మిత్రులకి ఫోను చేసేడు. ఏదో రకరకాల పనుల సాకు పెట్టి ఎవరూ కలవడం కుదరదన్నారు. ఒకతను పైకి తేలేడు మొత్తానికి. అతను అమెరికా లో ఉన్నా “ఆంధ్ర ప్రాంత కవి” అని స్థానికులు అతనికి అప్పటికే ముద్ర వేసేరు అని.

మరో వారం తర్వాత పుట్టిన ఊరు చూసొద్దామని వెళ్లేడు.  అక్కడా విచిత్రంగా కవి మిత్రులనుకున్న వాళ్లంతా అదే తంతు.

ఈ సారి అస్సలర్థం కాక నెత్తి పట్టుకుని కూర్చున్నాడు.

కొంపదీసి రాష్ట్రం విభజన గొడవల్లో ప్రవాసుల్ని మొత్తానికే వెలివేసేరా అని అనుమానమూ వచ్చింది. సాయంత్రం దగ్గరి మిత్రుడొచ్చి అసలు విషయం చెప్పేడు.

“ఇన్నాళ్లూ అతను అమెరికా లో ఉన్నా, ముందు అయిదేళ్లు హైదరాబాదులో ఉన్న కారణంగా అతణ్ణి స్థానికులు తెలంగాణా కవిగా జమ కట్టుకున్నారట.”

పుట్టిన తేదీని బట్టో, పదోతరగతి వరకు చదివిన రికార్డుని బట్టో తన ప్రాంతీయతని నిర్ధారించడానికి తనేమీ గవర్నమెంటు ఉద్యోగి కాదు.

పదేళ్ళ తర్వాత ఇండియా వచ్చిన కవికి “కవి ప్రాంత”మంటూ  ఇంత ఘోర అనుభవం  ఎదురయ్యేసరికి  రాష్ట్రాలు ముక్కలయ్యినట్లు  కవి హృదయం భళ్లున బ్రద్దలైందని వేరే చెప్పాలా?

……………..

 

First Published: 06 Jun 2014- in Andhra Prabha Daily

http://www.andhraprabha.com/columns/a-column-by-geetha-maadhavi/18432.html

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s