అనగనగా అమెరికా-37 (పాడుకొనదగిన పాటలు)

అనగనగా అమెరికా-37

పాడుకొనదగిన పాటలు

స్టేజీ మీద స్థానిక సాంస్కృతిక కార్యక్రమం మొదలయ్యింది. తెలుగు భాష గొప్ప తనాన్ని గురించి ఇండియా నించి వచ్చిన సినిమా కవులు వచ్చిన దగ్గర్నించీ ఒకటే ఊదరగొట్టేరు.  తెలుగు నేర్చుకోవడానికి
కొందరు సినిమా పాటలు వినమనీ, మరి కొందరు తెలుగు సినీమాలు చూడమని సలహాలు ఇచ్చేరు.

“ఉన్నట్టుండి తెలుగు భాష గొప్ప తనం ఎందుకు గుర్తుకొచ్చిందో వీళ్ళకు?!” అని వినబడింది మా వెనక  నించి.

“అవునూ, ఇదేవిటీ, ప్రతీ సారీ “మా తెలుగు తల్లికీ మల్లెపూదండా” అంటూ ఎక్కడో చోట ఇరికించైనా పాడే వాళ్లు కదా. ఇప్పుడు  ఎక్కడా  ఆ పాట ప్రసక్తే లేకుండా కార్యక్రమం మొదలెట్టేసేరు?” ఆశ్చర్యంగా అంది మాతో వచ్చినావిడ.

“అయ్యో, వీళ్లే కాదు, ఫలానీ వాళ్లైతే కిందటేడాది వరకూ వాళ్ల సంస్థాగత గీతం లాగా “తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది” అంటూ ప్రతీ సంవత్సరం  సాంస్కృతిక నృత్యాలతో స్టేజీలు దద్దరిల్లగొట్టిన వాళ్లు ఈ మధ్య ఎక్కడా ఆ పాట మాటే ఎత్తడం లేదు.” అంది  రహస్యంగా చుట్టుపక్కల వాళ్లకు వినబడకుండా ఆ పక్కనే నిలబడ్డావిడ.

“ఎలా పాడతారులెండి , “తెలంగాణా మనది, రాయలసీమ మనది” అని పాట రాసినాయన ఇప్పుడు అనగలడా” అని చుట్టూ చూసి, మన చుట్టూ  మాట్లాడుకుంటున్న వాళ్లు వేరే ఏదో మాట్లాడుకుంటూ వినలేదు కాబట్టి సరిపోయింది. ఇలాంటి విషయాలు పైకి అనకండి”అంది మొదటి పెద్ద మనిషి.

“మా తెలుగు తల్లికీ” అని పాడడం లో అంత పైకి చెప్పకూడనిదేవుందో నాకు అర్థం కాలేదు.” అన్నాను ఎందుకైనా మంచిదని నేనూ రహస్యంగా.

“అయ్యో, ఇలా రండి పక్కకి. ఇప్పుడు పాడుకొనదగిన పాటలు కావండీ ఇవన్నీ.” అని పక్కకు లాక్కొచ్చిందావిడ.

స్టేజీ మీద  గొంతులో ఎక్కళ్లేని వగలూ తెచ్చేసుకుని మరీ “హల్లో రాక్ స్టార్  ఆమ్ యువర్ ఏంజిల్, ….సింగిల్, ….మింగిల్, ….జింగిల్,” అని పూనకం వచ్చినట్టు ఊగుతూ అందుకుంది ఒక వర్థమాన “సూపర్ గాయని” బిరుదాంకితురాలు.

ఆవ్ తుజో మోగ్ కొర్తా, ….ఒక లైక్ కొడ్తా  అని “తైయ్” మని గెంతులేస్తూ పాడుతున్న సకల  భాషా సమ్మిళిత “తెలుగు” పాట ని తెగ ఎంజాయ్ చేస్తున్నారందరూ.

“ఇదండీ పాడదగిన పాట, వింటే ఒక్క ముక్కా అర్థం కాదు, ఎవరితో ఏ గోలా లేదు. అన్నట్లు మనం “తెలుగు తల్లి” గురించి మాట్లాడుకుంటున్నాం కదండీ… “అని రాగం తీసింది ఆవిడ.

“చిన్నపుడు స్కూలులో వార్షికోత్సవం లో పాడడానికి  మొదటి సారి “మా తెలుగు తల్లికీ ” నేర్చుకుని పాడుతున్నపుడు చివరగా  “జై తెలుగు తల్లీ” అన్నపుడు నా వొళ్లు గగుర్పొడవడం నాకు ఇంకా గుర్తుంది. ఇప్పటికీ ఆ పాట ఎక్కడ విన్నా నాకు అదే అనుభూతి కలుగుతుంది.” అన్నాను గొప్ప భావావేశంతో.

“హయ్యో, రాతలు, మన తలరాతలన్నీ మారిపోయేక ఇంకా  తెలుగు తల్లికీ జై ఏవిటండి!?” అంది రెండో ఆవిడ.

ఇంతలో వాళ్ల పాప పరుగెత్తుకొచ్చి “మమ్మీ, కడుపులో బంగారు” అంటే ఏవిటి? అంది.

“నీకెవరు చెప్పేరు ఇప్పుడా మాట” అంది ఆత్రంగా ఆవిడ.

“అదుగో అక్కడ మా ఫ్రెండ్సు పాడుతున్నారు.” అని చూపించింది.

కొంపలు మునిగిపోయినట్లు అటు పరుగెత్తింది ఆవిడ. మేమూ వెనకే వెళ్లి పిల్లలని దగ్గిరికి పిల్చేం.

పిల్లలు మా మొహాలకేసి ప్రశ్నార్థకంగా చూస్తుండగా “ఇక ఇలాంటి పాటలు పాడుకొనదగినవి కాదమ్మా” అంది.

ఎందుకన్నట్లు వాళ్లింకా అలా బిక్క మొహాలతో  చూస్తుండగా “మనం ఇప్పుడు అమెరికాలో ఉన్నాం కదా” అనేదో చెప్పబోయింది.

ఇంతలో పక్కనావిడ “అది కాదమ్మా, మనం కొత్త పాటలు నేర్చుకోవాలని పాత పాటల్ని మానేసాం” అని సర్ది చెప్పి పంపించింది.

ఇంతలో సంస్థ  నిర్వాహకులలో ఒకావిడ  అటు వెళ్తూ “ఏవండీ, పిల్లలు మీ వాళ్లేనా?” కొంచెం మీ పిల్లలకి కొత్త పాటలు నేర్పించండి. వచ్చే నెల సమావేశం లో దేశభక్తి పాటల్ని పిల్లల్తో పాడించాలనుకుంటున్నాం. అన్నట్లు “పాడుకొనదగిన పాటలు” నేర్పించండి. అంది వత్తి పలుకుతూ.

“పాడుకొనదగిన పాటలు అంటే ……”అని నేనేదో అడగబోతూండగా

“ఏవండీ, మనం అమెరికాలో ఉన్నాం. మనకి అన్ని ప్రాంతాల వాళ్లూ కావాలి. ఇప్పుడున్న రాజకీయ, భౌతిక వేర్పాటు పరిస్థితుల్లో, ఎవరికి వాళ్లు స్వ రాష్ట్ర గీతాలు పాడుకుంటున్నఈ సమయంలో వాళ్ళ పాట పాడి వీళ్లనూ, వీళ్ల పాట పాడి వాళ్లనూ దూరం చేసుకోలేం. అందుకే ఏ రాష్ట్రపు పాటా పాడకూడదని నిర్ణయించుకున్నాం. ఇక సమైక్య గీతాల వంటివి మనం ఎక్కడా పాడకుండా ఉంటే మరికాస్త మంచిది.” అని హడావిడిగా వెళ్లిపోయింది.

…………….

 

 

http://www.andhraprabha.com/columns/a-column-by-geetha-maadhavi/18820.html

First Published: 17 Jun 2014- Andhra Prabha Daily

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s