అనగనగా అమెరికా-38 (గార్డెన్ వర్క్)

అనగనగా అమెరికా-38
గార్డెన్ వర్క్

భారతి ఉదయం పిల్లల్ని స్కూలికి పంపించిన దగ్గర్నించీ గార్డెన్ వర్క్ చేస్తూనే ఉంది.

మొన్న మొన్నే ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నారు.

ఇంటి చుట్టూ ఉన్న చిన్న ఖాళీ స్థలంలో అధిక సమయం గడుపుతూ ఉంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు అదే పనిగా గార్డెనింగ్ చేస్తున్నఈవిడని చూసి నవ్వుకున్నాడు భర్త.

ముందు మట్టి  తవ్వడానికి కావలసిన పనిముట్లు, నీళ్లు పెట్టడానికి పైపులు వగైరా కొనడానికి రెండు వందల డాలర్లు వదిలాయి.

ఉన్న మట్టిలో కాసిన్ని విత్తనాల వంటివి కొన్నుక్కొచ్చి వేసింది. ఒక్కటీ మొలవలేదు.

ఇలా లాభంలేదని ఖరీదైనా అరడజను  కుండీలు, తప్పకుండా మొలుస్తుందన్న ఆర్గానిక్ మట్టి మిక్సూ,  ఆర్గానిక్ ఎరువులూ కొనుక్కొచ్చింది.

సగం ఉన్న మట్టీ, సగం తెచ్చిన మట్టీ వగైరా లన్నీ కలిపి అప్పటికే  విరగబూసి ఉన్న మొక్కలు  కొనుక్కొచ్చి వేసింది. సీజనల్ మొక్కలంటే కనీసం సీజనంతా పూస్తాయనుకుంటే ఉన్న పూలు సరిగ్గా వారంలో  వాడిపోయాక,  రెండో విడత ఇక  పూయలేదు అవి.

మట్టి మీద మట్టి, ఎరువు మీద ఎరువు మారుస్తూ వచ్చింది.

యూట్యూబ్ వీడియోల్లో చూపించిన  గార్డెనింగు టిప్సన్నీ పాటిస్తూ వచ్చింది. ఫలితం శూన్యం.

ఈ సారి ప్రయోగం రకరకాల మొక్కల మీద చెయ్యడం మొదలు పెట్టింది.

గులాబీలు, నిమ్మ మొక్క, ద్రాక్ష తీగ, టమాటా నారు  వరసపెట్టి కొనుక్కొచ్చి వేసింది.

గులాబీమొక్కలు  ఒక్కోటీ పదిహేనేసి డాలర్లు, నిమ్మ మొక్క పాతిక, ద్రాక్సతీగ ఇరవై…ఇలా వందకు తక్కువ ఎప్పుడూ కాకపోయినా ఖర్చుకీ వెనకాడడం లేదు.

నేల మీద ఖాళీలున్న చోటల్లా కొన్ని, కుండీల లో కొన్నీ నాటింది.

అన్నీ వారం రోజుల్లోనే కుదురుకున్నట్టు కనిపించాయి.

ఇక గొప్పులు తవ్వే పని పడింది.

రెట్టించిన ఉత్సాహంతో పదిహేను డాలర్లకు మందారం మొక్క, ఇరవైకి గన్నేరు, ముప్ఫైకి బోగన్ విల్లా కొనుక్కొచ్చింది.

ఇక తీగ మల్లె జాతి నలభైకి, డెభ్భైకి ముద్ద మందారం జాతి మొక్క వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇలా రోజూ మొక్కల దుకాణాల వెంట తిరగడం, ఏవో కొనుక్కు రావడం నాల్రోజులు అవన్నీ నాటడం……

ఇల్లు కొని సంవత్సరం కావస్తున్నా ఆవిడ పట్టుదలకి గొప్ప ఆశ్చర్యమూ, ఈవిడకి మతి తప్పిందా అని అనుమానమూ కలిగాయి ఇదంతా రోజూ చూస్తున్న భర్తకి.

అమెరికాలో గార్డెనింగంటే మాటలు కాదు. పనివాళ్ళ వ్యవస్థ లేని ఇక్కడ  అన్నీ స్వంతంగా చేసుకోవాల్సిందే. ఇక ఖర్చు విషయానికొస్తే పావలా కోడికి రూపాయి మసాలా చందం.

ఆవిడ చేసే ఖర్చుల్ని ఎత్తి చూపడం మొదలెడితే తన స్వంత ఖర్చుల్నీ ఆవిడ ఎక్కడ లెక్కెట్టడం మొదలెడుతుందో అని భయం. అందుకే గప్ చుప్ గా  ఊరుకున్నాడు. కానీ ఇన్నేసి గంటలు గార్డెన్ వర్క్ అంటూ శారీరక శ్రమ ఎలా చేస్తూందో అని ఆశ్చర్యం కలగక మానలేదు. అదే అడిగేసేడు ఉండబట్టలేక.

“మీరు పొద్దస్త మానం ఆఫీసు పట్టుకుని వేళ్ళాడుతారు, ఇంట్లో ఉన్నా కంఫ్యూటరు తప్ప నాకేసి చూసి మాట్లాడరు.  ఇంటి పనీ, వంట పనీ, పిల్లల పనీ  అంటూ ఇరవైనాలుగ్గంటలూ ఇంట్లో మానసిక ఒత్తిడితో నలిగిపోతున్నా. నన్ను గురించి పట్టించుకునే నాధుడున్నాడా?

పలకరించే చుట్టుపక్కల వాళ్లు కూడా లేని ఈ అమెరికాలో ఎలా బతుకుతాననుకుంటున్నారు?

తోట పని ఎంత శ్రమ అయినా ఈ పూలన్నీ నాతో మాట్లాడుతున్నాయి. మొక్కలన్నీ తలలూపుతూ సమాధానం ఇస్తున్నాయి.”

అంతేనా ఇంకేవైనా వివరాలు కావాలా అని చూస్తున్న భారతికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు భర్తకి.

…………………

http://www.andhraprabha.com/columns/a-column-by-kgeetha-madhavi/19078.html

First Published: 24 Jun 2014 in Andhra Prabha Daily

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s