అనగనగా అమెరికా-39 (ఇంటికి మహారాణి- అమెరికా పనిమనిషి)

అనగనగా అమెరికా-39

ఇంటికి మహారాణి- అమెరికా పనిమనిషి

వచ్చిన అయిదేళ్ల తర్వాత ఇండియాకి తిరిగి వెళ్లేను, “ఉక్కపోత, దోమలు, కరెంటు పోవడాలూ వదిలేస్తే ఎంత బావుందనుకున్నారు ప్రాణానికి హాయిగా!” అంది లక్ష్మి.

“అవున్లెండి, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని కలుసుకోవడం ఎంత బావుంటుందో కదా” అన్నాను.

“అది కాదండీ బాబూ, పొద్దుటా సాయంత్రం పనిమనిషి, వారానికి మూడ్రోజులు ఇస్త్రీ మనిషి వచ్చి నా పనిని పూర్తిగా తగ్గించేసేరు. ” అని,

“ఇంటిని ముత్యమల్లె  తుడిచిన పనమ్మాయినీ , బట్టలు పూతరేకుల్లా ఇస్త్రీ చేసిన రత్నాన్నీ చూస్తే ముచ్చటేసింది. అమెరికాలో  గత అయిదేళ్లుగా నేనే ముత్యాన్నీ, రత్నాన్నీనూ. అబ్బబ్బ, ఇండియాలో ఏం లగ్జరీ బతుకండీ. ఇక్కడ నేను “ఇంటికి మహారాణి” నని మా అత్తగారింట్లో గొప్ప అపోహ ఉంది. ఈ దిక్కుమాలిన అమెరికాలో మహారాణిలా  కాదు కదా, మధ్యస్తంగా బతికే అవకాశం కూడా లేదు. ఇవన్నీ ఇండియాలో ఉన్న వాళ్లకు చెప్పిన అర్థం కావు. పొద్దస్తమానం గిన్నెలు కడిగీ కడిగీ వేళ్ళు ఎలా అరిగిపోయాయో చూడండి.” అంది.

“నా వేళ్లు కనిపించకుండా వెనక్కి చప్పున దాచుకుని “ఇంటింటి కథేగా లక్ష్మి గారూ, పనిమనుషుల వ్యవస్థ లేని ఇక్కడ మర మనుషుల్లా పొద్దస్త మానం బయటి పనులూ, ఇంటిపనులూ తప్పడం లేదెవ్వరికీ” అన్నాను.

మర్నాడు –

“మీకు నయం ఇంచక్కా డిష్ వాషర్లు ఉంటాయి. వాషింగ్ మెషీన్లు, డ్రైయర్లూ ఉంటాయి. ఏ పనైనా మెషీన్ల తో నడిపించగలిగిన చక్కని టెక్నాలజీ ఉంది. ఎప్పుడూ కరెంటు పోని వాతావరణం ఉంది” అంది ఇండియా నించి ఫోనులో మా పక్కింటావిడ.

“అయ్యో ఏమని చెప్పమంటారు పిన్ని గారూ, ఇలా పిన్ని గారని పిలవడానికే వీలుండదిక్కడ. ఎంత డిష్

వాషర్లయినా మనుషులే నింపాలి గా, ముందు బాగా నీళ్ళతో కడిగి, వీలైతే సబ్బు నీళ్లలో ముంచి తీసి అప్పుడు డిష్  వాషర్ లోడ్ చెయ్యాలి. అది చేసే పనల్లా గిన్నెల్ని వేణ్నీళ్ళతోనూ, సబ్బుతోనూ కడిగి, నీళ్లు లేకుండా వేడి ఆవిరి తో ఆరబొయ్యడమే. మనం పేర్చేటప్పుడుఏ గిన్నెకైనా జిడ్డు గానీ, అంటు గాని  ఉండి పోయిందంటే అన్ని గిన్నెలకూ జిడ్డూ, అంటూ అంటుకుంటాయి.” అని ఊపిరి పిల్చుకునే లోగా

“అవతలి నించి ఎన్నైనా చెప్పమ్మా, మీరు అమెరికా దొరసానులు.” అంది.

“అయ్యో, ఇంకా అయిపోలేదు పిన్ని గారూ, మీరింకా వాషరు,  డ్రైయర్ల కథ విననే లేదు” అన్నాను.

“అవన్నీ ఇక్కడ మాత్రం లేవా ఏంటి? అయినా కొని మూల పడెయ్యడమే గానీ, ఎప్పుడైనా ఉపయో గించుకునేందుకు కరెంటు ఉండేడిసిందా, ఉన్నా పేలే కరెంటు బిల్లు పట్టుకుని మీ బాబాయి గారు చూసే చూపు తప్పించగలమా?” అని రాగం తీసింది.

ఇక ఆవిడకి వాషింగ్ మెషీన్లో వేసి తీసేక చీర తాచుపాములా తయారవుతుందని, దాన్ని మరలా ఇస్త్రీ చెయ్యడానికి  కొండచిలవలా చెయ్యి వాస్తుందని చెప్పే అవకాశం రాలేదు.

“ఏదో కరెంటు పోదన్న మాటే గాని…” అని “అన్నట్లు ….”అని మరో టాపిక్ మార్చేసేను.

“ఎప్పుడూ ఇక్కడ కరెంటు పోదని నువ్వేమీ సంబరపడనవసరం లేదు. ఇవేళ మన సిటీ లో గ్రిడ్ ఫెయిల్యూర్ ఉందట. కరెంటు సాయంత్రం వరకూ ఉండదట” అన్నారీయన పొద్దున్నే సెల్ ఫోను లో పీజీ & ఈ -మెసేజ్  చూసి.

“అయ్యో, ఉన్నవన్నీ కరెంటు పొయ్యిలే, పోనీ రాత్రి కూర లో ప్రీ రిప్రిజిరేటేడ్ చపాతీలు ముంచుకు తిందామన్నా వేడి చేసుకునేందుకు మైక్రో వోవెన్ కూడా కరెంటు తో పనిచేసేదే.” ఎలాగా మరి అని ఆలోచిస్తూ చల్లని పాలల్లో కాసిన్ని కార్న్ ప్లేక్సు పోసి ముందు పెట్టేను బ్రేక్ పాస్టుగా.

“ఏంటిది? ” అని ఆయన నోరు వెళ్ల బెట్టేరు.

“అవును మరి, కరెంటు లేదు కాఫీ చెయ్యడానికి, ఇండియా నా ఏవిటి చప్పున ఏ కిరసనాయిలు స్టవ్వో ముట్టించడానికి” అన్నాను.

“అయినా కరెంటు లేనందుకు మీకిదొక్కటే బాధ, ఈ కార్పెట్టు శుభ్రం చెయ్యడానికి వాక్యూం క్లీనర్ బదులు బ్రష్ పుచ్చుకుని సాయంత్రం దాకా తుడుచుకోవాలి నేను” అని గొణిగాను జుట్టు ముడేసుకుంటూ.

……………

http://www.andhraprabha.com/columns/a-column-by-geeta-madhavi/19501.html

First Published: 04 Jul 2014

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s