అనగనగా అమెరికా-42 (నిజాయితీ- క్రమశిక్షణ)

అనగనగా అమెరికా-42

నిజాయితీ- క్రమశిక్షణ

బస్సు దిగి కాఫీ షాపు లోకి వెళ్లేడు సంతోష్. ఆర్డరు లైను లో నిలబడి కౌంటరు వరకు వెళ్లేక పర్సు కోసం జేబు తడుముకున్నాడు.

హడిలిపోయాడు. జేబులో పర్సు లేదు.

మిగతా జేబుల్లో, భుజాన బాగ్గులోనూ వెతికాడు. లేదు.

ఎక్కడో పడిపోయింది. ముందు జరిగినవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు.

బస్సు ఎక్కే ముందే  పర్సులో నుంచి చిల్లర తీసి,  బస్సులో టిక్కెట్ల డబ్బాలో వెయ్యడానికి  చేతితో పట్టుకున్నాడు….

బస్సు ఎక్కేక ఇక పర్సు బయటకు తియ్యలేదు…

బస్సు ఎక్కే తొందరలో అక్కడే ప్లాట్ఫారమ్మీద పడిపోయిందా? …

తనెక్కిన స్టాపులో తనతో పాటూ మరొకతను ఎక్కినట్లు గుర్తు. అయినా బస్సెక్కే చోట ప్లాట్ ఫారం అంతా ఖాళీగానే ఉంది. ప్లాట్ఫారమ్మీద పర్సు పడి ఉంటే వెనకొచ్చిన వ్యక్తో, డ్రైవరో వెంటనే చూసి చెప్పేవారే. లేకపోతే.. బస్సులో తను కూచున్న చోట జేబులో నించి బయటకు పడిపోయిందా? అలా అయితే సీటు వెనక ఇరుకులోకో , సీటు కిందకో వెళ్లిపోయి ఉండాలి.

ఆలోచనలతో తల పగిలిపోతూంది సంతోష్ కి. అందులోనే తన కాలేజీ ఐడెండిటీ కార్డు, బస్ పాసు, యాభై డాలర్లు ఉన్నాయి.

ఇప్పుడేం చెయ్యాలి? గబగబా కాలేజీ లో తెలిసిన మిత్రులకి వాట్సప్ లో పరిస్థితి వివరించాడు.

ఫేసు బుక్ లో పర్సు పోయిన సంగతి, బస్సులో ఎవరికైనా దొరికితే తెచ్చిమ్మని మెసేజ్ పోస్ట్ చేసేడు.

బస్సులో తనతో పాటూ ఇద్దరు  ముగ్గురు కాలేజీ కుర్రాళ్లు, పెద్దవాళ్లు అమెరికన్సు ఆరేడుగురు ఉన్నట్లు గుర్తు. ఎవరూ తనకి తెలియదు. అసలే దేశం కానీ దేశం. బస్సు వెనకే వెళ్లి వెతుకుదామంటే ఈ రూట్ లో తర్వాతి బస్సు మరో గంటకి గాని లేదు. అప్పటికి అసలు బస్సు ఎక్కడ ఉంటుందో. డిపోలెక్కడ ఉంటాయో, ఉన్నా అక్కడికి టాక్సీల్లో తిరిగే స్థోమత లేదు తనకి.

కాలేజీకి కాళ్లీడ్చుకుంటూ వెళ్లేడు మర్నాడు. కారిడార్ లోకి అడుగుపెడ్తూనే “ఏరా? పర్సు దొరికిందా? ఫేస్ బుక్ లో  నీ పోస్ట్ చూసేను” అన్నాడు కిరణ్.

తన వాలకం, పెదవి విరుపు చూసి “నువ్వు పర్సు బస్సు లో పడేసుకుని ఉన్నట్లయితే మరి వాళ్ల “లాస్ట్ అండ్ ఫౌండ్”కి ఫోను చేసేవా? ఇక్కడ సాధారణంగా ఎవరూ కనబడ్డ వస్తువులు జేబులో వేసుకుని వెళ్ళిపోరు” అన్నాడు.

“అదేవిటి” అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసేడు సంతోష్.

“ఫోన్ ఇటియ్యి” అని లాక్కుని గబగబా  ఆన్ లైన్ లో నంబరు చూసి కాల్ చేసేడు కిరణ్.

మధ్య మధ్య లో “బస్సు నంబరు, రూట్ నంబరు , ఇంచుమించు ఏ సీట్ లో కూచున్నదీ, పర్సు రంగు, అందులో ఐడెంటిటీ కార్డు, అందులో ఏమేం వివరాలున్నాయి”వంటివి సంతోష్ ని అడుగుతూ అవతలి వాళ్లకు అన్నీ వివరిస్తూ ఉన్నాడు.

“ఓకె. ష్యుర్” అని ఫోన్ పెట్టేసి, గట్టిగా నవ్వేడు సంతోష్ చెయ్యి పట్టుకుని.

“నీ డబ్బులు గట్టివిరోయ్, పర్సు లాస్ట్ అండ్ ఫౌండ్ వాళ్ల దగ్గరుంది. పద తెచ్చుకుందాం.” అంటూ

“ఒరేయ్, సంతోష్, ఇది అమెరికా. ఇక్కడ సాధారణంగా ఇలా దొరికిన వస్తువులు ఎవ్వరూ పట్టుకెళ్లరని చెప్పేనా? బస్సులో పడ్డ నీ పర్సుని ఎవరో ప్రయాణీకుడు డ్రైవరుకి ఇచ్చేడట. డ్రైవరు భద్రంగా లాస్ట్ & ఫౌండ్ కి అప్పగించేడు. చూసేవా? ఎంత నిజాయితీనో వీళ్లకి.” అన్నాడు.

మరో గంటలో చేతిలో పర్సుతో సంతోషంగా వెనక్కి వచ్చేడు సంతోష్.

ఇద్దరూ కారులో వస్తూ పక్క వీధిలోకి తిరిగే సరికి సిగ్నల్ పనిచేయక,  ఆరి వెలుగుతూంది.

నాలుగు రోడ్ల కూడలిలో ప్రతీ కారూ ఆగి చూసుకుని ఒక్కొక్కటిగా వంతుల ప్రకారం వెళ్తూంది.

“ఇండియా లో ఇలాంటి నిజాయితీ గానీ, క్రమశిక్షణ గానీ” ఎప్పటికైనా వస్తాయంటావా? ” అన్నాడు సంతోష్ ఇక్కడి క్రమశిక్షణకి ముచ్చట పడ్తూ.

“కల్లో కూడా రావు, ఇవన్నీ అమెరికన్ నిజాయితీ, క్రమశిక్షణలు. ఇక్కడి సమాజంలో భాగంగా ఉన్నంత సేపూ నువ్వూ, నేనూ కూడా ఇక్కడి లాగే నడుచుకుంటాం. కాగితాలు చింపి నేల మీద పడేయకుండా జాగ్రత్తగా డస్టు బిన్నుల్లోనే వేస్తాం. రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకుండా బుద్ధిగా మసలుకుంటాం. అలాంటిది, ఇక్కడి నించి వెళ్ళినా ఇండియాలో  ఎప్పుడైనా ఇవన్నీ చెయ్యకుండా ఉంటామా? ఎందుకు? మనకే ఒక రకమైన నిర్లక్ష్యం- అక్కడి వాతావరణం, బాధ్యతా రాహిత్యం చూస్తే. మన చుట్టూ బురద ఉన్నప్పుడు మనం మరికాస్త బురద చేస్తే పోయేదేముంది అని అందరం ఆలోచిస్తాం.” అని నవ్వేడు కిరణ్.

 

…………..

http://www.andhraprabha.com/columns/a-column-by-kgeetha-madhavi/20680.html

First Published: 30 Jul 2014 in Andhra Prabha Daily

ప్రకటనలు
This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s