నా కళ్లతో అమెరికా-34 (నయాగారా నించి బోస్టన్)

నా కళ్లతో అమెరికా-34

నయాగారా నించి బోస్టన్

ముందు రాత్రి పన్నెండు గంటల వరకు నయాగారా చలి లో, మంచులో బయట తిరుగుతూ ఉన్నామేమో, మర్నాడు పొద్దున్న అస్సలు లేవలేకపోయాం. ఇలా బస్సు టూరు కాకుండా మా అంతట మేం వచ్చి ఉంటే మధ్యాహ్నం వరకూ బద్ధకించే వాళ్లమే. బస్సు ప్రయాణం లో అలాంటి పప్పులేం ఉడకవు. ఏది ఏమైనా ఆరు గంటలకు బెల్లు కొట్టినట్లు బస్సులో పడాల్సిందే. పిల్లల్ని అయిదింటికే లేపడమే తరువాయి, పేచీలు లేకుండా రెడీ అయిపోయారు పాపం. బ్రేక్ ఫాస్టులకి సమయం లేదు, ఏకంగా బ్రంచ్ కి పదకొండు గంటల వేళ ఆపుతామనీ, లైటుగా ఏవైనా స్నాక్స్ తినమని చెప్పేడు మాగైడు. పిల్లలు చిప్సు పాకెట్లు, మేం కాసిన్ని పళ్లు తిని బయలుదేరేం.

అమెరికన్ ఫాల్స్ : చల్లని, తెల్లని మంచు రోడ్ల మీద నుంచి మా బస్సు బయలుదేరి ముందు రాత్రి మేం చూసిన “అమెరికన్ ఫాల్స్” దగ్గిరే మొదటగా ఆగింది.

రాత్రి చీకట్లో సరిగా అర్థం కాలేదు కానీ అడుగు దూరంలో ఫెన్సింగు నానుకునే మంచు ముద్దల్ని ఒరుసుకుంటూ చల్లని పొగల ప్రవాహం. రాత్రే చూసినా, ధవళ హిమోత్పాతపు అంచుల్ని కోసుకుంటూ మా పక్క నించి అత్యద్భుతంగా జాలువారుతోన్న జలపాతం వైపు ఒక్క ఉదుటున పరుగెత్తాలనిపించింది.

చెవుల పక్క నించి దూసుకెళ్లి, అల్లంత దూరంలోనే చేయి చాస్తే అందుతాయేమోననిపించే ప్రవాహాలు తప్ప, దిగువన నీళ్లు ఎక్కడ పడ్తున్నాయో ఇక్కడి నించి పూర్తిగా కనిపించవు.

బయటికి వస్తూనే పిల్లలు అసలు నడవాల్సిన దారిలో మాతో నడవకుండా మంచులో అడ్డదిడ్డంగా పరుగులు మొదలు పెట్టేరు.  మంచు గడ్డలు చేతిలో పట్టుకుని విసురుకుంటూ,సంతోషంగా నవ్వుకుంటూ నడుస్తున్న వాళ్లను చూస్తే భలే ఆనందం వేసింది. ముందు రోజు రాత్రి మంచుని చూసి మేమూ అలాగే సంతోష పారవశ్యులమై ఆడకుండా ఉండలేకపోయాం.

హార్స్ షూ ఫాల్స్ : తర్వాత పది నిమిషాలు ప్రయాణించి, అప్పటి వరకు మేం చూడని నయాగారా మరో మలుపు “హార్స్ షూ ఫాల్స్” దగ్గిరికి తీసుకెళ్లేరు మమ్మల్ని.

హార్స్ షూ ఫాల్స్ దగ్గరే నయాగరా స్టేట్ విజిటర్ సెంటర్ ఉంది. ముందుగా అందులో మొదటి అంతస్థులో ఉన్న థియేటర్  లో “నయాగారా ఫాల్స్ అడ్వెంచర్ మూవీ” కి తీసుకెళ్లేరు.

ఇందులో ప్రధానంగా నయాగరా చరిత్ర దగ్గర్నించీ, మనుషులు తొలిగా చూసిన ఆనవాళ్ల విశేషాలు, నయాగారా మీదుగా చేసిన  సాహసాల సమాహారమైన  అద్భుత డాక్యుమెంటరీ ఇది. ఫెళ్ళున ఎగిసి పడ్తూ ప్రవహిస్తున్న నయాగారా మీదుగా రెండు తీరాల మీదుగా కట్టిన తాడు మీద  నడిచిన సాహసపు పెద్దమనిషి దగ్గర్నించీ,  ఒక పెద్ద డ్రమ్ము లోపల దాక్కుని నయాగారా లో దుమికి ప్రాణాలతో బయట పడ్డ ముసలమ్మ వరకూ ఊపిరి బిగబట్టి చూసే దృశ్యాలవి. డాక్యుమెంటరీ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. దాదాపు 45 నిమిషాల పాటు మంత్రముగ్ధుల్లా చూస్తుండి పోయాం.

విజిటర్ సెంటర్ వెనుక ద్వారం గుండా నడిచి వెళ్తే వంద అడుగుల్లో  హార్స్ షూ ఫాల్స్ దగ్గిరికి చేరతాం. ఇవి కూడా నడుస్తున్న బాట పక్క నించి ప్రవహిస్తూ కనువిందు చేస్తున్నాయి.

అయితే అమెరికన్ ఫాల్స్ కంటే పెద్దవి. మలుపులు, మలుపులుగా మంచుని చీల్చుకుంటూ కనుచూపుమేర విస్తరిస్తూ తెల్లని పొగలు రేపుతూ పాతాళానికి జాలువారుతున్న జలప్రవాహం. అంతా ధవళ వర్ణమే.

కొంత పరిపూర్ణంగానూ, కొంత అపరిపూర్ణంగానూ.

అక్కడి నించి కూడా సరిగా కనబడని ఫాల్సుని కనిపింపజేయడం కోసం ఒక “టవర్ వ్యూ పాయింట్” నీటి మీదకు సాగినట్లు కట్టారు. అక్కడికి లిఫ్ట్లో  రెండు అంతస్తులు  పైకెక్కి వెళ్లేం.

మంచు చల్లని శీతాకాలం కావడం వల్ల ఎక్కడికక్కడ అత్యంత ఖాళీగా ఉందా ప్రదేశం. మా పాదాల కడుగున కరిగి నీరైన మంచు తో చెమ్మ చెమ్మగా అడుగులు జారేట్లున్న బ్రిడ్జి మీద మేమూ, మా  బస్సు వాళ్లం మాత్రమే ఉన్నాం.

https://plus.google.com/photos/104256037410703377895/albums/6038382040096542129?banner=pwa&authkey=CMnt2N6Dtc_0cg

నయాగారా జలపాతం-టవర్ బ్రిడ్జి : బ్రిడ్జి మీద కొద్దిగా ముందుకు నడిచేమో లేదో….. నయాగారా జలపాతం…. చేతులు చాచి ఆకాశపు మబ్బుల్నీ, మబ్బుల కళ్లల్లోని లేత నీలి రంగునీ ధవళ వర్ణంలోకి ముంచి ఒత్తైన నీటి పాయల్ని విరజిమ్ముతూ భువి నించి దివికి దుముకిన గంగ ఇలాగే ఉంటుందన్నట్లు అత్యద్భుతంగా ప్రత్యక్షమైంది. కట్టుదిట్టంగా చలి కోట్లు,గ్లోవ్స్ వేసుకుని, వెచ్చగా తిరుగుతూన్నా మనస్సునెక్కడో మెలితిప్పి గుండె ధడక్మనిపించే అత్యద్భుత సౌందర్యం. చేయి తిరిగిన చిత్రకారుడెవ్వరో అక్కడ అప్పటికప్పుడు ధవళ వర్ణపు మంచు ముద్దల్ని అక్కడక్కడా చెరిపివేసి,  కాసిన్ని నలుపు రాళ్లని  పేర్చి, ఆపైన నీటి ముసుగుల్ని తదేకంగా అద్దుతూ ఉన్నాడు.

అక్కణ్ణించి ఎదురుగా అంచుల్ని ఆనుకుని ఊరిస్తూ కెనడా వైపు తీరం కనిపిస్తూంది. సరిగ్గా జలపాతానికి వెనుక వైపుకు తిరిగితే ఇరు తీరాల్ని కలుపుతూ గాల్లో వేళ్ళాడుతున్నట్లున్న “రైన్ బో బ్రిడ్జి” నిజంగానే ఉదయపు ఆకాశంలో ఇంద్ర ధనుస్సులా పేరుకి తగ్గట్లు అందంగా, మబ్బు పట్టిన పగటి వెల్తుర్లో అత్యంత అద్భుతంగా ఉంది.

చూసి తీరాలనిపించడమే కాదు, కదిలి రావాలనిపించని ప్రదేశం టవర్ బ్రిడ్జి. ఈ ప్రయాణం లో నేను ఎంతగానో చూడాలని ఉవ్విళ్లూరిన ప్రదేశం నయాగరా. నయాగరా గురించి చిన్నతనం లో విన్న దగ్గర్నించి చూడాలని కన్న కల ఇప్పటికి తీరింది.

బ్రిడ్జి అంతా ఖాళీగా ఉన్నా, మమ్మల్ని పరుగెత్తించే బస్సు తొందర వల్ల కాళ్లని అక్కడి నించి కదపవలిసి వచ్చింది. కానీ మనసులోని కళ్లని కదపడం ఎవరి తరం. ఇప్పటికీ కళ్లకు కడ్తూ ఉన్నాయి ఆ దృశ్యాలన్నీ. అమెరికాలో నాకు  నచ్చిన ప్రదేశాలలో ఎప్పటి కప్పుడు తొలి స్థానాలు మారిపోతూ ఉన్నా నయాగారా తరువాతే మిగిలినవన్నీ అనిపించి, శాశ్వత ముద్ర వేసుకుందీ ప్రదేశం.

మేం వెళ్ళింది మంచి శీతాకాలంలో కాబట్టి అక్కడ ఉన్న  “గోట్ ఐయ్ లాండ్” కు,  నయాగరా “బోట్ టూర్” వంటి వాటికి అప్పుడు ప్రవేశం లేకపోవడం వల్ల, “వర్ల్ పూల్ స్టేట్ పార్క్”,”హిస్టారిక్ ఫోర్ట్ ” వంటివి మా టూర్ లిస్ట్ లో లేకపోవడం వల్లనూ వెళ్లలేకపోయాం.

అయినా గొప్ప అనుభూతికి క్షణకాలం చాలన్నట్లు ముందు రోజు రాత్రి నించి ఆ ఉదయం పదకొండు గంటల వరకు గడిపిన ప్రతి క్షణం అపురూప అనుభూతిగా మిగిలిపోయింది.

అంతగా ఇష్టపడిన ప్రాంతాన్ని ఒదిలి రాలేని దు:ఖమూ మనసున ముసురుకుందా వేళ పూర్తిగా మబ్బు పట్టిన ఆవేళ్టి రోజులా.

దారిలో అసలు ఎక్కడా ఎండ లేదు. రోజంతా తెల్లారగట్ల లేచినప్పుడు ఎలా ఉందో, అలానే ఉంది.

బస్సు నయాగారా దాటుతూంటే “మరలా ఒక సారి తప్పక వద్దామూ” అన్నాను పైకి అప్రయత్నంగా.

సత్య “అవును, నాకూ సరిగ్గా అదే అనిపించింది.” అన్నాడు.

ఈ సారి వచ్చినపుడు కెనడా వెళ్లి అట్నించి కూడా చూసొద్దాం. అని హుషారుగా కబుర్లు చెప్పుకుంటూన్న కోమల్, వరు ల సీట్ల వెనక నిలబడి  ఇద్దరి జుట్లూ పట్టుకుని ఆడుతూంది సిరి.

పదకొండున్నర ప్రాంతంలో దారి  మధ్యమంలో కనబడ్డ షాపింగ్ కాంప్లెక్స్ కం ఫుడ్ మార్ట్ లో ఆగేం.

చైనీ ఫుడ్ చూడగానే పిల్లలు వెనక్కు పరుగెత్తుకొచ్చి ఆకలి లేదని చెప్పడం మొదలెట్టేరు.

మొత్తానికి కాసిన్ని బ్రెడ్లు, పళ్లు కొనుక్కుని తిన్నామనిపించేం. మరలా సాయంత్రం వరకూ ఎక్కడా ఆగమని చెప్పేడు బస్సు లో గైడు.

అక్కణ్ణించి బయలుదేరిన పది నిమిషాల్లో వరు, కోమల్ నిద్రపోయి మరలా బస్సు ఆగిన తర్వాతే లేచేరు.

సిరి మాత్రం పడుకోకుండా అల్లరి మొదలెట్టింది.

నయాగారా నించి బోస్టన్:  బస్సులో తిరిగి వచ్చే ప్రయాణం లో చివరి సీట్ల నించి ముందుకు మారుతారా అని ఆప్షన్ ఇచ్చేరు బస్సు వాళ్లు. అస్తమాటు కిందికి దూకే సిరి తో చివరి సీట్లే బావున్నాయని మేం అక్కడే స్థిరపడ్డాం. మాతో బస్సులో వచ్చిన వాళ్ళు కొందరు అక్కడి నించే వెనక్కు వెళ్లిపోవడం వల్ల మరో బస్సు నించి బోస్టన్ వచ్చే వాళ్లని మరో పది మందిని ఎక్కించుకున్నారు. ఈ సారి వచ్చిన వాళ్లంతా తమిళ వాళ్లు.  సిరి పరిచయంగా వాళ్లందరి దగ్గిరికీ వెళ్లడంతో, నేనూ వెళ్లాల్సి వచ్చి అంతా కలిసి కబుర్లలో పడ్డాం. వాళ్ల చుట్టాలలో అమ్మాయి అచ్చు నాలానే ఉంటుందని అన్నారు వాళ్లు. ఇండియా నుంచి న్యూయార్క్ కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ల చిన్న అమ్మాయితో బాటూ మొత్తం కుటుంబంలోని అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్లూ అంతా  అమెరికా చూడడానికి వచ్చారట. ఇంకా జెట్ లాగ్ తీరకుండానే తిరుగుతున్నందువల్ల “ఇదంతా కలా, భ్రాంతా అన్నట్లు ఉందన్నారు వాళ్లు.”

బస్సులో వీళ్ళంతా గట్టిగా మాట్లాడుకోవడం వల్ల అప్పటి వరకూ ఉన్న నిశ్శబ్దం అంతా పోయి, బస్సు కళకళ్ళాడడం మొదలెట్టింది.

ఇక బస్సు వాళ్లు మర్నాడు సాయంత్రం వరకూ అయ్యే అన్ని అదనపు ఖర్చులూ, బస్సు డ్రెవరుకు, గైడుకు టిప్పుతో సహా కలిపి మొత్తం టిక్కెట్ల కంటే ఎక్కువ బిల్లు చేతిలో పెట్టేరు. అంతే కాకుండా “కాష్” ఇమ్మని కూచున్నారు. అంత కాష్ ఒక్క రోజులో “డ్రా” చెయ్యలేమంటే వినడే. బస్సులో మాలాగే సగం మంది ఉన్నట్లున్నారు. మార్గ మధ్యమంలో ఎక్కడ “ఎ.టి. ఎం ” కనిపించినా బస్సు ఆపి, “ఇదుగో ఇక్కడ మీరు డబ్బు డ్రా చెయ్యొచ్చు” అనడం మొదలెట్టేరు.

సత్య చికాకు పడ్డా, నాకు నవ్వాగలేదు బస్సు వాళ్లని చూసి. ఆ రాత్రికి వరకూ ఉన్న కార్డులన్నీ ఉపయోగించి డ్రా చేసి ఇచ్చేం.

నయాగారా నించి బోస్టన్ దాదాపు 500 మైళ్లు. దాదాపు 8,9 గంటల ప్రయాణం. నయాగారా దాటి వంద మైళ్లు వచ్చామో లేదో, మంచంతా మటుమాయమైపోయింది.

చివరి మంచు రోడ్డుని దాటేక అసలప్పటి వరకు మంచుని చూడనట్లే ఉంది చుట్టూ వాతావరణమంతా.

“గ్రాండ్ లాబ్స్టార్ డిన్నర్”: రాత్రి పదిగంటల వేళకు బోస్టన్ చేరేం.

“గ్రాండ్ లాబ్స్టార్ డిన్నర్” అని చెప్పి గొప్ప చైనీస్ హోటల్ కు తీసుకెళ్లేరు. అక్కడి పదార్థాలు బఫే కాకుండా టేబుల్ కి పెట్టిన నాలుగైదు ప్లేట్లు చొప్పున ఇచ్చినవి వడ్డించుకుని తినాలి.

అరచెయ్యంత పెద్ద లాబ్స్టార్ లు, సోయాసాస్ లో ఉడికించిన నత్తగుల్లలు, ఏదో మాంసంతో కలిపి వండిన ఆస్పరాగస్ వెజిటబుల్, ఆకుకూరతో కలిపి ఉడకబెట్టిన టోఫూ (మన పన్నీర్ వంటిది), తెల్ల అన్నం, సూప్.

అవన్నీ చూసేసరికి ముందు ఆకలి పోయింది. ఇక ఏదీ రుచిగా లేకపోవడంతో ఏం తినాలో అర్థం కాలేదు కూడా మాకు.

సిరి అన్నీ కొరికి ఊసింది. వరు కేవలం తెల్ల అన్నం గిన్నెలో  పెట్టుకుని రెండు పుల్లలతో ఒక్కో మెతుకూ తినడం మొదలుపెట్టింది.

ఆ డిన్నర్ కు ఒక్కొక్కళ్లకి $20 టిక్కెట్టు.

మొత్తం వంద డాలర్లు ఖర్చు పెట్టినా ఎవరం సరిగా తినలేకపోయాం.

ప్రయాణమంతా ఈ భోజనం బాధ ఎక్కువైపోయింది మాకు. రోజల్లా ప్రయాణం చేసి ఉన్నామేమో హోటల్ కి చేరేసరికి ఓపికలైపోయాయి మాకు. అందులోనూ సరిగా తినలేదొకటి.

“ఉదయమే ఆరు గంటలకి “బోస్టన్ సిటీ టూర్” …అని గైడు ….” అని నేను చెప్పబోతూంటే

వరు “మమ్మీ, ఇలా పొద్దున్నే లేచి రోజంతా తిరుగుతూ…ఇంకా ఎన్నాళ్లు ఈ టూర్ ” అని ఏడుపు మొదలు పెట్టింది.

“మరో రెండ్రోజులే” అని చెప్పినా  ఆపదే.

పాపం పిల్లలకి బాగా తిప్పట అయిపోతూందని మాకూ అనిపిస్తూనే ఉంది. అయినా బుక్ చేసుకున్న టూరు మొత్తం తిరగాల్సిందేగా.

అందరి కంటే ముందు అసలు నేను ఎనర్జిక్ గా ఉండాలి. టూర్ సంధానకర్తని, పిల్లలకి అమ్మని  కాబట్టి అసలు నీరసం ప్రదర్శించకూడదు. అందుకో లేదా నాకు సహజంగా తిరగడం పట్ల ఉన్న ఆసక్తి వల్లో గానీ వారం రోజుల టూర్ లో ఎక్కడా నాకు అలసట అనిపించలేదు. గొప్ప హుషారుగా తిరుగుతూనే ఉన్నాను, వీళ్ళందరిని నడిపిస్తూనే ఉన్నాను.

…………….

Published on 01/08/2014 by Vihanga

http://vihanga.com/?p=12448#comment-12541

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s