నా కళ్లతో అమెరికా-35 ( బోస్టన్)

నా కళ్లతో అమెరికా-35

బోస్టన్

Dr K.Geeta

                 హార్వార్డ్ యూనివర్శిటీ: ముందు రోజు రాత్రి బోస్టన్ కు గంట దూరం లోనున్న హోటల్ లో బస చేయడం వల్ల ఉదయం తెల్లారీ, తెల్లారకుండానే బయలుదేరి ఏడు గంటల కల్లా బోస్టన్ లోని మొదటి సందర్శనీయ స్థలం “హార్వార్డ్ యూనివర్శిటీ” కి చేరుకున్నాం. దారంతా వర్షం సన్నగా ప్రారంభమైంది. అంతా మబ్బు పట్టిన ఉదయం. మేం బస్సు దిగుతూనే బయట పెద్దగా జల్లు మొదలైంది. గబగబా పరుగెత్తి కనబడ్డ మొదటి షెల్టరుకి చేరుకున్నాం. కొంచెం వాన తగ్గు ముఖం పట్టగానే కాస్త దూరం నడిచి గేటు లోపల విశ్వ విద్యాలయం లోకి అడుగు పెట్టాం. ఎంతో పేరు గాంచిన విశ్వ విద్యాలయానికి వచ్చినట్లు, అసలు అమెరికాలో యూనివర్శిటీ కి వచ్చినట్లు అనిపించలేదు ఎందుకో. పాత కాలపు భవంతులు, ఎక్కడ చూసినా మట్టి, కనీసం వాక్ వేలు కూడా సరిగా లేని రోడ్లు. వాన తగ్గే వరకూ మేం నిలబడ్డ కాంటీన్ దగ్గిర అక్కడక్కడా గెడ్డాలతో తిరుగుతున్న మనుషులు బహుశా: పరిశోధకులనుకుంటా, పుస్తకాల సంచీలు భుజాలకి తగిలించుకుని కనిపించారు.
ఇంతకీ యూనివర్శిటీ టూరు అంటే సెల్ఫ్ గైడెడ్ టూరు లాగా దాదాపు గంట సేఫు ప్రధాన ద్వారం దగ్గర్నించీ ఒక రౌండు కొట్టి బయటి నించే బిల్డింగులు చూడడం అన్నమాట.
నిజానికి అక్కడ యూనివర్శిటీ టూర్ ముందుగా బుక్ చేసుకోవచ్చు, ఆడియో టూర్ ల వంటి సదుపాయమూ ఉంది.
ఇక అక్కడ చూడవలసిన వర్డ్స్ వర్త్ హౌస్, ఇండియన్ కాలేజ్, మాసాచుసెట్స్ హాల్, జాన్స్టన్ గేట్, హార్వాడ్ హాల్, జాన్ హార్వార్డ్ స్టాట్యూ, ఫ్రెష్మేన్ డోరంస్, హోల్డెన్ చాపెల్, ఫిలిప్స్ బ్రూక్స్ హౌస్, సైన్స్ సెంటర్, మెమోరియల్ హాల్, మెమోరియల్ చర్చి మొ.వన్నీ చూసే సమయమూ, చూపించే సమయమూ లేక మేం అఫీషియల్ మెయిన్ గేట్ గా భావించే జాన్స్టన్ గేట్ నుంచి జాన్ హార్వార్డ్ విగ్రహం, ఆ పక్క పక్కనే ఉన్న డారంస్, వైడెనర్ లైబ్రరీ బిల్డింగు మొ.నవి బయటి నించి ఫోటోలు తీసుకున్నాం.
అక్కడ జాన్ హార్వార్డ్ విగ్రహానికి ఉన్న రెండు బూట్లలో ఒక పెయింట్ పోయి అరిగిపోయిన షూ చూపించి.. “ఇదెందుకిలా ఉందో తెలుసా, ఇక్కడికి వచ్చిన్ విజిటర్ లు ఆ బూటు పట్టుకుంటే ఈ కాలేజీలో చదువుతారనే నమ్మకం” అని మా గైడు చెప్పేడు. చెప్పిందే తడవుగా అంతా అటు పరుగెత్తారు. నేను తమాషా కోసం సిరిని తీసుకెళ్లి బూటు తనతో ముట్టుకోనిచ్చి వచ్చాను.
వస్తూ దారిలో మెమోరియల్ చర్చి, మెమోరియల్ హాలు వగైరా చూసేం.
రోడ్డు దాటి మలుపులోకి వచ్చి యూనివర్శిటీ హెల్త్ సైన్సెస్ అన్న బిల్డింగులో ఉన్న కెఫే లోకి వెళ్లి “హాట్ చాక్లొట్” కొని తెచ్చుకుని తాగడం మొదలెట్టామో లేదో “పదండి..పదండ” ని మా గైడు గోల మొదలెట్టాడు.
ఎం.ఐ.టి: తరువాతి స్టాపు ఎం.ఐ.టి (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) అక్కడ మరీ దారుణంగా అరగంట లో కనబడ్డ బిల్డింగు దగ్గర ఫోటో తీసుకుని వచ్చేయండన్నాడు.
అప్పటికి సరిగ్గా నేను ఇంజనీరింగ్ ఎమ్మెస్ లో భాగంగా ప్రతీ రోజూ అప్లయిడ్ మేథమేటిక్స్ లో ప్రొఫెసర్ గిల్బర్ట్ స్ట్రాంగ్ మేథ్ లెసన్సు వీడియోలు చూసి రోజూ నేర్చుకుంటూ ఉన్నాను. ఆయనకు ఏకలవ్య శిష్యరీకం చేస్తున్నందున ఆ బిల్డింగులలో ఆయన ఉండి ఉంటాడు కదా, ఒక్క సారి చూడలేక పోయానన్న వేదన పట్టుకుంది.
అయినా తప్పదు. కనీసం ఆ కాంపస్ కాంటీన్ చూసొచ్చాం. లోపలికి వెళ్లి అక్కడక్కడా కూర్చుని వచ్చాం. అరగంటలో అదే పెద్ద గొప్ప.
ఎమ్మైటీ బయట ఉన్న మనిషి ఆకారాన్ని పోలిన తెల్లని రైలింగుల విగ్రహం దగ్గర ఫోటోలు తీసుకునే లైనులో కొద్దిసేపు గడిపేం.
విలియం బార్టన్ రోజర్స్ ఎమ్మైటీ సంస్థాపకుడు. అతని పేరున ఉన్న బిల్డింగు దగ్గిర ఫోటోలు తీసుకున్నాం.
విశ్వ విద్యాలయాల్ని చూస్తే నాకు నా చదువంతా సాగిన ఆంధ్ర యూనివర్శిటీ జ్ఞాపకం వచ్చింది. మనస్సు దాపునెక్కడో అలజడి. ఎక్కడి విద్యార్థులకి ఆయా సంస్థల మీద ప్రేమ అలా ఉంటుంది.
అయితే నాకూ హార్వార్డులోనో, ఎమ్మైటీలోనో చదువుకునే అదృష్టం లేకపోయిందే అన్న ఆశతో కూడిన బాధ కూడా కలిగిందెందుకో.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయాలవి. అందులో సీటు రావడం అంటేనే జీవితం సఫలీకృతమవడం అని అర్థం. కానీ ఖర్చు కూడా అంతకంతా ఆకాశం లో చుక్కలనంటేట్లు ఉంటుంది అదేం విచిత్రమో అమెరికాలో. ప్రతిభతో బాటూ, ఆర్థిక స్థోమత ఉండాలి, లేదా స్కాలర్ షిప్పులకి అర్హులై ఉండాలి. ఇవన్నీ ఆలోచించకుండా కలలు కనడానిక్కూడా అర్హత లేదనిపించి అటు నించి దృష్టి మరల్చుకున్నాను.
పిల్లలకి చెప్పేను, బాగా చదూకోండిరా, ఇక్కడ చదువుకోవచ్చు అని.
వాళ్ళు తలలు అడ్దంగా ఊపి, “ఈ బోస్టన్, న్యూయార్క్… అసలు అమెరికా తూర్పు తీరమే బాలేదమ్మా, చూడు పాత వాసన కొడ్తూ, తుక్కు తుక్కుగా ఎలా ఉన్నాయో. కాలిఫోర్నియా లో ఉన్న వెలుగు లేదిక్కడ.” అనేసేరు.
అది నిజమే. ‘ఇవెక్కడి నగరాలురా భగవంతుడా’ అన్నట్లున్నాయి అవి.

అందులోనూ బోస్టన్ నగరంలో బిల్డింగులన్నీ ముదురు ఇటుక రంగులో ఉంటాయి. వర్షానికి తడిసి, కొన్ని రీపెయింటింగుకి ఏళ్ల తరబడి నోచుకోక, బాగా పాత బడిపోయిన నగరాన్ని స్పురింప చేస్తూ ఉన్నాయి.
అత్యాధునిక డౌన్ టౌన్ వగైరాలు గొప్పగా, అందంగా ఉన్నాయని పిల్లలు అంటుంటే “పాత నగరాలు ఎప్పుడూ సంస్కృతి కీ , చరిత్రకూ చిహ్నాలు, వాటిని అలా చూడడమే అందం” అన్నాను.
అర్థమైనట్లు తలూపింది వరు.
17 వ శతాబ్దం నాటి ట్రినిటీ చర్చి దగ్గిర పది నిమిషాలు ఆపేడు బయటి నించి ఫోటోలు తీసుకోవడానికి.
అక్కడి డౌన్ టౌన్ స్క్వేర్ లో చుట్టూ బిల్డింగుల మధ్య ఉన్న అతి పెద్ద ఖాళీ స్థలం లో నిలబడి చుట్టూ చూడడానికి చాలా బావుంటుంది.
ఆ రోజు పనిదినం కావడం వల్లనేమో జనం ఆ సరికి బాగా రోడ్లపై తిరుగుతూ కనిపించారు.
అంత చలి లోనూ రోడ్డు పక్కన గోడకానుకుని ఖాళీ కాఫీ కప్పు పట్టుకుని అడుక్కుంటున్న మనిషి ని చూసి ఈ పరిస్థితి అమెరికా లోనూ మారనంత వరకూ “ఇదేం గొప్ప దేశం?” అని అనిపించక మానలేదు.
న్యూయార్క్ తో పోలిస్తే బోస్టన్ కొంత పరిశుభ్రంగానే ఉన్నట్లు అనిపించింది.
క్రూయిజ్: అక్కడ్నించి మా తరువాతి స్టాపు బోస్టన్ జల విహారం.
క్రూయిజ్ లో అందమైన బోస్టన్ నగర సందర్శనే కాకుండా బోస్టన్ హార్బర్ చరిత్రాత్మక మైన బోస్టన్ టీ పార్టీ రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి, సివిల్ వార్ సమయంలోనూ జరిగిన చారిత్రాత్మక సంఘనా స్థలాలు మొదలైన వన్నీ ఈ టూర్ లో ఆకర్షణీయాంశాలు.
మబ్బు పట్తిన ఆకాశాన్ని, చలిని లెక్క చెయ్యకుండా మేం తిరుగుతున్నట్టే ఆ నాటి జల విహారమూ సాగింది. అద్దాల తలుపుల్లోంచి అంగుళం తల బయట పెట్టినా రివ్వున విసిరేసే చలి, గాలి.
చాలా ప్రశాంతంగా గడిచిందా గంట సేపు.
క్విన్సీ మార్కెట్టు: తర్వాత క్విన్సీ మార్కెట్టు దగ్గిర భోజనానికి, షాపింగుకి ఆపేరు.
రెండు గంటలు సమయం ఇచ్చేరు. ఓహ్, బోల్డు సమయం.
క్విన్సీ మార్కెట్టు ప్రఖ్యాతి చెందిన ఇండోర్ మార్కెట్టు. ఫుడ్ అండ్ షాపింగ్ సెంటర్. కానీ మేం బొత్తిగా త్వరగా వెళ్లినందున కొన్ని దుకాణాలు ఇంకా తెరవనే లేదు. ముఖ్యంగా ఇండియన్ ఫుడ్ స్టాల్స్. రోజూ చైనీ ఫుడ్స్ తిని ఉన్నామేమో, ఇండియన్ స్టాల్స్ చూడగానే అటు పరుగెత్తాం. కానీ ఎంతకీ తెరవరే వాళ్లు! బాగా ఆకలితో ఉన్నందున ఇండియన్ స్టాల్ కోసం ఇక ఎక్కువ సేపు వేచి ఉండే ఓపిక లేక నూడిల్స్, బ్రెడ్స్ ఏవో కొన్నుక్కుని తిన్నామనిపించాం. అయ్యాక షాపింగంటూ చిన్న చిన్న వి కొనుక్కుంటూ అక్కడక్కడే చక్కర్లు కొట్టాం.
డిసెంబరు నెల కావడం వల్ల రోడ్డు పైనే అతి పెద్ద క్రిస్ మస్ ట్రీని ఉంచారు. అందమైన అలంకరణలతో నిలువెత్తు దేవ వృక్షరాజం లా అత్యద్భుతంగా ఉందది.
మధ్యాహ్నం 2 గంటల కల్లా బస్సు తిరుగు ప్రయాణమయ్యింది.
మాతో బాటు వచ్చిన సౌత్ అమెరికన్ తల్లీ, కూతురూ నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారు.
అంతా కలిసి ఫోటోలు తీసుకుని వీడ్కోళ్ళు చెప్పుకున్నాం.
అక్కడి నించి మేం మరో బస్సుకి మారేం. 5 రోజుల మా సుదీర్ఘ బస్సు యాత్రలో చివరి రోజు చివరి గంటల ప్రయాణం. పిల్లలు ఎప్పుడెప్పుడు దిగుదామా అని ఆత్రపడ్డారు. కానీ నాకైతే దిగులేసింది. ఈ జీవనం ఇలా నిరంతర ప్రయాణం లోనే గడిస్తే ఎంత బావుణ్ణు! అనిపించింది.
ఈ ప్రయాణం పూర్తి చేసి, న్యూయార్క్ నగరమంతా మా అంతట మేం తిరగాల్సి ఉంది.
దాంతో మరింత ఉత్సాహంగా ప్రయాణం ముగించడానికి ఆయత్తమయ్యాం.

-కె.గీత

Published on by విహంగ మహిళా పత్రిక

http://vihanga.com/?p=12694

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s