డా|| కె.గీత కి కవితా రజతోత్సవం

డా|| కె.గీత కి కవితా రజతోత్సవం

డా|| కె.గీత కి ఆచార్య గంగిశెట్టి లక్ష్మి నారాయణ గారు కవితా రజతోత్సవ సాహిత్య పురస్కారంతో కాలిఫోర్నియా లో, ఫ్రీ మౌంట్ లో జరిగిన వీక్షణం -27 వ సమావేశం లో ఘనంగా సత్కరించారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మి నారాయణ గారు, వారి కుమారులు వంశీ , కోడలు సుశీల కుటుంబ సమేతంగా సత్కారాన్ని నిర్వహించారు.ఇదే సభలో శ్రీ కిరణ్ ప్రభ, కాంతి దంపతుల్ని కౌముది నిర్వహణకు గాను, శ్రీ నాగరాజు రామస్వామి గార్ని ఉత్తమ కవితా రచనకు గుర్తింపుగా సన్మానించారు.

 

డా|| కె.గీత కి కవితా రజతోత్సవం
డా|| కె.గీత కి ‘రావి రంగారావు సాహిత్యపీఠం సాహితీ మిత్రుల సంస్థ వారు కవితా రజతోత్సవ సాహిత్య పురస్కారంతో కాలిఫోర్నియా లో జరిగిన వీక్షణం ద్వితీయ వార్షికోత్సవంలో ఘనంగా సత్కరించారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మి నారాయణ గారు, శ్రీ రావి రంగారావు గారు బహుమతి ప్రదానం చేశారు.

                   అ ఆ ల ఆరామస్థలి ఆమె కవిత

—-ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ

ఆమె బ్లాగు పేజీ తెరిస్తే చాలు, అన్నిటికన్నా పైన ” అ ఆ (అనుభూతి ఆలోచన) లు “ ఆమె కవిత్వం –అని ఉంటుంది.

పిల్లల పిలుపుపై అమెరికా బే ఏరియాలోకి అడుగుపెట్టిన తెలుగు సాహిత్యవ్రతులామెకు పరిచయమైతే చాలు, ప్రేమగా గౌరవంగా ఇంటికి పిలిచి ’ అ ఆ లు’ (అనుభూతి, ఆత్మీయతలు) రంగరించి ఆతిథ్యమిచ్చి, చుట్టుపట్ల విశేషాలను తిప్పి చూపించి, తాను ఆనందిస్తుంటుంది. అది -ఆమె వ్యక్తిత్వం.

అనుభూతి, ఆలోచనలు కవిత్వమనడం కవిత్వానికే ఎంత సూటియైన, సరళమైన, సమగ్ర నిర్వచనం! “శబ్దార్థ సహితౌ” అనే మాటను ఆధునీకరించి, కవిత్వీకరించి చెప్పినట్లుంది. ముందు శబ్దనిష్ఠమైన అనుభూతి స్పృశించాలి, తరువాత అర్థనిష్ఠమైన ఆలోచన వికసించాలి. ”అనుభూతి కవిత్వ’’ దృక్పథానికి ఇది అతిచక్కటి సరళమైన అభివ్యక్తి, నిర్వచనం…. ఆ శకంలో తెలుగు కవితారంగంలో అడుగుమోపిన ఆమెకు, కవయిత్రిగా అప్పుడే పాతికేళ్ళు!!

ఆమె డా|| కె. గీత.

కవిత్వం, వ్యక్తిత్వం రెంటిలో తన ప్రత్యేకశైలీ, విశిష్టతల్ని నిరూపించుకొన్న గీత!

**                                       **                                     **

ఒకవ్యక్తి జీవితంలో పాతికేళ్ళు అంత తక్కువ కాలమేమీ కాదు. అందులోనూ చదువూసంధ్యా పూర్తి చేసుకొని జీవితంలో స్థిరపడాల్సిన తొలిభాగంలో. చరిత్రలో అయితే అది ఒకతరం కాలం. అంటే ఒక చరిత్రను నిర్మించుకొనే కాలం. పట్టుమని నలభైనాలుగు కూడా నిండని గీత, కవితారంగంలో పాతికేళ్ళ నిర్విరామకృషితో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకొంది. తెలుగు స్త్రీవాద కవితాచరిత్రలో తనకూ ఒక స్థానం దక్కించుకొంది. అందుకు ’నీలి మేఘాలు’ సాక్షి. చరిత్ర సృష్టించిన తొలితరం తెలుగు స్త్రీవాద కవయిత్రుల అత్యుత్తమ కవితల సంకలనం ’నీలిమేఘాలు’ (1993) లో ఆ చిన్నవయసుకే గీత రాసిన కవితలు మూడు చోటుచేసుకొన్నా యంటే ఆమె ప్రతిభ, కవితాశక్తి గూర్చి విడిగా చెప్పక్కర్లేదు.

’88 అక్టోబర్10 ’ఆంధ్రజ్యోతి’ సాహిత్యవేదికలో ఆమె తొలికవిత “ ఓ రోజంతా” అచ్చయింది. అప్పటికి ఆమె వయసు కేవలం పదిహేడేళ్ళే. అప్పట్లో ఆంధ్రజ్యోతి ఒక ఉద్యమస్థాయిలో కొత్త కవులను, కొత్త కవితా దృక్పథాలను, వాదాలను, పలుకుబళ్లను పరిచయం చేయసాగింది. ’భారతి’ అనంతరయుగంలో సాహిత్య సృజనకు ఓ పెద్ద పట్టుగొమ్మగా నిలిచింది. అప్పట్లో ఆంధ్రజ్యోతి అందించిన అనుభూతి-స్త్రీ వాద కవయిత్రు లలో అందరి కంటె చిన్నవయస్కురాలు గీత.

ఆమెది స్త్రీవాదకవిత కాదు, స్త్రీ సంవేదనాకవిత. మగ ప్రపంచంలో స్త్రీ తన అస్త్విత్వాన్ని, ప్రత్యేకతను నిలబెట్టుకోడానికి చేసే సాంస్కృతిక పోరాటమే స్త్రీవాదం. అందులో ధిక్కారం ఉండొచ్చు, తిరస్కారముండొచ్చు. ప్రశ్న ఉండొచ్చు, తమని తాము చూసుకొమ్మనే నిలదీత ఉండొచ్చు. ఇదంతా ఒకవైపు. మరోవైపు ఇన్ని తరా ల్లోనూ అక్షరావిష్కృతి పొందని స్త్రీల దుఃఖాలు, వేదనలు, శృంగార ప్రతిరూపంగా మాత్రమే లోకం చూసే వారి శరీరాల్లోని సున్నితమైన బాధలు, సంవేదనాపార్శ్వాల చిత్రణ ఉంది. స్పష్టతకోసం దీన్ని’స్త్రీ సంవేదనాకవిత’ అనడం సమంజసం. గీత కవిత ఈ పార్శ్వానికి సంబంధించింది. జన్మరీత్యా స్త్రీ పొందే ఓ బాధని చెప్తూ “ ఎన్నాళ్ళిలా అవయవాల్ని కడుపులోకి కూడగట్టుకోవటం?/ దారంలేని గాలిపటాన్నిఎన్నాళ్ళని కాపాడు కోటం?/ ఈ ఒక్క అవయవాన్ని విసిరవతల పారేస్తే చాలు/మరో సృష్టి ఇంకాగిపోతే చాలు..” “ భగవంతుడా ! అణచివేత, మోసపోవడం, క్షమ,బాధ్యత, జైలుజీవితం,/కన్నీళ్ళు నిండిన పక్కటెముకని తీసి స్త్రీని తయారు చేశావెందుకు?” (ద్రవభాష, పు.94,76) అన్న మాటలు ఆ స్త్రీ వేదనకు, సంవేదనకు గుర్తులే. ఒక పురుషుడు ఎన్నడూ గుర్తించలేని తీవ్ర ఆక్రోశానికి అభివ్యక్తులే. ప్రకృతివివక్షకూ, పురుష ప్రకృతివివక్షకూ గురైన స్త్రీ హృద యాన్ని ఆవిష్కరించడమే ఆమె దృక్పథం.

ఇది ఆమెకు తల్లినుంచి వచ్చిన లక్షణం. అమ్మ కె.వరలక్ష్మి పేరొందిన కథా రచయిత్రి. స్త్రీ వేదనలో, అందునా మధ్యతరగతిక్కూడా చేరని స్త్రీల బాధలో ఎన్ని కోణాలున్నాయో అన్నిటినీ అతి సంవేదనాశీలమైన భాషలో రాస్తారు. అదే అమ్మాయిక్కూడా సంక్రమించి, సున్నిత కవిత్వరూపంలో ఆవిష్కారం పొందింది. “ రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ఒంటిని ఆరబెట్టుకొనే మల్లెమొక్కా/…నన్ను కాస్త బయటికి సాగనంపుమనే గది నేల మీది దుమ్ము/..ఇక నా పనయ్యిందంటూ విశ్రమించే గోడకున్న బల్బు…” ఇలా సాగే ’ఓరోజంతా’ కవిత అచ్చమైన అనుభూతి కవితగా విమర్శకుల ప్రశంసలందుకొంది. ఆ కవితలో ప్రత్యేకంగా ’వస్తు’వంటూ లేదు. సరళమైన, సూటియైన భాషలో ఉదయం నుంచి, సాయంకాలం దాకా ఓ రోజు భావుకుల గుండెలో మిగిల్చిన అనుభూతి మాత్రమే ఉంటుంది. నిజాయితీగా, తనుకు తనుగా పొందే స్పందన మాత్రముంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె కవిత్వ లక్షణమే అది. వ్యక్తిత్వమున్న మనిషిగా తాను అనుభవించే స్పందనను, నిర్వేదాన్ని నిజాయితీగా సూటిగా చెప్పడమే ఆమె కవిత్వం. అందులో భావజాలాల ప్రదర్శనలుండవు, అభివ్యక్తి చిత్రాల కసరత్తులుండవు. గుండెల్లో భావానుభూతి-మాటను విద్యుదీకరిస్తే ఆమె కవిత!

అప్పటినుంచి, ఆమె వివిధ ప్రక్రియల్లో రాస్తున్నా, కవిత్వాన్నే తన ప్రధాన మాధ్యమంగా, ’ఆత్మ’ గా ఎంచుకొని, ’ద్రవభాష’(2001), ‘శీతసుమాలు’(2006), ‘శతాబ్దివెన్నెల’(2012)–మూడు కవితాసంపుటాలను వెలువరించింది. మరో కవితాసంపుటి కూడా త్వరలో రానుంది. ’సిలికాన్ లోయ సాక్షిగా కథలు’ పేరిట ఒక కథలసంపుటి వెలువడనుంది. ఆ కథలు కూడా ఓ విధమైన కవితా చిత్రాలే. గత మూడేళ్ళు గా రాస్తున్న “నా కళ్ళతో అమెరికా” ట్రావెలాగ్సూ అంతే. ఏది రాసినా అందులో అచ్చమైన కవితానుభూతి వాక్యవిన్యాసం చేస్తూనే ఉంటుంది.

**                                             **                                      **

’ద్రవభాష’ ఎంత అందమైన పేరు! వ్యవహారబోధ కలిగించేది సాధారణభాష. మనస్సు ద్రవించి, ద్రవింపచేసేది కవితాభాష. మాట తగలగానే మనిషిలో కరుడుగట్టిన మరోమనిషి ద్రవించాలి. అప్పుడే అది కవిత్వం. “అఆ(అనుభూతి,ఆలోచన)లు.. కవిత్వ”మనడం ఎంత సరళమైన చక్కటి నిర్వచనమో, కవితా భాషను, దరిమిలా కవితాత్మను, ద్రవభాష అనడం కూడా అంతే చక్కటిప్రయోగం. ఆ మాట , ఈ పేరూ ఆమె కవితాతత్త్వానికి ప్రతీకలు .    

ద్రవభాషలోని కవితలన్నీ అలా హృదయాలను ద్రవింపచేసేవే. “ అసందిగ్ధ భారాన్ని జీవితమంతా/ ద్రవభాషలోనికి ఎంతకని అనువదించుకోవటం/ రాని స్వప్నాల్ని సంఘర్షణలుగా ఎన్నని తర్జుమా చేసుకోవటం?” అని కొట్టుమిట్టాడిన మనస్సు “ మమతల మాలికల్ని ప్రదర్శించే దారానికెంత నగ్నత్వం ” అంటూ ప్రశ్నించుకొని, “… దారాన్నంటిన ఐహిక ఆవేదనే మిగిలింది చివరికి…” అని ఓ నిర్వేద వాస్తవంలో రాజీపడుతోంది. ఇందులోని ప్రతీకలు ఎంత సరళంగా అగుపిస్తాయో అంత జటిలమైనవి. వాటిని వ్యాఖ్యానించ డమంటే సుప్తచేతనాభూమికల్ని నిర్మించే మానవ తాత్త్విక స్వరూపాన్ని వ్యాఖ్యానించడమే. ఆ మధ్య అనేక వివాదాలను రేకెత్తించిన “ అనుభూతి కవిత్వం” లోని అంతస్సత్వమే ఆ తాత్త్వికరూపం. దానికి మంచి ప్రతినిధి రచనల్లో ’ద్రవభాష’ ఒకటి. కుందుర్తి అవార్డు లాటి రాష్త్రస్థాయి ఉత్తమ బహుమతులందుకొన్న కవితాఖండిక లున్న ఈ సంపుటికి కవితాప్రియులందరూ గౌరవించే “అజంతా అవార్డు” తో పాటు మరికొన్ని అవార్డులూ దక్కాయి. “మనసు కలం నుంచి కాగితంపైకి దుమికి/ అక్షరాల హర్మ్యంగా మారింది” అనే (పు.59) మంచికవితకు అవార్డులు కొలమానం కావన్నది నిజం.

**                                       **                                   **

హృదయానికి హత్తుకొన్న ప్రతి దృశ్యం, అంశం,వ్యక్తీ ఆమె కవితావస్తువే. అయినా,వాటిల్లో ప్రధానమైనవి మూడు : 1. పాపాయి, 2. అమ్మ, 3. ప్రేమ. ఈ మూడూ ఆమెను కదిలించి పలికించినంతగా మరేవీ కదిలించి పలికించలేదేమో! ప్రేమ అంటే రొమాంటిక్ భావజాలవారసత్వంగా వచ్చిన ప్రేమకాదు. స్త్రీ సహజమైన ప్ర్రకృతి ప్రేమ- ప్రపంచంలోని ప్రతి అందమైన దృశ్యం మీద ప్రేమ. అది వాళ్ళ ఊరి ’కొంగల్రావి చెట్టు’ కావచ్చు, కాలిఫోర్నియాలోని ’లేక్ తహౌ’ కావచ్చు, అన్నిటిపై ఒకే ప్రేమే. కాని ఇందులో అంతస్యూతంగా దర్శనమిచ్చే ప్రేమ అంతకన్నా భిన్నమైంది; తనకు జీవితమిచ్చిన చెలిమిని పరమ ఆర్ద్రంగా చిత్రించేది. అర్ధరాత్రి దుస్స్వ ప్నం నుంచి మేల్కొన్న బేలమనసు “దుఃఖాన్ని తుడిచే చెయ్యి”, భరోసానిస్తూ “ బల్లపరుపుగా పరుచుకొనే భుజం” (’శీతసుమాలు’ పు.13)ను పసిపిల్లలా ప్రేమించే ప్రేమ. యాంత్రిక జీవితంలో తలమునకలైన సఖుని కోసం నిరీక్షిస్తూ “ నువ్వు యంత్రానివి కాదు, సాయంత్రానివి/సర్వకాలాల్లో సాయం వుండే సాయం కాలానివి” ( అదే, పు. 16) అని గొప్పగా నిర్వచిస్తుంది. జీవితాలను కెరియర్ శాసించే ఆధునిక కాలంలో ప్రతి యువతీ గుర్తుంచుకోవలసిన గొప్ప ఆవిష్కారం ఇది.

ఆమె ప్రేమతత్త్వ సంపూర్ణ ఆవిష్కరణ అగుపించేది ’పాపాయి’ మీద కవితల్లో. ఏ భాషల్లోనైనా పాపా యిల మీద వచ్చిన ఉత్తమకవితల్ని ఒక సంకలనంగా వేస్తే వాటిల్లో మొదటిపంక్తిలో నిలిచే కవితలు ఆమెవి. ’శతాబ్ది వెన్నెల’ సంపుటిలో అవి మరింత గొప్పగా సాక్షాత్కరిస్తాయి. ’శతాబ్ది వెన్నెల’ పేరేమిటి? ఆ కొత్తపద చిత్రం అర్థమేమిటి? …తన ”అంతర్లీన సరస్సులో ఈదులాడే చేప పిల్ల/నిశ్శబ్దకుహరంలో తొమ్మిది నెల్లుగా నిద్రపోతున్న పసిపాప” నుద్దేశిస్తూ “బైటిలోకపు ద్వారపాలకురాలినై,రాత్రింబవళ్ళు నీకోసమే పహారా కాస్తున్నా” నన్న కన్నతల్లి అంటున్న ఈ మాటలు: “ చిరుచిన్న పాపాయీ! మనిద్దరం ఒకే శరీరపు రెండు

భాగాలం/ నిజానికి నాలోనువ్వున్నా/ నీకడుపులో నేనున్నట్లు అనుక్షణం పరవశం/నీరూపంలో నేను మళ్ళీ ఓ వందేళ్ళు పోగుచేసుకొంటాను/నీనుంచి ప్రవహించే రక్తమై పరిణామం చెంది శతాబ్దాల తరబడీ జీవించే ఉంటాను/ కృతజ్ణతలు పాపాయీ ఆకాశంలో నక్షత్రానివై మెరిసే నువ్వు/ శతాబ్దివెన్నెలవై నాలో ప్రవర్ధమాన మవుతున్నందుకు” …తనకో వందేళ్ళ జీవితం పొడిగింపు బిడ్డరూపంలో అనుభవించే తల్లి మాత్రమే ఆ మాట అంటుంది. భావుకత ఉన్న ప్రతి తల్లీ, తండ్రి గుండెల్లో ఆ వెన్నెల పరచుకొంటుంది. ’నెలలు నిండేదాకా’ అనే కవితలో “నెలనెలా నా శరీరాన్ని భాగభాగంగా/ పంచుకొని రూపు దిద్దుకొంటావు నువ్వు/ శరీరాన్ని భాషగా మార్చుకొని /శాయశక్తులా నిశ్శబ్ద సంభాషణలు చేస్తావు” అనే పంక్తులు కానీ, ’అమ్మను నేను’ అనే కవితలో ని ’’నన్ను,నిన్ను అనుబంధపు అదృశ్యనాడులు ఎప్పుడూ కలుపుతూనే వుంటాయి/నీ వసంతాన్ని కాపాడే ప్రప్రథమ వృక్షాన్ని నేను/ నీకు అమ్మను నేను…” అనే పంక్తులుకానీ ఎంతో సరళంగా ఉంటూనే వెంటాడుతుం టాయి. పిల్లల్ని చూస్తూనే ఆ ’శరీరభాష’ ఎంత శక్తివంతంగా మాటాడుతుందో అనుభవంలోకి వస్తుంది. ఆమెకు లోకమంతా ఒక ఎత్తు, పాపాయి ఒక ఎత్తు. అందుకే ఆ అంశంపై అన్ని కవితలు. “పాలుకారే పెదాలమీద ఇంద్ర ధనుస్సుని వెనక్కి వంచినట్లు….తెరలుతెరలుగా నవ్వే పాపనవ్వు”లో పరవశించే ఆమె అమ్మతనం “పాపాయి పసినవ్వు ప్రాణాధార పచ్చబొట్టు”(’పారిజాత పచ్చబొట్టు’) అని ప్రకటించుకొంటుంది. ఆ అమ్మతనం పారవశ్యం లోనే తన కావ్య సంపుటుల్ని తన పిల్లలకే అంకితమిచ్చుకొంది.

అమ్మతనం అంత నిండుగా ఉంది కనుకనే తన తల్లినీ అంత గాఢంగా ప్రేమిస్తుంది. ‘అమ్మా! నీకు అశ్రు అభివందనాలు’, ’అమ్మ వెళ్ళేక’, ’అమ్మరాదు’, ’అమ్మ ఉంది చాలు’ వంటి ఎన్నో కవితల్ని’అమ్మ’ మీద రాసింది. ప్రతిదీ కరిగించేసేదే. ‘అమ్మ’నే మాటలోనే గొప్ప నిశ్చింత, ఆలంబనాభావం ఉందంటుంది. ’నువ్వే లేకపోతే’ అనే కవితలో “స్ఫటికాలై పోయిన శరీరాన్ని ద్రవపదార్థంగా మార్చుకొనీ మార్చుకొనీ/ కెరటాల్లో ఉరేసుకోవటం తప్ప/ నువ్వనే పదం కన్పడకుంటే/ అమ్మా! బిక్కుబిక్కుమని నిట్రాతి గోడలకి చేరేసిన వక్రపు నడాలవటంతప్ప” తామేమై పోదుమనే ఆర్తిని అత్యంత ఆర్ద్రంగా చిత్రిస్తూ, “అశ్రు అభినందనాలు” అర్పిస్తుంది.

’మనకింకా అగ్ని ప్రవేశాలేనా?’ అనే ’నినాదం’ కవితతో మొదలుపెట్టి, ’ఇస్త్రీవాడు’ దగ్గర్నుంచి , ’ఇంటూ నలభై’(ఇప్పుడు డాలర్ విలువ అరవై పైనే)వరకు,అనేకానేక అంశాలను కవిత్వీకరించినా, ఆమెకవితల్లోమళ్ళీ మళ్ళీ వచ్చే బలమైనశక్తులు మూడు: పిల్లలు, అమ్మ, అతను. వారితోపాటున్న తన చిన్నప్రపంచమే ఆమె సిరి వెన్నెలవాడ. ప్రతి ఒక్కరికీ అంతే కదా! అదే ఆమె కవితాత్మసందేశం. అంచేతే ఆ అనుభూతి సాంద్రత.

కవిత్వం, వ్యక్తిత్వం పెనవేసుకొన్న ’అ ఆ ల ఆరామస్థలి’ కె. గీతగారి కలానికి అప్పుడే పాతికేళ్ళు!! ***

http://www.koumudi.net/Monthly/2015/april/april_2015_vyAsakoumudi_geetha.pdf

 

 

 

 

ప్రకటనలు
This entry was posted in సాహిత్య వ్యాసాలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s