నా కళ్లతో అమెరికా-36(బోస్టన్- న్యూయార్క్- తిరుగు ప్రయాణం)

ఉదయమంతా బోస్టన్ చూసి మధ్యాహ్న భోజన సమయం తరువాత తిరిగి న్యూయార్క్ కి ప్రయాణమయ్యాం.
బయటంతా సన్నగా జల్లు కురుస్తూ ఉంది దారంతా.బోస్టన్ నుంచి తిరుగు ప్రయాణం దాదాపు 4,5 గంటలు పట్టింది. అయిదు రోజుల తర్వాత వరస బస్సు ప్రయాణం నుంచి బయట పడ్తున్న సంతోషం పిల్లల ముఖాల్లో ప్రస్ఫుటితమైంది.మేం మర్నాడే శాన్ ప్రాన్సిస్కో ప్లైట్ ఎక్కాల్సి ఉంది. మా అంతట మేముగా న్యూయార్క్ చూడడానికి తిరిగెళ్ళిన ఈ రాత్రి, మర్నాడు ఉదయం కాస్సేపు మాత్రమే సమయం ఉంది.బోస్టన్ సరిహద్దుల్లో మరో బస్సులోకి మారేం. అంత వరకు మాతో కలిసి వచ్చిన దక్షిణ అమెరికా మిత్రుల వద్ద సెలవు తీసుకున్నాను. చంటి పిల్లతో గడచిన అయిదురోజులు ఎలా గడుస్తాయో అని ప్రయాణం మొదలైనదగ్గర్నించీ ఉన్న బెంగంతా తీరిపోయింది. బస్సు బోస్టన్ నించి బయలుదేరుతూనే పిల్లలు ఎక్కడి వాళ్లక్కడ పడి నిద్రపోయేరు.మొత్తం ప్రయాణం లో సిరికి డైపర్ మార్చడం లో పాట్లు ఒక ఇబ్బంది ఇక్కడ చెప్పాలి. మొత్తం ప్రయాణం లో బహుశ, 4 సార్లు బస్సులో పెద్ద పని పెట్టింది. బస్సులో చివర సీట్ల కి వారగా ఉన్న ఒక్క మనిషి పట్టే చిన్న బాత్రూంలో నేను వరుని సాయం తీసుకుని నిలబడి పిల్లని రెక్కలు ఎత్తి పట్టుకుని ఎలా మార్చేవాళ్లమో మాకే తెలీదు. కేవలం డ్రైవరు మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో వాడే ఆ బాత్రూము లో ముక్కులు బద్దల గొట్టే యూరిన్ వాసన ఒకటి. చంటి పిల్లతో ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి వీలు కాని ఇలాంటి బస్సు ప్రయాణాలు బహు ఇబ్బంది.

బస్సు న్యూయార్క్ లో ఎక్కడ ఎక్కేమో అక్కడ దిగే సరికి సాయంత్రం 6 అయ్యింది. శీతాకాలపు పొద్దు కావడం వల్ల చీకటి పడిపోయింది. హోటల్ కి చేరుకుని హాయిగా రెస్టు తీసుకుందామన్న ధ్యాస ఒక్కళ్లకీ లేదు. పైగా తినడానికి బయటికి వెళ్ళాలి కాబట్టి అదేదో టైం స్క్వేర్ కే వెళ్లి లైట్ల లో ఒక సారి తిరిగి వద్దామని నిశ్చయించుకున్నాం.

న్యూయార్క్ సబ్ వే:- ఈ సారి పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్లి రావాలని అండర్ గ్రౌండ్ రైలు “సబ్ వే” లో ప్రయాణానికి టిక్కెట్లు కొనుక్కున్నాం.

రోజల్లా అలిసిపోయి ఉన్నా న్యూయార్క్ సబ్ వే లో స్వేచ్ఛగా తిరగాలన్న ఆకాంక్షతో బయలుదేరేం. మా హోటల్ దగ్గర్నించి సబ్వే వరకూ టాక్సీ తీసుకోవటం కన్నా మా హోటల్ కి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండడం వల్ల ఎయిర్ పోర్టు షటిల్ తీసుకోవడం తక్కువ లో అయిపోతుంది. పైగా ఎయిర్ పోర్టు లోపలి నించే సబ్ వే కనెక్టివిటీ ఎలాగూ ఉంది కాబట్టి, అక్కడి నించే మా ప్రయాణం మొదలుపెట్టాం.న్యూయార్క్ సబ్వే ప్రపంచంలోని చాలా ప్రధాన నగరాల లో లాగా చాలా పెద్దది, చాలా నగరాల కంటే పాతదీ. మొత్తం 468 స్టేషన్లు, 24 సబ్వే లైన్ల తో అతి పెద్దది. అంతా ఒక్క రాత్రిలో తిరిగి చూసేందుకు సబ్వే గాలిలో నడిచినా , మా కాళ్లకి లేపనాలు ఉన్నా బావుండేదనిపించింది. నిజానికి న్యూయార్క్ సిటీ టూర్ బస్సు ప్రయాణంలో భాగంగా తిరిగి చూసినా, ఇంకా ఎవరికే ప్రదేశం చూడాలని ఉందో వాటిని స్టేషన్ల వరుస వారీగా లిస్టు తయారు చేసి చూడాలని అనుకున్నాం. సబ్వే లో సౌలభ్యం ఏవిటంటే, టాక్సీల కంటే అతి తక్కువ ఖర్చుతోనూ, ఎక్కువ వేగంగానూ వెళ్లొచ్చు. ఎక్కడెక్కి దిగినా టిక్కెట్టు ఒక వైపుకి $2.50. అయితే అందుకోసం మెట్రో కార్డొకటి కొనుక్కోవాలి. దానికి $2.75 చెల్లించాలి. అందులో ప్రతిసారీ 25 సెంట్లు ఉండిపోతాయి. సాధారణంగా రెండువైపులకీ టిక్కెట్టు కొనాలి కాబట్టి 5$ డాలర్లు అంతకంటే ఎక్కువ రీచార్జి చేసుకుంటే 5% బోనస్ లభిస్తుంది. అంటే ఉదాహరణకి $20 రీచార్జి చేసుకుంటే $21 డాలర్లు మనకు వాడుకోవడానికి లభిస్తుంది. కానీ ఇక్కడో చిక్కు ఉంది. రైలెక్కిన ప్రతీసారీ $2.50 పోతాయి. అలా నాలుగు సార్లు ఎక్కి దిగినా అందులో $1 డాలరు మిగిలిపోతుంది. మరలా రీచార్జి చేసుకుంటే గానీ ఆ $1 వాడుకోవడానికి లేదు. తప్పనిసరిగా $5 కి రీచార్జి చేసుకోవలసిందే.

https://plus.google.com/photos/104256037410703377895/albums/6062495248136648753?banner=pwa

NaaKallathoAmerica-36(Newyork-ReturnJourney)

9/11 ఘటన జరిగిన ప్రదేశం ఏవి చూస్తాం? పైగా 9/11 మెమోరియల్ లోపలికి వెళ్లి చూడాలంటే ముందుగా “విజిటర్ పాసులు” తీసుకోవాలి” అని సత్య అన్నాడు. తనన్నాడని కాదు గానీ”నిజానికి ఏవి చూస్తాం? అక్కడున్న ఖాళీ ప్రదేశపు కంచె చుట్టూ తిరిగి ఏవి చూస్తాం?? ఆకాశ హర్మ్యం కూలిపోతూ చేసిన ఆర్త నాదాల్నా? అసువులు బాసిన 2983 మంది జ్ఞాపకాలనా? ఏవి చూస్తాం?”….. ఏమో నాకైతే ఆ ప్రదేశం చూడకుండా న్యూయార్క్ నించి కదిలి రావడం ఇష్టం లేదని చెప్పేను. అందర్నీ ముందుగా అటే లాక్కెళ్ళేను. రాత్రి 8 గంటల వేళ ఆ సందు మలుపు తిరిగే సరికి నా గుండె గబగబా కొట్టుకుంది. నలు చదరపు పెద్ద ఖాళీ- ఏవీ కనబడకుండా చుట్టూ గుడ్డ తో కట్టిన కంచె. దానినానుకుని ఒక వైపుగా 9/11 మెమోరియల్ బిల్డింగ్ ఒక పక్క.
ఆ లోపల రెండు వరల్డ్ ట్రేడ్ టవర్ల స్థానే ఖాళీగా వదిలేసిన నలుచదరపు రిప్లక్టింగ్ పూల్స్, గట్లమీద రాసి ఉన్న పేర్లనీ… ఏవీ, ఏవీ చూడలేదు.

అయినా ఆ ప్రహరీ వరకూ వెళ్ళొచ్చాను. ఎందుకు? ఏమో. తెలీని అతీతమైన భావన. మనసు మూగగా రోదించి, ప్రార్థించింది.
ప్రపంచంలో మనిషి శాంతిని, అహింస ని ఎప్పుడు నేర్చుకుంటాడు?
అక్కడ దుర్ఘటన లో మరణించిన వారి బాధార్తనాదాలే కాదు, అలా ఆ సంఘటనకి కారణ భూతమైన తీవ్రవాద అణచివేతలో బుగ్గి పాలైన ఎన్నో ఆఫ్ఘన్ జీవితాలూ కళ్ల ముందు కదిలాయి.

ఆప్ఘన్ మీద గాలిలోంచి నిప్పులు కురిపిస్తున్న అమెరికన్ విమానాలు జ్ఞాపకం వచ్చాయి. ఆప్ఘన్ నేల మీద వేల, లక్షలాది మంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కులాడిన ఘటనలు కళ్ల ముందు కదిలాయి.
ఇక వరల్డ్ ట్రేడ్ సెంటర్ విషయానికొస్తే అది 7 బిల్డింగుల కాంప్లెక్స్. 7 భవంతులుగా ఉన్న ఈ ప్రదేశాన్ని వరుసగా ఒన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, టూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ….సెవెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వరకు 7 అడ్రసులుగా పిలుస్తారు.
అందులో ఒన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో “ఫ్రీడం బిల్డింగు” ని జ్ఞాపకార్థపు టవర్ లాగా నిర్మించారు. ట్విన్ టవర్స్ అందులో రెండు ఎత్తైన భవంతులు. మొత్తం పదహారు ఎకరాల స్థలంలో రెండు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భవంతులతో బాటూ సమూలంగా నాశనమయ్యాయి మిగతా 5 చిన్న భవంతులు.

ఒక పక్క వణికించే చలి. అయినా ఏదో చూడాలన్న ఆత్రం, తాపత్రయం. వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూడడం మాటేమో గానీ ఎక్కదికక్కడ కాపలా ఉన్న పోలిసు వాళ్లు, ఎత్తైన హర్మ్యాల మధ్య ఉన్న చిన్న సందుల్లో చిన్న వెలుతుర్ల మధ్య నుంచి నడిచి వెళ్లడం బాగా ఇబ్బంది అయ్యింది.దాదాపు అరగంట అక్కడే తిరుగాడి చేసేదేమీ లేక అక్కణ్ణించి బయలుదేరి సబ్ వే స్టేషనుకి నడక మొదలెట్టాం. దగ్గరే అయినా చలిలో పిల్లల్తో నడవడం వల్ల మరో అరగంట కి చేరుకున్నాం.

టైం స్క్వేర్:- టైం స్క్వేర్ కి చేరేసరికి దాదాపు 9 కావచ్చింది. సబ్ వే స్టేషను నించి ఎటు నడవాలో తెలియక కాస్త తికమక పడ్డాం. అన్ని వైపులా కోలాహలం గా తిరిగే జనాలు, వణికించే చలిలో బళ్ల మీద చికెన్ కబాబ్స్, ప్రెట్జిల్స్ వంటివి అమ్ముతున్న బండ్లు. అలా బండ్ల వద్ద అమ్మే వాళ్లంతా ఇండియన్సు లాగా కనిపించారు. నేనొక బండి గల వ్యక్తిని అడిగాను. “మీరు ఇండియనా” అని, కాదు బంగ్లాదేశి అని చెప్పాడు. మేం టైం స్క్వేర్ దరిదాపులకి వెళ్లేసరికి అందరికీ బాగా ఆకలి వేస్తూండడంతో నడుస్తూ కనబడినవన్నీ కొనుక్కు తింటూ ముందుకు సాగేం. ఒక కబాబ్ స్టిక్ $5 డాలర్లు, ఒక హాట్ డాగ్ $5 ఇలా ఏవేవో కొన్నుక్కు తిన్నాం. అసలు స్క్వేర్ టైం అంటే ఏ సందో అర్థం కాక తిరుగుతూ రోడ్ల కూడలి దగ్గర రోడ్డు దాటుతూన్న వాళ్లని కొంత మంది డబ్బులడగడం గమనించి అలాంటి ఒకతని దగ్గిరకి వెళ్లి అడిగాను. “టైం స్క్వేర్ ” అంటే ఎక్కడా అని. అతను ముందుకు చెయ్యి చూపిస్తూ “ఇక్కడి నుంచి ఆ కనబడే రోడ్ల మధ్య ఉన్న స్క్వేర్ అంతా” అని చూపించి, నేనిచ్చిన డాలరు తీసుకుని “మరలా వచ్చేటప్పుడు దారి తెలియకపోతే అడుగు” అని నవ్వుతూ అన్నాడు. అతి నల్లని అతని వొంటి మీద నలిగిన పాత చలి కోటు, గ్లోవ్స్ వేసుకోనందున చలికి తెల్లబడ్డట్టున్న అరిచేతులు, పాత బూట్లు. అలాంటి వాళ్లే ఆ చుట్టుపక్కల కుప్పలు తెప్పలుగా కనిపించారు. ఇక రోడ్ల పక్కన టీ-షర్టులు, న్యూయార్క్ ముఖ్య విశేష రూపాల రీతిలో తయారు చేసిన గాజు బొమ్మలు, టోపీలు, పర్సులు అమ్మేవాళ్లు అంతా చలిని లెక్క చెయ్యకుండా ప్లాట్ ఫారమ్మీద కూచున్న వాళ్లే.ఒక పక్క ధగద్ధగమాయమైన లైట్లతో, సంగీతంతో, పెద్ద పెద్ద లైవ్ డిజిటల్ స్క్రీన్స్, బిల్ బోర్డ్స్ అనబడే హోర్డింగులతో వెలిగి పోతున్న టైం స్క్వేర్ లో అడుగడుగునా జానెడు పొట్ట కోసం ప్రపంచంలో అన్ని దేశాలలో లాగే అల్లల్లాడే సామాన్య జీవితాలు నన్ను కలచి వేసేయి.

టైం స్క్వేర్ లో రోడ్ల మధ్య గా ఉన్న ఎర్రని మెట్ల వంటి స్టేజీ మీదకి పిల్లలు చలాకీగా పరుగు తీసేరు. నేను ఆ మెట్ల మీద కూలబడి మనుషుల్ని పరికిస్తూ కూచున్నాను.పిల్లల ఆనందం చెప్పనలవి కాదు, అవి కొనుక్కుంటాం, ఇవి కొనుక్కుంటాం అని పరుగులెడుతూన్న వీళ్లని చూసి ప్రపంచంలోని ఏ బాధాపట్టని పసి మన్సులు ఎంత గొప్పవి అనిపించింది.ఇక భోజనానికి చుట్టూ ఉన్న ఏ స్టాల్ దగ్గిరా, రెస్టారెంట్లలోనూ కూచోవాలని అనిపించలేదు. అలా కాంతి పుంజాలలో లీనమై ఏదో మహోత్సవం జరుగుతున్నట్లు జనం సందడిగా తిరుగుతున్న చోటి నుంచి కాస్త ఆవలికి వెళితేనే గానీ ఎవరికీ స్థిమితంగా అనిపించలేదు. పీజా ప్లేస్ లో పీజా, ఐస్క్రీమ్ షాపు లో డ్రైప్రూట్స్, ప్రెష్ ప్రూట్స్ వేసిన చల్లని యోగర్టులతో ఆ రాత్రి భోజనం సరదాగా చేసేం.

షాఫుల్లోంచి బయటికెళ్తే చాలు, అతి చల్లని ఎముకలు కొరికే చలి, గాలి. అయినా నడవక తప్పదు. ఎక్కడో ఉన్న మా హోటల్కి మరొక గంట ప్రయాణం చెయ్యకా తప్పదు.తిరుగు ప్రయాణం లో పిల్లలకి రైలెక్కగానే నిద్రొచ్చేసింది. ఒక పక్క వరు, మరో పక్క సిరి నా భుజాలకి వేళ్లాడి నిద్రపోయారు.సబ్ వే ల గురించి చెప్తూన్నపుడు మరో విషయం చెప్పడం మరిచాను.
అపరిశుభ్రత నగరపు వీధులలోకంటే సబ్ వేలలో అధికంగా కనబడింది.
మెట్లు దిగుతూంటే రొచ్చు వాసన, లిప్ట్ల లోనూ దుర్వాసన. ఇక టికెట్లు కొందరు తీసుకునే వారైతే , కొందరు చక్కగా గేటు దుమికి వెళ్లిపోయే వారు.

వచ్చేసేటప్పుడు ఎంట్రెన్సు దగ్గిర బాలెన్సు మిగిలిపోయిన టిక్కెట్లని తమకి ఇచ్చెయ్యమని ఇద్దరు ముగ్గురు అడిగి పుచ్చుకుని, లోపలికి వెళ్లే వాళ్లకి అమ్మడం చూసి జన సమ్మర్దంగా ఉన్న ఏ నగరమైనా ఇంతేనన్న మాట అనిపించింది. ఇక మర్నాడు ఎయిర్పోర్టుకి సబ్ వే లో వెళ్ళాలన్న అలోచనని ఆ రాత్రి సబ్ వే లో ప్రయాణించేక మానుకున్నాం.
రాత్రి 12 గంటలు దాటేక ఎపుడో హోటల్కి చేరుకున్నామేమో బాగా మొద్దు నిద్దర పోయాం.

ఐ లవ్ న్యూయార్క్:- మర్నాడు మధ్యాహ్నం తిరుగు ఫ్లయిట్ మాకు. కానీ 11 గంటలకే మేం చెకిన్ కావాల్సి ఉంది. ఉదయం లేచి తీరుబడిగా హోటల్లోనే బ్రేక్ ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్ షటిల్ బుక్ చేసుకుని బయలుదేరిపోయేం. ఈ సారి అందరం “ఐ లవ్ న్యూయార్క్” చొక్కాలేసుకున్నాం. దారిపొడవునా మా అయిదుగురి షర్టులూ చూసి కనబడ్డవాళ్లంతా చిర్నవ్వుతో పలకరించేరు.ఆరురోజుల తర్వాత ఇంటి దారి పట్టేం. ఇంటి మీద బాగా బెంగ పడ్డట్టు పిల్లలు తిరిగి ప్రయాణానికి తెగ సంతోషంతో పరుగులు తీసేరు.ఫ్లయిట్ గాలిలోకి లేచి వంపు తిరిగి పశ్చిమ దిక్కుగా ప్రయాణిస్తూన్నపుడు కిటికీ లోంచి కింది భూభాగం ఎదురుగా పైకి ఆకాశం లో సగం పైకి లేచినట్లు కనబడింది. న్యూయార్క్ నగరపు ఆకాశ హర్మ్యాలన్నీ వెంట తరుముతున్న జ్ఞాపకాలతో మబ్బుల తెల్లని వీధుల్లోకి మా ఫ్లయిట్ ప్రవేశించింది. దాదాపు 6 గంటల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో లో దిగుతూనే “హోం స్వీట్ హోం” అని వరు ఆనందంగా మా అందరి కంటే ముందు బయటికి పరుగు తీసింది.

 – డా.కె.గీత

– See more at: http://vihanga.com/?p=12814#sthash.zkCcvrwL.dpuf

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s