నా కళ్లతో అమెరికా-39(ఎల్లోస్టోన్- భాగం-3)

సాల్ట్ లేక్ సిటీ నించి పొద్దున్న 9 గంటల వేళ బయలుదేరేం. రెంటల్ కారులో 400 మైళ్ళు పైనే ప్రయాణించి ఎల్లోస్టోన్ సౌత్ గేట్ దగ్గరలో ఉన్న మా బసకు రాత్రిలోగా చేరాలి. అయితే ఈ ప్రయాణానికి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి వేగంగా వెళ్లగలిగిన ఫ్రీవే, రెండు కాస్త లేటైనా మంచి సీనిక్ వే. తిరిగి వచ్చేటపుడు మాకు ఎక్కువ సమయం ఉండకపోవచ్చు. అందుకే కాస్త నిదానంగా ఇప్పుడే సీనిక్ రూట్ పట్టుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఆ దారి మూడు రాష్ట్రాల గుండా వెళ్తుంది.
సీనిక్ వే : దాదాపు గంట సేపటి తర్వాత, ఫ్రీవే నించి సీనిక్ వే లోకి మళ్లాం. ఈ దారిలో ఉన్న ఆకర్షణలన్నీ ముందుగానే అన్నీ రాసుకుని ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఆగాలో ముందే నిర్ణయించుకున్నాం. అందులో ఒకటి “రాస్బెర్రీ షేక్” తాగడం.
ఈ సీనిక్ రూట్ బ్రిఘాం సిటీ, బేర్ లేక్, మొంట్పెలిర్, ఆఫ్టన్, జాక్సన్ ల మీదుగా వెళ్తుంది. దాదాపు 6,7 గంటల సమయం పడుతుంది. కానీ మేం సాధారణం గా అక్కడక్కడ ఆగుతూ వెళతాం కాబట్టి మరో 2 గంటలు ఈజీగా పడుతుంది.
సాల్ట్ లేక్ సిటీ నుంచి బయలుదేరేటప్పుడే ప్రయాణంలో సాయంత్రం వరకూ కావలసిన మంచినీళ్ల సీసాలు, కూల్ డ్రింకులు వగైరా కొనుక్కుని కారు లో నింపుకున్నాం. ముందు రోజు అనుభవంతో బయటి ఎండ తీవ్రతకు అనుగుణంగా అన్నీ సర్దాం. వరుకు కారు ప్రయాణం లో బోరు కొట్టకుండా బయటికి మాతో బాటూ బయటికి చూస్తూ కనబడ్డ ఊర్ల పేర్లు, రూట్లు, విశేషాలు వగైరా రాయమని పని అప్పగించాం. వరుకు పుస్తకాలు చదవడం, రాయడం అంటే బోల్డు ఆసక్తి. చక్కగా బుద్ధిగా కూచుని గంటల తరబడి ఉన్న చోటు నించి కదలకుండా రాస్తుంది. కారు వెళ్తున్న దారిలో కనబడ్డ విశేషాలని వీడియో రికార్డింగ్ చెయ్యమని కేం కార్డర్ ఇచ్చాం. ఇంకేం, ఈ ప్రయాణపు విశేషాలతో తనొక బ్రహ్మాండమైన పర్సనల్ ట్రావెలోగ్ తయారు చేసింది. ఇక సిరి బాగా చిన్నదైనా పుస్తకం, పెన్ను అంటే తనకీ ఇష్టమే. తనూ రాస్తుంది కానీ ఏ భాషో చెప్పడం కష్టం అంతే. ఇక కారుని గంటకొక సారి గానీ, ఆగాలని అనిపించినప్పుడు గానీ ఆపుతూ, ప్రతీ సారీ పిల్లల్ని కిందకు దించుతూ ఉన్నాం కాబట్టి పేచీలు లేవు వీళ్లతో.

Previous Image

Next Image

On the Way

 బ్రిఘాం సిటీ దాటుతూనే పర్వత శ్రేణి లోకి అడుగు పెట్టాం. దారిలో రోడ్డుకి దిగువన చక్కని సెలయేరు కనిపిస్తూంది. కాస్సేపు ఆగి వెళ్దామని కిందికి ఉన్న 10 మెట్లు దిగేం. చూడ చక్కని అత్యంత రమణీయమైన ప్రదేశమది. చల్లగా గలగలా ప్రవహిస్తున్న కాలువ, ఒడ్డున నడవడానికి చక్కని రహదారి. కొంచెం ముందుకు వెళ్లగానే నీడనిచ్చే చెట్టు కింద వంటలు వండుకుని చిన్న పార్టీ చేసుకుందుకు బల్లలు, బార్బెక్యూ ఏర్పాట్లు, ఎదురుగా నీటి పైకి వేళ్ళాడుతూ ఎక్కడానికి ఊరిస్తున్న చెట్టు కొమ్మలు, దాటి ముందుకడుగెయ్యగానే అటు వైపు దాటడానికి చిన్న చెక్క వంతెన. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివి, కలలుగన్న అందమైన దృశ్యాల సమా హారం ఈ ప్రదేశం. నిజానికి అదొక చిన్న లాకు లాంటిది. ఆ ఊరి పేరు లోగన్. దాదాపు గంట అక్కడే గడిపేసేం. మేం ఇంకా 250 మైళ్ళు వెళ్ళాల్సి ఉన్నందున అక్కడి నుంచి కదలాల్సి వచ్చింది. అక్కడక్కడా ఒడ్డున చిన్న గేలాలు వేసుకుని చేపలు పడుతున్న ఔత్సాహికుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాం.
చుట్టూ పర్వతాల మధ్య పచ్చని చెట్ల సాక్షిగా మేఘాలు ప్రతిబింబిస్తున్న సెలయేటిని వదిలి రావడానికి మనసు ఎంత విలవిల్లాడిందో చెప్పలేను. చివరగా నేనే వస్తూ ఆగిపోవడాన్ని చూసి, సత్య మరో అయిదు నిమిషాల్లో నన్ను వచ్చేయమని కేక వేసి, పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. వరు వాళ్ల డాడీతో “మమ్మీ ఇప్పుడు అక్కడ కూచుని పోయెం రాస్తుందా” అనడం వినిపించింది.
బేర్ లేక్ : లోగన్ నించి అందమైన “కాచె నేషనల్ ఫారెస్ట్” గుండా ముందుకెళ్తే మరో రెండు గంటల వ్యవధిలో “బేర్ లేక్” కి చేరతాం. బేర్ లేక్ కొండల నించి దిగుతూ ఉండగా దూరంగా కనిపించడం మొదలు పెట్టింది. అక్కడి నించి ఉన్న వ్యూ పాయింట్ దగ్గిర ఆగి అందాల ఆ దృశ్యాన్ని తనివితీరా చూసి, కొండ కిందికి వెళ్లేం. ఆ ఊరి పేరు “గార్డెన్ సిటీ”. ఇక్కడే నేను చవి చూడాలని తహతహలాడిన “రాస్ బెర్రీ షేక్స్” అమ్మేది.
బేర్ లేక్ మంచి నీటి సరస్సు. యూటా, ఐదహో రెండు రాష్ట్రాల సరిహద్దుగా మధ్యన దాదాపు 18 మైళ్ల పొడవు, 7 మైళ్ల వెడల్పులో విస్తరించి ఉంది. లేత నీలి రంగుతో ఆకాశంతో పోటి పడ్తూన్నట్లుంటుంది ఈ సరస్సు. అంతర్భాగాన ఉన్న లైం స్టోన్ ల వల్ల లేత నీలి రంగుని సంతరించుకుందట. లేక్ ని ఆనుకుని ఉన్న గార్డెన్ సిటీ లోయలో అత్యధికంగా “రాస్ బెర్రీల” పంట పండుతుంది. ఏటా ఇక్క “రాస్ బెర్రీ పండుగ” జరుపుకోవడం ఆనవాయితీ.
రాస్ బెర్రీ షేక్ : అప్పటికే మధ్యాహ్న భోజన వేళ దాటి పోతూండడంతో భోజనం చేసి, భోజనానంతరం “రాస్ బెర్రీ షేక్” తీసుకుని వెళదామని నిర్ణయించుకున్నాం. ఎక్కడా ఖాళీలు లేని రెస్టారెంట్లని వదిలి కొంచెం ముందుకు వెళ్లి, పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉన్న చిన్న టేకవుట్ ప్రదేశం దగ్గిర ఆగేం. అక్కడే షేక్స్ కూడా అమ్ముతూండడంతో మహదానందపడ్డాం. ఆ చిన్న హోటల్లో తలెత్తి చూస్తే అందుకొనేంత ఎత్తులో ఉంది రూఫ్. అక్కడ వరసగా ఒక డాలర్ నోట్లు ఎన్నున్నాయో లెక్కలేనన్ని సంతకాలు చేసి రూఫ్ కి అతికించి ఉన్నాయి. మొదట ఎవరో ఒకరికి అలా అతికించాలని బుద్ధిపుట్టింది కాబోలు, ఇక అంతా అదో వేలం వెర్రి తయారైనట్లుంది. మొత్తానికి భోజనం గా బర్గర్లు, ఫ్రెంచ్ ప్రైస్ వంటివి తీసుకున్నాం. ఇక ఆ వెంటనే అతి పెద్ద డిస్ పోసబుల్ గ్లాసు నిండా ఇచ్చిన ఐస్క్రీం వంటి “రాస్ బెర్రీ షేక్” ను చూడగానే నన్ను చూసి నవ్వడం మొదలు పెట్టేరు వీళ్లు. అదంతా తాగడం ఒక్కళ్ల వల్ల కాదు. అయినా తాగడం అనకూడదు, తినడం అనాలి. తింటూంటే రాస్ బెర్రీ ల ప్లేవర్, గింజలు నోటికి తగులుతూ బానే ఉంది ఐస్క్రీం కం షేక్ కానీ, భోజనానంతరం ఆ షేక్ తినేసరికి ‘ఇక మరెప్పుడూ ఇలాంటివి ఆర్డర్ చెయ్యకూడదురా భగవంతుడా!’ అనిపించేసింది. అదే చెప్పేసరికి ఇంకా పడి పడి నవ్వారు వీళ్లు.
ఈ చుట్టుపక్కల ఒక రోజు పూర్తిగా గడపాల్సిన విశేషాలున్నా మేం ఒక్క రోజులో ఇంకా చాలా చూడాల్సి ఉండడం వల్ల ముందుకు బయలుదేరాల్సి వచ్చింది.
పారిస్ : మరో గంట లో మోంటిపెలియర్ దాటి ముందుకు వెళ్తూండగా “పారిస్” అనే చిన్న ఊరు కనిపించింది. ఆ చుట్టుపక్కల ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాంతాలన్నిటికీ ఫ్రాన్స్ లోని పేర్లు పెట్టుకున్నారట. ఇక నేనెప్పటి నుంచో ఫ్రాన్స్ వెళ్లి పారిస్ చూడాలని సత్య తో అంటుండడంతో “ఇదిగో, పారిస్ వచ్చేసింది చూసెయ్యి, అని ఆపాడా ఊర్లో.” కారు రోడ్డు పక్కన ఆపుతూనే ఎదురుగా ఉన్న పెద్ద చర్చి దగ్గర ఫోటో తీసుకుందామని కారు దిగేం. అంతలో అక్కడ చర్చి వైపు రోడ్డునానుకుని ఒక చిన్న బూత్ లో కూచుని ఉన్న ఇద్దరు పెద్ద వయసు మగ వాళ్లలో ఒకాయన పరుగెత్తుకు వచ్చి తనక్కడ వాలంటీరునని పరిచయం చేసుకున్నాడు. మమ్మల్ని చర్చి చూసి వెళ్ళండని ఆహ్వానించాడు. సమయం తక్కువే ఉన్నా అయిదు నిమిషాలలో చూసొద్దామని లోపలికి వెళ్ళేం. సాల్ట్ లెక్ సిటీ లో చూసినటువంటి పద్ధతిలోనే కట్టిన మోర్మన్ చర్చి అది. అక్కడితో పోలిస్తే చిన్నదే అయినా, చాలా అందంగా ఉంది. దాదాపు 2000 మంది ఒక్క సారి కూచోగలిగిన ఆ హాలు ఎప్పుడూ నిండలేదట. ఎందుకంటే ఆ ఊరి జనాభా కేవలం 500 అని చెప్తే ఆశ్చర్య పోయాం. ఆ పెద్ద వాళ్లిద్దరూ ఊర్లో వ్యాపారాలున్న ప్రముఖులు, అయితే చర్చి కోసం రోజులో కొంత సమయం వాలంటీర్లు గా పనిచేస్తారట. అతనితో కొంచెం సేపు మాట్లాడి, సెలవు తీసుకున్నాం. ఐదహో, వ్యోమింగ్ రాష్ట్రపు సరిహద్దుల్లో ఉంది పారిస్.
ఈ ప్రయాణం లో మేం ఇంత వరకు యూటా, ఐదహో రాష్ట్రాలు దాటి, ఒక్క పూట లో మూడో రాష్ట్రం లో అడుగుపెట్టాం.
వ్యోమింగ్ లో కూడా దారంతా అటవీ ప్రాంతమే. ఇక వ్యోమింగ్ రాష్ట్రంలో ముందుగా మేం చూసిన ఊరు ఆఫ్టన్. రోడ్దుకి ఇట్నించటు వరకు ఈ ఊరి పేరుతో ఉన్న స్వాగత తోరణం ఈ ఊరి ప్రత్యేకత. ఈ తోరణం ఇక్కడ పుష్కలంగా దొరికే ఎల్క్ కొమ్ములతో నిర్మించబడింది. ప్రపంచం మొత్తమ్మీద అతి పెద్ద ఆర్క్ ఇదే కావడమూ విశేషం. ఈ చుట్టుపక్కల పెద్ద కొమ్ములున్న దుప్పి జాతికి చెందిన ఎల్క్ లకు ప్రతీతి. ప్రతీ ఏటా వేసవి కాగానే వీటి కొమ్ములు రాలిపోయి, కొత్తవి పుట్టుకొస్తాయట. ఇలా రాలిపడిన కొమ్ములని సేకరించి ఆక్షన్ లో అమ్ముతారు. ప్రపంచ వ్యాప్తంగా మందుల తయారీలో
వీటికి ఎంతో గిరాకీ ఉంది.
జాక్సన్ హోల్ : సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో జాక్సన్ హోల్ అనే ఊరికి చేరుకున్నాం. ఈ ఊరు ఎల్లోస్టోన్ నేషనల్ పార్కుకి దక్షిణ ముఖద్వారం గా చెప్పొచ్చు.
ఎన్నో విశేషాలున్న చూడ చక్కని ఊరు. తిన్నగా ఊరు మధ్యనున్న డౌంటౌన్ కి చేరుకున్నాం. అక్కడున్న సెంట్రల్ పార్కు నాలుగు వైపులా ఉన్న ఎల్క్ కొమ్ముల తోరణాలతో అద్భుతంగా ఉంది. చుట్టూ ఉన్న రెస్టారెంట్లు, షాఫులు, రోడ్ల మీద ఆ వేసవి సాయంత్రం నిండుగా అటూ ఇటూ తిరుగుతున్న జనాలతో సందడిగా ఉంది. ఉదయం నించి ప్రయాణించి, డ్రైవ్ తో అలిసి పోయి ఉన్నామని అనిపించకుండా హుషారుని తెచ్చిపెట్టిందా ప్రదేశం. మాకు మరో గంట సమయం ఉందా ప్రదేశం లో. అక్కణ్ణించి మా హోటల్ కు మరో గంట ప్రయాణం చేసి చీకటి పడే లోగా చేరుకోవాలి.
కాబట్టి గంట సేపట్లో చేయగలిగినదేమిటా అని చూసాం. అక్కడొక టూర్ కార్యక్రమం మొదలవబోతూ ఉంది. కాని అది మొత్తం 2 గంటల కార్యక్రమం. ఇక డౌంటౌన్ లో అటూ ఇటూ తిప్పే గుర్రపు బండి ఎక్కుదామని నిర్ణయించుకుని టిక్కెట్లు కొనుక్కున్నాం. గుర్రపు బగ్గీ లో రెండు మూడు వీధులు తిరిగి వచ్చేం. సరిగ్గా గంటలో ఇక అక్కణ్ణించి బయలుదేరి పోయేం.
వచ్చేటప్పుడు మరొక సారి జాక్సన్ లో ఆగి మిగతా విశేషాలు చూద్దామని సర్ది చెప్పుకున్నాం.
రిసార్టు- దోమలు : దాదాపు ఏడు గంటల వేసవి సంధ్య వేళ మా బసకు చేరుకున్నాం. ఎల్లో స్టోన్ నెషనల్ పార్కు ముఖద్వారమైన టైటన్ నేషనల్ పార్కుని ఆనుకుని ఉందా రిసార్టు. అంతా పెద్ద పెద్ద దుంగలతో చుట్టూ ఉన్న అటవీ ప్రదేశానికి అనుగుణంగా చెట్ల వరుసల్లో ఒదిగిన ట్రీ హౌస్ ల లాంటి అందమైన కట్టడాలున్న రిసార్ట్ అది. దగ్గరికి చేరుతూనే “అబ్బ! ఎంత బావుంది” అనిపించింది.
అయితే కారు దిగేంత వరకూ అసలు విషయం అర్థం కాలేదు. చుట్టూ దట్టం గా పెరిగి ఉన్న గడ్డి లోనుంచి కనిపించకుండా అదాటున కుట్టే అతి పెద్ద దోమలు దిగుతూనే భయంకరంగా కుట్టేయడం మొదలుపెట్టాయి.
మా కాటేజ్ వెనుక గా, కాస్త దూరంగా ఉంది. ఆఫీసు నించి అక్కడ వరకు నడిచే సాహసం చెయ్యడం కష్టమనిపించి ఒక్క ఉదుటున మరలా కారెక్కి కూచున్నాం. ఇక కాటెజ్ లోకి సామాన్లు మార్చే లోగానూ, అక్కణ్నించి రాత్రి భోజనానికి బయటికి వచ్చినపుడూ తప్పించుకునే వీలు లేకపోయింది. అక్కడే అర్జంటుగా బగ్ స్ప్రే వంటివి కొనుక్కుని వొళ్ళంతా స్ప్రే చేసుకున్నా ఫలితం లేకపోయింది. అప్పటికే కుట్టాల్సినన్నీ కుట్టేసేయి. ఇండియాలో దోమలు, దోమ కాట్లు మనకు కొత్తేం కాదు కదా. కానీ’ ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనంత పెద్ద దోమ కాట్లవి. కుట్టేటప్పుడు ఉన్న బాధ కంటే తర్వాత నెలరోజుల పాటు తగ్గని దద్దుర్లు వచ్చాయి నాకు. అవే తర్వాత ఎల్లో స్టోన్ లో ఉన్న నాలుగు రోజులూ నన్ను జ్వరమై పీడించాయి. ఇక ఎల్లోస్టోన్ లో కూడా మరిన్ని దోమలు కుట్టి, మొత్తం ప్రయాణం లో అపశృతి గా పరిణమించాయి.

-కె.గీత

– See more at: http://vihanga.com/?p=13630#sthash.ts5Mtdsj.dpuf

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s