నా కళ్లతో అమెరికా-43(హార్స్ట్ కాసిల్)

ఎప్పటిలా లాంగ్ వీకెండ్ సెలవులకి ఎటైనా వెళ్లాలని ఆలోచిస్తూండగా మా లిస్ట్ లో ఉన్న “హార్స్ట్ కాసిల్” ఇంత వరకూ చూడలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. హార్స్ట్ కాసిల్ మా ఇంటి నుంచి దక్షిణంగా, దాదాపు 200 మైళ్ల దూరంలో, మూడున్నర గంటల ప్రయాణంలో ఉంది.
ఒక రోజులో అంత దూరం వెళ్లి చూసి రావడం బాగా అలసటైన ప్రయాణం. మరో రోజు ఉంటే ఆ చుట్టు పక్కల ఇంకేవైనా కూడా చూసి రావొచ్చు. మేం రెండు రోజులకి హోటలు బుక్ చేసుకున్నాం. ఆ చుట్టుపక్కల చూసేవింకేమీ లేకపోతే సముద్రం ఉందన్న ధీమాతో.
బాగా చివరి వారం వరకూ ప్లాన్ చేయక పోవడం వల్ల మంచి ఎకామడేషన్లు దగ్గర్లో ఖాళీ లేవు. ఆన్లైను లో చూసి అక్కడి నుంచి మరో 20 మైళ్లు దక్షిణంగా ఉన్న “మొర్రో బే” లో బుక్ చేసాం. అదెంత మంచి పనో అక్కడికి వెళ్లేంత వరకూ అర్థం కాలేదు.
హార్స్ట్ కాసిల్ చూడడానికి ముందుగా టూర్ బుక్ చేసుకోవాలి. శనివారం మధ్యాహ్నానికి “హార్స్ట్ కాసిల్” లో “గ్రాండ్ రూంస్” టూర్ బుక్ చేసాం.

ఉదయం తొమ్మిదింటికి బయలుదేరినా 12 గంటలకు కాసిల్ కు వెళ్లిపోతాం. అయితే దారిలో లంచ్ ఎక్కడైనా స్థిమితంగా చేసుకున్నా సమయం సరిపోతుంది. కానీ ఉదయం ఇంటి నుంచి బయట పడేసరికే పదయ్యింది. ఇక సత్య హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ఎక్కడా ఆగేది లేదని తిన్నగా హార్స్ట్ కాసిల్ కు వెళ్లితీరాలని పట్టుబట్టాడు. అయినా పిల్లలతో అవన్నీ జరిగే పనులు కావు కదా! దారిలో రెస్ట్ ఏరియాలో ఆగినప్పుడు ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీలు తిన్నాం. సరిగ్గా పది నిమిషాలలో మమ్మల్ని తొందర పెట్టి బయలుదేర దీసాడు. మొత్తానికి అనుకున్న సమయానికి కాసిల్ కు చేరుకున్నాం.
కాసిల్ వివరాలలోకి వస్తే –
కాలిఫోర్నియా మధ్య సముద్ర తీరంలోని పర్వత ప్రాంతంలో దాపాపు 40,000 ఎకరాల్ని జార్జి హార్స్ట్ 1865 లో కొన్నాడట. జార్జి ఒక్కగానొక్క పుత్రుడు విలియం రాండాల్ఫ్ హార్స్ట్ 1919 లో 2,50,000 ఎకరాలుగా వృద్ధి చెందిన ఆస్తిని తండ్రి తదనంతరం పొందాడు.

విలియం రాండాల్ఫ్ హార్స్ట్ అప్పటి న్యూస్ పేపర్ రారాజు. “శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్”, “న్యూయార్క్ జర్నల్” వంటి ప్రఖ్యాత పేపర్ల అధిపతి. ఎల్లో జర్నలిజం మొదటిగా అమెరికాలో ఈ పత్రికల ద్వారానే ప్రవేశించిందని చెబుతారు. ఇలా ఎల్లో జర్నలిజం తోనూ, రాజకీయాలలోనూ రాణించాలని ప్రయత్నం చేసిన విలియం తర్వాతి కాలంలో అమెరికాకు స్పెయిన్ తో యుద్ధానికి పరోక్షం గా కారకుడయ్యాడంటే అతిశయోక్తి కాదు. ఎనభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఆయనకు అత్యంత ఇష్టమైన “హార్స్ట్ కాసిల్” నిర్మాణం తరాల తర్వాత ఇప్పటికీ ఆయన స్మరణకు కారణమయ్యింది. విలియం 1947 లో జూలియా మోర్గాన్ అనే ఆర్కిటెక్ట్ ను కుదుర్చుకుని దాదాపు 127 ఎకరాలలో 165 గదులతో గొప్ప భవంతిని, చుట్టూ ఉద్యాన వనాలతో అత్యంత అందమైన ప్రదేశం గా ఈ హార్ట్స్ కాసిల్ ను తీర్చిదిద్దాడు. ప్రస్తుత కాలంలో ఇది కాలిఫోర్నియా లో చారిత్రాత్మక ప్రదేశం గా, చూడ చక్కని పర్యాటక ప్రదేశంగా విలసిల్లుతూ ఉంది.

Previous Image

Next Image

Bus to Hearst Castle

విలియం కాలంలో హార్స్ట్ కాసిల్ లో అతిథులుగా ఒకరోజు ఉండాలన్నా ఆయన నించి స్వయంగా ఆహ్వానం అందాల్సిందే. రాజకీయ, సినీ ప్రముఖులకు అక్కడ ఎప్పుడూ విందులూ, విలాసాలతో ఇక్కడ ఆతిథ్యం అందేది. విలియం విలాసవంతమైన శేష జీవితాన్ని ఈ కాసిల్ లో గడిపాడు.

ఇక మేం కాసిల్ కు చేరేసరికి మేం బుక్ చేసుకున్న టూర్ కి మరో గంట సమయం ఉండడం తో 30 ని||ల పాటు విలియం జీవితాన్ని, హార్ట్స్ కాసిల్ నిర్మాణాన్ని గురించిన షో చూసేం. తల్లితో బాటూ విలియం యూరప్ పర్యటన, ఆ విశేషాల్ని పోలిన ప్రదేశాల్ని అమెరికాలో సృష్టించాలని కలలు కనడం, ఆ కలలన్నీ ఈ కాసిల్ ద్వారా సాకారం చేసుకోవడం, ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులతో విలియం ఫోటోలు, వీడియో క్లిప్పులు చూపించేరు.
విలియం కలకనుగుణంగా నిర్మాణాన్ని సాగించిన ఆర్కిటెక్టు “జూలియా మోర్గాన్” కాలిఫోర్నియాకి మొదటి మహిళా ఆర్కిటెక్టు కావడం విశేషం.పిల్లలు థియేటర్ లో నుంచి బయటకు రాగానే మళ్లీ ఆకలి అన్నారు. గబగబా కాస్త స్నేక్ తిని మా టూర్ బస్సు లైను లో కి పరుగెత్తాం.విజిటింగ్ సెంటర్ నించి కాసిల్ చాలా దూరం లో ఉంటుంది.

హార్స్ట్ కాసిల్ లో రెండు మూడు రకాల టూర్లు ఉన్నాయి. గ్రాండ్ రూంస్ టూర్, అప్ స్టైర్ సూట్స్ టూర్, కాటేజెస్ & కిచెన్ టూర్. ఒక్కొక్క టూర్ కు $25 డాల్కర్లు టిక్కెట్టు. ఇందులో ఏ టూర్ కి వెళ్లినా మళ్లీ మరొకటి కొత్తగా చూడాల్సిందే. ఇందులో మొదటి టూర్ ని మాత్రమే ఎంచుకున్నాం మేం. టూర్ చూడడం అయిపోయేక టిక్కెట్ల ఖరీదు చాలా ఎక్కువ అనిపించింది. మూడు టూర్లూ కలిపి తగ్గింపు పాకేజీ లేకపోవడం మరొక మైనస్ పాయింటు.

విజిటింగ్ సెంటర్ నించి బస్సు బయలుదేరి మట్టి రోడ్ల మలుపుల కొండ చుట్టూ మలుపులు తిరుగుతూ వెళ్తూంది.
మరీ దగ్గరేమీ కాదు కాసిల్. దాదాపు 20 ని||లు మెల్లగా ప్రయాణించే బస్సు నుంచి కాసిల్ కు వెళ్లే దారంతా జంతు రక్షణా కేంద్రం కావడం వల్ల దారిలో జింకలు, దున్నలు కనిపిస్తూ ఉన్నాయి. విలియం కాలంలో ఇక్కడ పూర్తి “జూ” ఉండేదట. ఇప్పుడు జిరాఫీలు మొ.న కొన్ని జంతువులు మాత్రం మిగిలాయట.

కాసిల్ ముందు ఎత్తుగా ఉన్న మెట్ల దిగువన ఆగింది బస్సు. ఎదురుగా హూందాగా అద్భుతంగా కనిపిస్తూంది కాసిల్. ప్రతీ చోటా ఇలా ఎక్కి దిగే మెట్ల వల్ల మరింత అందం వచ్చినట్లయ్యిందక్కడ.

పేరుకి కాసిల్ కానీ మరీ పెద్ద కోట కాదు. యూరోపియన్ పద్ధతుల్లో కట్టిన శిల్ప విశేషాలు స్వాగతం పలుకుతూండగా విశాల మైన ముందు ప్రాంగణం లోకి అడుగుపెట్టాం. చిన్న చిన్న ఫౌంటైన్ లు వాటి మధ్య ఉన్న ఉన్న శిల్ప చాతుర్యాల గురించి గైడు వివరిస్తూ ఉన్నాడు.

ప్రధాన భవంతి ముందు ద్వారం మూసి ఉంది. అందు వల్ల పక్క నున్న చిన్న ద్వారం నుంచి లోపలికి తీసుకు వెళ్లారు.
ముందుగా అతిథులకు స్వాగంతం పలికే పెద్ద సిట్టింగ్ రూం లోకి ప్రవేశించాం.
ఎక్కడ చూసినా గొప్ప సౌందర్యం ఉట్టిపడే తివాచీలు, సోఫాలు, బల్లలు, గోడలకు ప్రత్యేకించి నగిషీలు చెక్కిన శిల్పాకృతులు, పెద్ద పెద్ద వేళ్లాడే కలంకారీ చిత్రాలు, గొప్ప షాండ్లియర్లు… ప్రపంచంలోని ధనమంతా అక్కడ గుమ్మరించినట్లు అత్యంత ఠీవిగా ఉందా హాలు. కొత్తగా వచ్చిన అతిథులు రాగానే ఇక్కడ వేచి ఉండే వారట. ఇక్కడికి విలియం స్వయంగా వచ్చి, అతిథులను వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లేవాడట. ఆ వెనుకే గోడ లోపలికి తెరుచుకున్నట్లు ద్వారం లో నుంచి దానిని పోలిన మరొక హాలు. ఇది అప్పటికే వచ్చిన అతిథులు సేద తీరుతూ టీ సమయం గడిపే గది.

ఆ వెనుక దాదాపు యాభై, అరవై మంది ఒక్క సారి భోజనం చెయ్యగలిగిన పెద్ద టేబుల్, కుర్చీలతో భోజనాల గది. ఒక పక్కగా అప్పటి వస్తువులన్నీ యథాతథంగా ప్రదర్శనకు ఉంచినందు వల్ల ఎవరో అప్పుడే భోజనాలకు కూర్చోబోతున్నట్లు అందంగా అమర్చి ఉన్నాయి. ఎక్కడ చూసినా వెండి వస్తువులు, గొప్ప నగిషీల సోయగాలు. దాదాపు ఇరవై అడుగుల ఎత్తున ఉన్న భోజనాల గదికి అన్ని దేశాల జెండాలు అలంకరించి ఉన్నాయి. అంతేగాక పై కప్పు బైబిలు కథలకు సంబంధించిన కథనపు చెక్క పలకల చిత్రాలతో దర్శనమిచ్చింది. తర్వత అతిథుల వినోదర్థమై సొగసులొలికే బిలియర్డ్స్ వంటి ఆట గదులు, విశ్రాంతి గదులు దాటి ముందుకెళితే చివరగా చిన్న సైజు థియేటర్ వస్తుంది. వంద మంది వరకు కూర్చుని చూడగలిగిన చలన చిత్ర ప్రదర్శనశాల అది. ఎక్కడా ఏవీ ముట్టుకోవద్దని రాసినందువల్ల గానీ అన్నీ తాకి చూడాలనే బుద్ధి పుడుతుంది ఎవరికైనా.

లోపలంతా చిరు చీకటిగా ఉంది. ఆ అలంకరణ వల్లా, గదుల్లోకి సరైన వెంటిలేషన్ లేకపోవడం వల్లా. అంతే గాక దాదాపు వంద సంవత్సరాలు కావస్తూన్నందున కార్పెట్లు, గోడలకు వేలాడే చిత్రాలు పాతదనంతో వెలిసిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల చెక్క తో నగిషీలు మాత్రం మెరిసిపోతూ ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు అడుగు పెట్టగానే బయటి పాలరాతి శిల్పాల వెలుగుకి కళ్లు మిరుమిట్లు గిలిపేయి.

బయటి నించి నడుచుకుంటూ ఆ భవనాన్ని చుట్టి, చుట్టూ ఉన్న ఇతర విశేషాలు చూస్తూ ఎంత సేపైనా గైడు సాయం లేకుండా విహరించొచ్చు.
భవనపు పై గదులు, మరో భవనం లో ఉన్న పడక గదులు వెరే టూరు, భవనాన్ని ఆనుకుని ఉన్న వంటిళ్లు వగైరాలు వేరే టూరు అని మొదటే చెప్పుకున్నాం కదా. అవన్నీ బయటి నించే చూసి ఆనందించేం మేం.

రకరకాల అందమైన పూల చెట్లు, ఫల వృక్షాల మధ్య ఎక్కి దిగే మెట్లు దాటి, స్విమ్మింగ్ పూల్ ఉన్న ప్రదేశానికి చేరుకున్నాం. దాని పేరు “నెప్ట్యూన్ పూల్”. పేరుకి తగ్గట్లుగా ఆ చుట్టుపక్కల యూరోపియన్ పద్ధతిలో అందమైన తెల్లని శిల్పాలు కనువిందు చేస్తాయి. కొలను ప్రారంభంలో ఎదురుగా ఉన్న మంటపం రోమన్ పద్ధతిలో నిర్మించబడింది.

అది అతి పెద్ద స్నాన వాటిక. ఒలింపిక్ ఈత పోటిలూ జరుతాయన్నంత పెద్దది. అత్యంత అందమైన ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్ అది. చుట్టూ తెల్లని ప్రతిమలతో ఎటు చూసినా అందాలు చిందే భువన మోహన సౌందర్య కొలను. కొలను చుట్టూ ఎత్తులో విశ్రాంతి మంటపాలు ఉన్నాయి.

మేం అక్కడ దాదాపు అరగంట ఊరికే అలా అందాన్ని ఆస్వాదిస్తూ కూచుండిపోయాం. నిజానికి పూల్ లో ఇప్పుడు నీళ్లు లేవు. ఉండి ఉంటే మరింత అందంగా కొలనులో దోబూచులాడే ఆకాశమూ కనిపించేది.

అక్కడికి మరో వైపు నడిస్తే ప్రాంగణం లోపల “ఇండోర్ స్విమ్మింగ్ పూల్” వస్తుంది. దీని పేరు “రోమన్ పూల్”. నెప్ట్యున్ పూల్ తో పోలిస్తే చిన్నదైనా చక్కని నీలి రంగుతో మరొక అందమైన పూల్ ఇది.

అక్కడ ఉన్నంతసేపూ ఆ కాలంలోకి ప్రయాణించినట్లు మైమరిచిమనసు గాలిలో గిరికీలు కొట్టింది.
ఉద్యాన వనంలో అలా విహరిస్తూ, దూరాన ఆకాశం లో కదులుతున్నట్లు సముద్ర కెరటాలని చూస్తూ విలియం ఎంత మైమర్చిపోయేవాడో తెలియదు గానీ నాకు మాత్రం ఒక నిర్వేదంతో కూడిన విచిత్ర భావన కలిగింది. మనిషి జీవితం ఎంత అశాశ్వతం అనిపించింది. సంపదలెన్ని ఉన్నా చివరికి ఇలా ఎవరో ఆస్వాదించాల్సిందే ఎప్పటికైనా. కానీ బతికి ఉన్నంత కాలం అటువంటి అందమైన స్వప్నంలో జీవించగలిగిన విలియం పై కాస్త అసూయ కూడా కలిగింది.

అప్పటివెన్నో మారిపోయినా కాలంతో మారకుండా దీటుగా ధీమాగా చిరునవ్వులొలికిస్తున్న హార్స్ట్ కాసిల్ ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంది.
ఒకప్పుడు ఒక “ధనవంతుని అందమైన స్వప్నం” ఇప్పుడు ఇక్కడ అందరికీ అందిన “కలల స్వప్నం”.

 – కె.గీత 

– See more at: http://vihanga.com/?p=14745#sthash.OmzvXBLD.dpuf

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s