నా కళ్లతో అమెరికా- 44 (మొర్రో బే,భాగం-1)

విలియం హార్ట్స్ మెమోరియల్ బీచ్ :

హార్ట్స్ కాసిల్ నించి బయటకు వచ్చేసరికి సంధ్య వెలుతురు ఇంకా తళతలా మెరుస్తూ ఉంది. కాసిల్ మలుపు నించి సముద్ర తీరపు రహదారి మీదికి తిరగకుండా కారుని ఎదురుగా ఉన్న “విలియం హార్స్ట్ మెమోరియల్ బీచ్” అని బోర్డు ఉన్న చోటికి పోనిచ్చాను. అక్కడ సముద్రం లోకి కొంత మేర చెక్క వంతెన కట్టి ఉంది. ఒకప్పటి ప్రాభవానికి గుర్తులక్కడ ఏవీ లేవు. హార్స్ట్ కాసిల్ మీది నుంచి విలియం కంటి తో చూసిన మెరిసే సముద్రం ఇక్కడ అలల ఘోషతో ఎగిసిపడ్తూ ఎప్పటివో కథలన్నీ వినిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి కాసిల్ కనించదు. కానీ తడి ఆరని జ్ఞాపకాలు గుండెని తడ్తూ ఉన్నాయి. బ్రిడ్జి మీది మించి ఇరు వైపులా కనుచూపుమేర విశాల మైన సముద్రాన్ని, రెండు చేతులా ఆర్తిగా హత్తుకుని, మౌనంగా వీడ్కోలు తీసుకున్నా.
మొర్రో బే : అక్కడి నుంచి మరో ముప్ఫై మైళ్ల దూరంలో ఉన్న మా బస “మొర్రో బే” వైపు దారి తీసాం. దారిలో కాంబ్రియా ఊరు చూడచక్కనిది. దారంతా సముద్రాన్ని ఆనుకుని ఉన్న హైవే ఒకటి మీదుగా సాగింది.

మొర్రో బే ఛాయాచిత్రాలను ఇక్కడ క్లిక్ చేసి చూడండి .

కాయూకోస్ ఊరు ముందు వచ్చింది. అక్కడ పెట్రోలు కోసం ఆగేం. అక్కడి నుంచి సముద్రంలో అస్తమించే సూర్యుణ్ణి చూడడం కోసం చాలా మంది వచ్చి ఉన్నారు. పది నిమిషాలు మేమూ ఆగి ఆ సుందర దృశ్యాన్ని అపురూపంగా దాచుకున్నాం. అక్కడి నుంచి సముద్రంలోకి సాగి ఉన్న చిన్న కొండ ఆకాశం లోకి పెద్ద రాతి గిన్నె బోర్లించినట్లు అందంగా కనిపిస్తూ ఉంది. ఈ ఊరికి మళ్లీ వెళ్లేటప్పుడు వచ్చి మరింత సేపు గడిపి వెళ్లాలని అనుకున్నాం. తీరా చూస్తే కాయూకోస్, మొర్రో బే దాదాపు కలిసి ఉన్న ఊళ్లే. అయిదు నిమిషాల్లో మా హోటల్ ఉన్న మొర్రోబే కు చేరుకున్నాం.
హోటల్ గది కిటికీ నుంచి బయటకు చూసేసరికి అక్కడెక్కడి నుంచో కనబడిన కొండ సరిగ్గా ఎదురుగా ఉంది. నా ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
ఆ రోజు శనివారం. సాధారణంగా శనివారాలు రాత్రి ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నాయేమో వెతుకుతాం. దగ్గర్లో ఎక్కడా ఇండియన్ రెస్టారెంట్ల జాడ లేదక్కడ. ఇక వెజిటేరియన్ భోజనానికి ఉత్తమం అనిపించి పీజా ప్లేస్ కు పోనిచ్చాం. పిల్లలకి పీజా చాలా ఇష్టం. పైగా రోజంతా తిరిగి తిరిగి అందరం బాగా ఆకలితో ఉన్నాం. మా ఆర్డరు రావడమే తరువాయి హడావిడిగా పీజా పని పట్టాం.

హోటలుకి తిరిగి చేరుకుని వేడి నీటి జకూజీ లో స్నానానికి వెళ్లి పూల్ కట్టేసే వరకూ వెచ్చని నీళ్లలో ఆడుకుంటూ సరదాగా గడిపేం.
తెల్లవారగానే కిటికీ తెరిచి ఉదయపు వెలుతురులో మెరిసే కొండని కళ్లనింపుకుంటూ ఉత్సాహంగా రోజుని ప్రారంభించాం.
ఎప్పుడెప్పుడెప్పుడు పర్వత పాదాలకి చేరతామా, కళ్ల ముందు దోబూచులాడుతున్న సముద్రపు నురుగులో పరుగులెడదామా అని ఆత్రంగా బయటికి అడుగుపెట్టాం.
మొర్రో బే దగ్గర భూభాగం అడ్దంగా చీలి కొంత సముద్రం వెనక్కి వచ్చినట్లు ఉంటుంది. ఒక పక్క పర్వతం, మరొక పక్క ఇలా చీలి ఏర్పడిన చిన్న ద్వీపకల్పం ఆ ఊరిని అత్యంత సుందరమైన సముద్ర తీరంగా మార్చేసాయి.
హోటలు నించి దిగువన ఉన్న బీచ్ రోడ్ లో డ్రైవ్ చేసుకుంటూ వస్తూంటే ఎడమ పక్కగా ఊరుని ఆనుకుని లోపలికి వచ్చిన నీళ్లు కెరటాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నాయి.

మొర్రో రాక్ :

సముద్ర తీరంలోనూ, రోడ్దుకిటు పక్కగా ఉన్న రకరకాల దుకాణాలు, ఆక్వేరియం మొదలైన విశేషాల వెంబడి సందర్శకులు అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు. తీరం వెంబడి చూడాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. అందంగా తీర్చిదిద్దిన బాట వెంట దుకాణాల్ని చూస్తూ నడవడం, పక్కనే ఉన్న చిన్న బోట్లనీ, సీగల్ పక్షుల్నీ, సీ లయన్స్ నీ చూస్తూ గడపడం చాలా బావుంటుంది.
ఇంతకీ ఎప్పటి నించో ఊరిస్తున్న పర్వతం దాపుకి చేరుకున్నాం. దాని పేరు “మొర్రో రాక్”.
దూరం నించి నున్నగా కనిపించిన పర్వతం దగ్గిరికి వెళ్లే సరికి పేరుకి తగ్గట్టుగా రాళ్లు మీదికి దొర్లుతాయన్నట్లు భీకరంగా ఉంది.
సముద్ర తీరం లో వెచ్చగా ఎండ కాస్తూన్నా నీళ్లు మాత్రం పసిఫిక్ తీరపు శీతలాన్ని ఒదులుకోలేనట్లు ఎ ప్పటిలానే అతి చల్లగా ఉన్నాయి.
ముందు పర్వతానికి ఎడమ పక్కకి వచ్చాం. సిరితో, నేను అలలు లేని నీటిని ఆనుకుని ఉన్న గోరు వెచ్చని ఇసుకలో ఆడుతూండగా సత్య వరుని తీసుకుని పర్వతానికి ఇటు చివర నడవ గలిగినంత మేరా చూసొస్తానని ముందుకెళ్లేడు. కానీ అక్కడ “డునాట్ క్లైంబ్” బోర్డు చూసి వెనక్కు మళ్లాడు.
అయితే సముద్రంలోకి కట్టిన రాతి వంతెన మీదికి కొంచెం దూరం వరకు వెళ్లొచ్చు. వీళ్లు వెళ్లి మరో అరగంట లో తిరిగొచ్చేరు.

మూడు వేళ్లు:

తీరాన్ని అనుకుని మూడు పొడవైన గొట్టాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మూడు స్తంభాల్ని ” మూడు వేళ్లు” అని పిలుస్తారు ఇక్కడ. ఇంతకీ అది 1950 లలో ప్రారంభంచబడి, 2014 లో ఫిబ్రవరిలో మూసివేయబడ్డ పవర్ ప్లాంట్. ఒకప్పుడు ఇక్కడి నుంచే కాలిఫోర్నియా సెంట్రల్ వేలీ అయిన ఫ్రెస్నో, బేకర్స్ ఫీల్డ్ ప్రాంతానికి విద్యుత్ సరఫరా జరిగేది.
మేం మొర్రో రాక్ కి ఒక పక్కన మాత్రమే చూసి, రెండో పక్కన అలలతో ఎగిసిపడే సముద్రాన్ని సాయంత్రం కోసం కేటాయించి, మళ్లీ ఊళ్లోకి వచ్చాం. పార్కింగు చాలా ఇబ్బంది కావడంతో దొరికిన చోట కారుని ఆపి ఇక తీర ప్రాంతమంతా నడిచి తిరిగేం.

బోట్ టూర్ :

ఎదురుగా ఊరిస్తూ కనిపిస్తున్న ఇసుక మేటల భూభాగానికి వెళ్ళడానికి బోట్ టూర్ ఎక్కేం. ఆ టూర్ అందరికీ భలే బాగా నచ్చింది. మొత్తం అంతా కలిపి గంట సేపే అయినా చిన్న బోట్ మీద షికారు చేస్తూ అటు తీరానికి వెళ్లేం. అక్కడ ఇసుక మేటల మీద పదినిమిషాలు చూసి తిరిగి రావాలి. నాకు గోదావరి మీద పాపికొండలకి వెళ్లిన జ్ఞాపకాలు తరుముకొచ్చాయి.
ఇసుక మీద అడుగిడడమే తరువాయి. పైకి పరుగులు పెట్టాం. మెత్తని, తెల్లని, అందమైన ఇసుక లో పసిపిల్లలమై గంటల తరబడి గడపాలనిపించింది. పదినిమిషాలలో పరుగులు ఆపి, నీటిని ఒరుసుకుని కొంచెం ఎత్తున గడ్ద కట్టిన ఇసుక మీద కూలబడి, నీళ్లలో కాళ్లు ముంచి పరవశించి అంతలోనే గైడు పిలుపు రావడంతో తిరిగెక్కాం. తిరిగొచ్చేటపుడు వంతెనల్ని ఆనుకుని బద్ధకంగా నిద్రపోతున్న సీ లయన్సు ని చూస్తూ వెనక్కు వచ్చేం.

సర్రే :

సముద్ర తీరపు దుకాణాల్లో ఒక చోట “స్కేట్ బోర్డు” మ్యూజియం అన్నచోట “ప్రపంచంలో పెద్ద స్కేట్ బోర్డు” ని ప్రదర్శనలో చూసేం.
అక్కడి లోకల్ సీఫుడ్ రెస్టారెంటులో మధ్యాహ్న భోజనం స్థిమితంగా పూర్తి చేసి, ఈ సారి సముద్ర తీరంలో సర్రే (సైకిల్ రిక్షా) ఒకటి అద్దెకు తీసుకుని అంతా కలిసి తొక్కడం మొదలు పెట్టాం. దాదాపు గంట సేపు మళ్లీ సముద్రతీరం వెంబడి మొర్రో రాక్ వరకూ తిరిగేం. వచ్చేటపుడు సిరి తనే నడుపుతానని బాగా పేచీతో ఏడుపు మొదలు పెట్టింది. సత్య సిరిని తీసుకుని మధ్యలోనే దిగవలిసి వచ్చింది. ఇక అక్కణ్నించి తిరిగి రిటన్ ఇచ్చేవరకు వరు, నేను దానిని నడపలేక పాట్లు పడ్డాం.
దాదాపు మూడున్నర, నాలుగు గంటల వేళ పర్వతపు రెండో దిక్కుకి వెళ్లేం.
———–
(ఇంకా ఉంది)

– డా.కె.గీత

http://vihanga.com/?p=15127#sthash.qqNbc9b0.dpbs

 

 

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s