నా కళ్లతో అమెరికా-46 సియాటిల్(భాగం-1)

సియాటిల్(భాగం-1)

కాలిఫోర్నియా అంతా అడుగు కూడా వదలకుండా తిరగడం పూర్తి అయిపోయి, ఇక పక్క రాష్ట్రాల్ని చుట్టి రావాలనే ప్రయత్నంలో ఈ ఏప్రిల్ నెలలో “ఎక్కడికి వెళ్లాలా” అని ఆలోచిస్తూండగా “ఇక్కడ వసంత కాలంలో తులిప్ పూల పండగ సియాటిల్ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతుంది” అని చెప్పారు స్నేహితులు. ఇక అది విన్నదే తడవు అందరినీ బయలుదేరదీసాను.

ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సత్య, పిల్లలు ముందుగా అడిగే ప్రశ్న”మాకేం చూసేవి ఉన్నాయి?”
ఎందుకంటే నేనెంత సేపూ పూల చెట్లు, నదీనదాలు, పర్వతాలు, సముద్రం అంటూ ఎక్కడెక్కడికో తీసుకెళ్తూ ఉంటాను.
సియాటిల్ చుట్టుపక్కల నా మనసుని అలరించేవి ఎన్నో ఉన్నాయి. అంత కంటే ఎక్కువగా పిల్లలకు నప్పేవీ ఉన్నాయి.
ఈ సారి మా అమ్మ కూడా మాతో ఉండడం నాకు మరి కాస్త ఉత్సాహాన్నిచ్చే ప్రయాణం.
అయితే తనకు వీలును కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయాణాన్ని ప్లాన్ చేయాల్సి ఉంది.
అంతదూరం డ్రైవ్ చేయడం పిల్లలకూ, అమ్మకూ కష్టమనిపించి విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నాం.
సియాటిల్ వరకూ ఫ్లై చేసి అక్కడ రెంటల్ కారు తీసుకుని 3,4 రోజులు చుట్టుపక్కల విశేషాలు చూసుకుని రావాలని నిర్ణయించుకున్నాం.
ఏప్రిల్ నెలలో మూడో వారంలో “స్ప్రింగ్ బ్రేక్” లో బుక్ చేసాం. విమాన ప్రయాణం లో అలసట ఉండదనుకుంటాం కానీ, ప్రయాణానికి
ముందో రెండు గంటలు, వెనకో రెండు గంటలూ పరుగులు తప్పవు.

సియాటిల్ మా ఊరి నించి 850 మైళ్లు ఉత్తరంగా కాలిఫోర్నియా, ఓరగాన్ రాష్ట్రాలు దాటి వాషింగ్టన్ రాష్ట్రం లో ఉంది.
సియాటిల్ నగరం వాషింగ్టన్ రాష్ట్రం లోనే కాక ఉత్తర అమెరికాలో 15 వ గొప్ప మహా నగరం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ నగరం యుద్ధ విమానాల తయారీకి ప్రతీతి. 80 ల తర్వాత మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాల ప్రధాన కేంద్రమైంది. అందువల్ల సియాటిల్ ప్రపంచ వ్యాప్తంగా పేరుపొంది సత్వరంగా అభివృద్ధి చెందింది. ఇక భౌగోళికంగా అందమైన సముద్ర తీర ప్రాంతమే కాక, నగరం మధ్య అలరారే “లేక్ యూనియన్” సరస్సుతో అత్యంత సుందరమైన నగరం. అమెరికాలో అత్యంత వర్షపాతం నమోదయ్యే నగరాల్లో అయిదవ స్థానాన్ని పొందింది. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియదు కాబట్టి గొడుగులు తప్పని సరిగా పట్టుకెళ్లాలని రికమెండేషన్లు ఆన్ లైను లో చూసేం. కానీ విమాన ప్రయాణం వల్ల ఉండే మైనస్ పాయింట్ల లో ఒకటైన “లిమిటెడ్” బరువు పట్టుకెళ్లాల్సి రావడం వల్ల గొడుగులు పట్టుకెళ్లలేదు మేం. అంతగా అయితే అక్కణ్ణించి గుర్తుగా తెచ్చుకునే సావనీర్ల బదులు గొడుగులు కొని తెచ్చుకుందామనుకున్నాం. అయితే అదృష్టం కొద్దీ మేం అక్కడున్న నాలుగు రోజులు మా కోసమే అన్నట్లు చక్కగా ఎండ కాసింది.

సియాటిల్ నించి మరో 100 మైళ్లు ఉత్తరంగా ప్రయాణిస్తే కెనడా, అమెరికా సరిహద్దు వస్తుంది. చూసి తీర వలసిన ప్రాంతాల్లో అదొకటి. ఇక వందల ఎకరాల్లో భూమి మీద రంగుల ఇంద్ర ధనుస్సు మొలిచి నట్లు తులిప్ గార్డెన్స్, నగరం మీద ఆకాశంలో మొలిచినట్లున్న “మౌంట్ రైనర్” మంచు పర్వతం, చరిత్రాత్మకంగా, అత్యద్భుతంగా మలిచిన విరజిమ్మే కాంతుల గాజు వనం, సియాటిల్ నగరపు విహంగ వీక్షణం”స్పేస్ నీడిల్” ..ఇలా ఎన్నో ఆకర్షణలున్నాయి అక్కడ.

https://picasaweb.google.com/104256037410703377895/NaaKallathoAmerica46?authuser=0&authkey=Gv1sRgCPvnzOOI2s3x0wE&feat=directlink

ఉదయం ఆరుగంటలకు మా ఫ్లైట్. నాలుగున్నరకల్లా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాం. మమ్మల్ని దించి, ముందుగా బుక్ చేసుకున్న లాంగ్ టెరం కారు పార్కింగు కోసం మరో మూడు మైళ్ల దూరం వెళ్లాడు సత్య. నేను అందరికీ చెకిన్ చేద్దామని లైనులో నిలబడ్డాను. ప్రతి ఒక్కరూ తమ ఐడెంటిటీ తీసుకుని కనబడాలి అన్నారు వాళ్లు. మొదటగా మా అమ్మకి ఐడెంటిటీగా పాస్ పోర్ట్ అడిగేరు. “అదేవిటీ? పాస్ పోర్ట్ తెచ్చుకోమని నువ్వు చెప్పలేదుగా” అంది. అది తన గదిలో పైనెక్కడో పర్సులో భద్రంగా ఉందని చెప్పింది. ఇక నేను ఆ రోజు మా ప్రయాణం వాయిదా పడ్డట్లే అని అనుకున్నాను. అయినా ప్రయత్నం చేద్దామని సత్యకి ఫోను చేసేను. లక్కీగా తనింకా కారు పార్క్ చెయ్యలేదు కాబట్టి వెంటనే మళ్లీ ఇంటికెళ్లి వస్తానన్నాడు. అంత ఉదయం ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఎయిర్పోర్ట్ నించి 15 మైళ్ల దూరంలో ఉన్న మా ఇంటికి గంట వ్యవధిలో వెళ్లి రావొచ్చు. కానీ ఇంటి దగ్గర వెతకాల్సి వస్తే అందుకోవడం కష్టం. ఇక అప్పట్నించీ ప్రతీ నిమిషం టెన్షన్ తో గడిపేం. మొత్తానికి సత్య ఫ్లైట్ కి ఇక పదిహేను నిమిషాలు ఉందనగా పాస్ పోర్ట్ తో పరుగెత్తుకు వచ్చేడు.

సియాటిల్ చేరేసరికి ఉదయం ఎనిమిదయ్యింది. రెంటల్ కారు వగైరా విషయాలు చూసుకునేసరికి పదయ్యింది. ముందుగా అనుకున్నట్టు “పైక్ ప్లేస్ మార్కెట్(Pike Place Market)” కు బ్రేక్ ఫాస్ట కం లంచ్ తినడానికి వెళ్లేం. అక్కడేదో ఫుడ్ టూర్ ఉంటుందని విన్నాం. సియాటిల్ లో పైక్ ప్లేస్ మార్కెట్ ఉన్న ఏరియా విశాఖలో ఎక్కి దిగే కొడల రహదారిలాగా ఉంటుంది. ఎగువన మార్కెట్ నించి దిగువన సముద్రం కనిపిస్తూ ఉంటుంది.

మాకు కారు పార్కింగు సముద్రాన్ని ఆనుకుని ఉన్న రోడ్డు లో దిగువన దొరికింది. అక్కణ్ణించి పైకి వెళ్ళేందుకు లిఫ్ట్ లో పైకి వెళ్ళేం. అది మూడు నాలుగు అంతస్థులుగా ఉన్న మామూలు మార్కెట్. అన్నిటికన్నా పైన ఉన్న ఏరియా మరో రోడ్డు కలుస్తూ జంక్షనుగా ఉంది. అక్కడే తులిప్ పూలని మొదటగా చూసేం. అందాలు విరజిమ్ముతూ భలే ఆకర్షించేయి అవి.
కానీ సరిగ్గా మార్కెట్ లోకి అడుగుపెట్టే సరికి విపరీతంగా ఆకలి వేసెయ్యడం మొదలెట్టింది మాకు. అదృష్టం కొద్దీ ఇండియన్ స్టాల్ కనబడింది. కనబడ్దదే తడవుగా రోటీలు, రైస్ తెచ్చుకుని ఆదరా బాదరా తిన్నాం.

ఇక్కడి మార్కెట్ ఇండియన్ మార్కెట్లకు దగ్గర పోలికతో కనబడింది. కిందంతా చెమ్మ చెమ్మగా ఏవో రకరకాల రంగుల దుస్తులు, ఆభరణాలు , తినుబండారాలు అమ్ముతున్నారు. అన్నిటికన్నా విశేషంగా పేర్చి ఉన్న చేపల దుకాణం, కస్టమర్లని ఆకర్షించేందుకు వాళ్లు పాడుతున్న జాలరి పాటతో కూడిన అభినయాన్ని చూసి తీర వల్సిందే. మార్కెట్కు ఆ మూల నించి ఈ మూల వరకూ తిరిగినా కొనదగినవంటూ ఏవీ కనిపించలేదు మాకు.

ఇక అక్కణ్నించి మధ్యాహ్నం స్పేస్ నీడిల్ కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నందున దాదాపు రెండు గంటల్లో అక్కణ్ణించి బయటకు వచ్చేసాం.

(ఇంకా ఉంది)

-కె.గీత

–  http://vihanga.com/?p=15567

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s