నా కళ్లతో అమెరికా-47 సియాటిల్ (భాగం-2)

సియాటిల్ (భాగం-2)

స్పేస్ నీడిల్:-మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో “పైక్ ప్లేస్ మార్కెట్” నుంచి స్పేస్ నీడిల్ కు బయలుదేరేం. ఈ మార్కెట్ నుంచి స్పేస్ నీడిల్ కు ప్రత్యేకగా మోనో రైలు తిరుగుతూ ఉంటుంది. అందులో వెళదామనుకున్నాం. అయితే ఆ రైలెక్కితే కారు తీసుకోవడానికి తిరిగి ఇక్కడికి రావాలి. ఇక అక్కడి నుంచి హోటలుకి వెళ్లిపోవాలని అనుకున్నందున ఆ ప్రయత్నం విరమించుకున్నాం. స్పేస్ నీడిల్, గ్లాస్ గార్డెన్ రెండూ ఒకటే ప్రాంగణం లో ఉంటాయి. రెండు దేనికవి తీసిపోని విశేషాలు.
అక్కడ కారు పార్కింగు విధిగా వాలెట్ పార్కింగు మాత్రమే. కాస్త ఎక్కువైనా ఆ సౌకర్యం బావుంది. టిక్కెట్లు రెంటికీ కలిపి తీసుకుంటే కొంత డిస్కౌంట్ లో వస్తాయి. మేం రెంటికీ కలిపి మనిషికి $33 చొప్పున టిక్కెట్లు తీసుకున్నాం.

స్పేస్ నీడిల్ నిర్మాణం :- 1962 సియాటిల్ లో జరిగే వరల్డ్ ఫెయిర్ కోసం రెస్టారెంట్ తో కూడిన ఎత్తైన టవర్ కట్టాలని అప్పటి ఆ ఫెయిర్ చైర్మన్ కు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా స్థలం సమకూర్చడంతో మొదలు పెట్టి, తగిన వనరుల సేకరణ, నిర్మాణం ప్రారంభించి సరిగ్గా ఫెయిర్ ప్రారంభించే ముందు నాటికి అంటే ఒక్క సంవత్సరంలో టవర్ నిర్మాణాన్ని పూర్తి చేసారట.

కళ్లెదురుగా స్పేస్ నీడిల్ సియాటిల్ నగరానికి తలమానికంగా నిలిచి ఉంది. ఎప్పుడెప్పుడు ఆ పైకెగబ్రాకి సియాటిల్ నగరాన్ని తనివితీరా వీక్షిద్దామా అని మనసు ఉవ్విళ్లూరుతూ ఉంది. కింద గిఫ్ట్ షాపుని దాటుకుని పైకెళ్లే లిఫ్ట్ కోసం లైను లో నిలుచున్నాం. 10 నిమిషాల తర్వాత గానీ అర్థం కాలేదు. అది కేవలం కిందకు వచ్చే వాళ్ల కోసం లిఫ్ట్ అని. మళ్లీ బయటికి వెళ్లి టిక్కెట్టు కౌంటరు నించి ఎడమ పక్కకు మళ్లి లోపల టిక్కెట్ చెకింగు పాయింటుని దాటి లిఫ్ట్ లో పై కెళ్లాలి. అదీ సంగతి. సరిగ్గా 4 నిమిషాలలో పైకెళ్ళిపోతాం. ఇది వరకు ఇలాంటిది లాస్ వేగాస్, న్యూయార్క్ వంటి రెందు మూడు చోట్ల ఎక్కాం. వేగాస్ తో పోలిస్తే కొంచెం తక్కువ వేగమే అని చెప్పుకోవాలి.

సియాటిల్ లో ఎప్పుడూ వానలు పడ్తూ ఉంటాయని విన్నాం. పిల్లలతో ఎటైనా తిరగడానికి వీలవుతుందో లేదో అని భయపడ్డాం. అయితే తీరా మేం అక్కడున్న నాలుగు రోజులూ మా అదృష్టం కొద్దీ వర్షం పడలేదు. కానీ ఆ ఉదయం మబ్బు కమ్ముకుని ఉంది. సరిగ్గా మేం మార్కెట్ లో ఉన్న సమయానికి చక్కగా ఎండ కాయడం మొదలు పెట్టింది. ఏప్రిల్ నెల నును వెచ్చని ఎండ.

స్పేస్ నీడిల్ పై నుంచి అత్యద్భుతంగా కనిపించే సియాటిల్ నగర సౌందర్యాన్ని చూసి తీరవల్సిందే. అప్పుడప్పుడే మబ్బు విచ్చుకుంటున్న నగరమ్మీద వెలుగు రేఖలు అందంగా ప్రసరించి ఉన్నాయి. సుదూరాన ఆకాశం లో మబ్బై మెరిసే మంచు పర్వతం మౌంట్ రైనర్, మరో పక్క నగరానికి మధ్యలో నీటి చెలమ లా హొయలుపోయే పెద్ద సరస్సు లేక్ యూనియన్. మరో పక్క నగరపు సగభాగాన్ని కమ్మే విశాల సముద్ర తీరం. విశాఖ పట్నం తర్వాత నేను చూసిన అత్యంత సుందర సముద్రతీర నగరం ఈ సియాటిల్.

సియాటిల్ నగరం 19 వ శతాబ్దపు తొలినాళ్ల నించీ అలాస్కాకు, కెనడాకు ప్రధాన నౌకాశ్రయంగా విలసిల్లుతూ ఉంది. క్రమంగా ఇక్కడ నౌకా నిర్మాణం కూడా ప్రసిద్ధిగాంచి నప్పటికీ, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బోయింగ్ విమాన నిర్మాణాం కూడా ఇక్కడ ప్రారంభం కావడంతో మరింత ప్రసిద్ధి గాంచింది. కాలిఫోర్నియాలో ప్రారంభమైన గోల్డ్ రష్ కు ఉత్తర భాగం నుంచి ప్రధానమైన నౌకాకేంద్రమైంది. 1980 ల కాలం నించీ టెక్నాలజీ సెంటర్ గా రూపుదిద్దుకుని మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సాప్ట్ వేర్ కంపెనీ దిగ్గజాలకు నిలయమైంది.

అంత ఎత్తుకి వెళ్లిన ప్రతీసారీ సామాన్యంగా మేం చూసిన విసురుగాలి ఇక్కడ లేకపోవడం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది. తనివితీరా మూణ్ణాలుగు సార్లు టవర్ ను చుట్టి వచ్చి దానికానుకుని ఉన్న లోపలి రెస్టారెంట్ లో అద్దాలలో నుంచి నగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, కాఫీ తాగుతూ కూచున్నాం.

కిందకు దిగి మేం పక్కనే ఉన్న గ్లాస్ గార్డెన్ వైపు నడిచే సమయానికి పిల్లలకు బాగా హుషారు వచ్చేసి ప్రాంగణం లో అటూ ఇటూ పరుగులు మొదలెట్టారు. కింది నుంచి మేం తలెత్తి స్పేస్ నీడిల్ ను చూస్తూ ఉంటే సిరి ఏకంగా గచ్చు మీద పడుకుని చూడడం మొదలెట్టింది. నాకూ అలా పసిపిల్లలా పడుకుని చూస్తే బావుణ్ణని అనిపించింది. నాలుగు వంపైన స్తంభాల మీద తిరిగే రంగుల రాట్నపు కొసలన్నీ కలిపి గుండ్రని గదిని చేసి ఆకాశంలో నిలబెట్టినట్లున్న స్పేస్ నీడిల్ నీడను అందుకుని, హత్తుకుని, ప్రతింబింబాన్ని కళ్లనింపుకుని గ్లాస్ గార్డెన్ వైపు అడుగులేసాను.

https://picasaweb.google.com/104256037410703377895/NaaKallathoAmerica47SeattlePart2?authuser=0&authkey=Gv1sRgCJLc3IXzx9bTSg&feat=directlink

చిహూలీ గ్లాస్ గార్డెన్:- ఒకే ప్రదేశంలో రెండు అద్భుతాలంటే ఇవే అనిపించేలా వేటికవే గొప్ప అబ్బురాలు స్పేస్ నీడిల్, గ్లాస్ గార్డెన్. స్పేస్ నీడిల్ మానవ నిర్మాణానికి ప్రసిద్ధి చెందితే, ఈ గ్లాస్ గార్డెన్ మానవ కళాత్మకతకు నిదర్శనమని చెప్పొచ్చు. అడుగు పెట్టింది మొదలు గది గదిలోనూ అచ్చెరువొందింపజేసే గొప్ప కళాత్మకత ఉట్టిపడే గాజు వనాలు దర్శనమిస్తాయి. ఎరుపు, పసుపు, నీలం ఒకటేమిటి, రకరకాల రంగులు, రకరకాల ఆకృతులు. అందులో ఒక్కొక్క కళారూపం తయారీకి ఎంతో సమయం పడ్తుందనడానికి ఉదాహరణ అక్కడ మేం చూసిన గాజు కుప్పె తయారీ. అది తయారు చేయడానికి వాళ్ల కి అరగంట పైన పట్టింది. ఇక ఇవన్నీ ఎంత కష్ట పడి చేసేరో అనిపించకమానదు.

ఈ గాజు గార్డెన్ నిర్మాణం వెనుక దాగున్న కథ వివరాలలోకి వెళ్తే- 1941లో వాషింగ్ టన్ స్టేట్ లో జన్మించిన డేల్ చిహూలీ గాజు తయారీలో విశేషమైన ప్రతిభ కలిగినవాడు. ఆయన నైపుణ్యానికి మచ్చుతునకగా, అత్యుత్తమమైన గాజు ఉద్యాన వనాలలో ఇదొకటిగా చెప్పొచ్చు. మనిషి తనెన్నుకున్న రంగంలో లీనమైపోయి పొందే తాదత్మ్యతని తాత్వికంగా తెలిపే అంతర్లీన సౌందర్యమంతా పోతపోసిన ఈ గాజు వనంలో కను రెప్ప వేయకుండా నిశ్శబ్దంగా కూచుని ఉండి పోవాలనిపింస్తుంది. చీకటి గదుల్లో రంగులు వెదజల్లే ఎగ్జిబిట్లు దాటుకుని పగటి వెల్తుర్లో బయటకు వచ్చే ముందు ప్రవేశించిన గాజు డూం తో ఉన్న పెద్ద హాలులోకి రాగానే కళ్లని నమ్మలేని గొప్ప విశేషమై అత్యంత సుందరమైన గాజు పూల తోరణాలు వేళ్లాడుతూ దర్శనమిస్తాయి. ప్రపంచం లోని అన్నీ మరిచి ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ అక్కడే ఎంత సేపు కూచున్నానో నాకే తెలీదు.

బయటికొచ్చి సహజ సిద్ధమైన మొక్కల నడుమ అడుగడుగునా మొలకెత్తిన గాజు పూలని, మొక్కల్ని, వృక్షాల్ని కళ్ల నింపుకుని అక్కడక్కడే పొద్దుపోయే వరకూ గడిపేం. తెల్లారగట్ల బయలుదేరి వచ్చామన్న అలసట అందరి ముఖాల్లోనూ కమ్మి ఉన్నా ఒక పట్టాన వదిలి వెళ్లాలనిపించని ఆ ప్రదేశం లో మరి కొంత సేపు గడపాలన్న ఆశ వదలడం లేదు ఎవ్వరికీ. పిల్లలతో సహా ఇంతే అబ్బురపడ్తూ ఉన్న సౌందర్యాత్మక స్థలం అది.

మేం వెళ్లిన మొదటి రోజే సియాటిల్ ఇలా మాకు కనువిందు చేసింది. మా హోటల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరగా, ప్రధాన నగరానికి 20 మైళ్ల దూరంలోనూ ఉంది. మాకు ప్రతీ రోజూ ఇంత దూరమూ తిరగక తప్పలేదు. ఈ సారి లగ్జరీ కారు ని అద్దెకు తీసుకున్నందున మరి కాస్త సౌకర్య వంతంగా తిరగగలిగాం. సాయంత్రానికి హోటలు చేరుకుని వేడి నీళ్ళ స్నానాలు ముగించుకుని పక్కనే ఉన్న అమెరికను హోటలులో భోజనం చేసామనిపించి ఎలా పడి నిద్రపోయామో తెలీదు. కలలోనూ నాకు స్పేస్ నీడిల్, గ్లాస్ గార్డెన్ కనువిందు చేస్తూనే ఉన్నాయి.

(ఇంకా ఉంది)

-కె.గీత

http://vihanga.com/?p=15863#sthash.rQTtIEEm.dpbs

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog). Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s