నా కళ్లతో అమెరికా-49 సియాటిల్- భాగం – 4

సియాటిల్- భాగం – 4

ముందురోజు చూసిన తులిప్ పూల వనాల కలల విహారం లోంచి తేరుకుని ఉదయం కళ్లు తెరిచేసరికి మూడు రోజులుగా సియాటిల్ నగరాకాశమ్మీద దక్షిణాన తెల్లని పెను మేఘంలా దోబూచులాడుతున్న మౌంట్ రైనీర్ పర్వతం కనబడింది. ఆ రోజు అక్కడికే ప్రయాణమన్నది ఎంతో సంతోషాన్ని కలిగించింది. సియాటిల్ నుంచి దక్షిణ దిశగా వెనక్కి ఎనభై మైళ్ళ దూరంలో ఘాట్ రోడ్ల మీద ప్రయాణం కాబట్టి ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టొచ్చు కాబట్టి ఆ రోజు ఎక్కువ ప్రదేశాలు చూడడానికి పెట్టుకోలేదు మేం. ఆ సాయంత్రం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్సు, అక్కడకు దగ్గర్లోని స్నోకాల్మీ వాటర్ ఫాల్సు చూసి రాత్రి భోజనానికి మా కెంతో దగ్గర మిత్రుల కుటుంబంతో గడపాలని అనుకున్నాం.

అప్పటికి ప్రతీ రోజూ రాత్రి పదింటికి పడుకోవడం ఉదయానే అందర్నీ ఎనిమిదికే బయలుదేరమనడం, అంతా సమయానికి లేచి రెడీ అవుతారో లేదో చూసుకోవడం వగైరా మిలట్రీ క్రమశిక్షకురాలిగా పిల్లలని సుశిక్షితుల్ని చేసేను. కానీ మా అమ్మకి ఏదైనా చెప్పడానికి వెనకాడేదాన్ని. అది చూసి మా వరు “డాడీ, మమ్మీకి వాళ్ల అమ్మ అంటే చాలా భయం” అని తేల్చేసింది. అయినా పాపం మా అమ్మ నాతో ఏదీ చెప్పించుకోకుండా త్వర త్వరగా పూర్తి చెయ్యడానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నించింది.

బయలుదేరిన దగ్గర్నించీ వందలాది ఫోటోలు తియ్యడం డిజిటల్ ఫోటోల కాలంలో విచిత్రమే కాకపోయినా కేమేరా మెమరీ త్వరగా నిండిపోవడం వంటి ప్రాబ్లం వల్ల

ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు కెమేరాలోని ఫోటోలని లాప్టాప్ లోనికి కాపీ చేయడం వంటి పనులు సత్యకి తప్పని సరి. అయితే ఆ ముందు రోజు రాత్రి అలిసిపోయి మర్చిపోయి నిద్రపోయేడు. ఇక ఆ రోజు మా ప్రయాణంలో వీడియో లు కేమెరాతో తియ్యకుండా ఫోటోలతో మెమరీ జాగ్రత్తగా వాడల్సి వచ్చింది.

ఫోటో పై క్లిక్ చేసి చూడండి

Naa Kallatho America-49

మౌంట్ రైనీర్ :-

మా హోటలు సియాటిల్ నగరానికి 20 మైళ్ల దక్షిణంగా ఉండడం వల్ల మౌంట్ రైనీర్ కు సిటీ దాటుకుని వెళ్లాల్సిన పనిబడలేదు.

ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్నించి చూస్తే ఆకాశంలో అందాల మంచు ముద్ద లాగా అత్యద్భుతంగా హిమవత్పర్వతం. దగ్గిరికెళ్లే కొలదీ గొప్ప అందంతో పొగలు చిమ్ముతూ కనిపించ సాగింది. ఆ అద్భుత సౌందర్యానికి కవిత్వం రాయకుండా ఉండడం అసాధ్యం.

ఏప్రిల్ నెలలో అంత మంచు ఉందంటే ఇక శీతాకాలంలో ఎలా ఉంటుందో అనిపించింది.

మౌంట్ రైనీర్ వాషింగ్టన్ రాష్ట్రం లో కెల్లా ఎత్తైన పర్వతం. దాదాపు 14 వేల అడుగున ఎత్తున ఉన్న గొప్ప అగ్ని పర్వతం. ఎంత అందమైనదో అంతకంతా ప్రమాదకరమైనది కూడా. ఎప్పుడు పేలుతుందో తెలీకపోవడం వంటి ప్రమాదాలే కాకుండా, శీతా కాలంలో కురిసే అత్యధిక హిమపాతం వల్ల మంచు శిఖరాలు జారిపడడం వంటి ప్రమాదాల్లో ఔత్సాహిక అధిరోహకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

ఇక మేం వంపుల రహదారుల గుండా, ఎత్తైన పైన్ వృక్షాల్ని దాటుకుని మంచు పర్వతం దగ్గరకు వెళ్లే కొలదీ రోడ్ల పక్కన మంచు కొద్ది కొద్దిగా నీరుగా మారుతూ తడితో మెరుస్తూంది. మొదటి సారి శిఖరం కనిపించిన వంపులో కారు ఆపుకునేందుకు స్థలం ఉంది. అక్కడి నుంచి లోయ ను చూసేందుకు నాలుగడుగులు నడిచి వెళ్లాలి. సత్య అటుగా వెళ్లొస్తానని కారు ఆపుజేసి ముందుకు వెళ్లేడు. మా అమ్మ, నేను పిల్లలు ఆకలి అనడంతో వెంట తెచ్చిన భోజనం పాక్ లు తీసి తినిపిస్తూ కారులో కాస్సేపు గడిపేం.

ఇంతలో సత్య తిరిగి రాగానే వెళ్ళిపోదామనుకుంటూ వెనక కనిపించే శిఖరాన్ని ఫోటో తీసుకోవడానికి దిగేం.

ఎదురుగా అప్పుడప్పుడే విరుస్తున్న నీలాకాశమ్మీద పొగలు చిమ్ముతూ అత్యంత సుందరంగా, ఠీవిగా నిలబడి ఉంది మౌంట్ రైనీర్. నేను విస్మయంగా అలా చూస్తూ మంచు శిఖరం వైపు రెప్ప వేయకుండా స్థాణువులా నిల్చుండిపోయాను. ఎక్కడ కనురెప్ప మూసినా అద్భుత దృశ్యం చేజారి పోతుందనిపించే వింత ఆనందమది. ఎన్నో జన్మల నుండి ఆ శిఖరాన్ని చూడడానికి తపించి ఇప్పటికి అక్కడికి చేరిన ఆనంద బాష్పాల సమయం. అప్పటి వరకూ చలిగా ఉందని కారులో కూచుండి పోయిన నా అజ్ఞానానికి తిట్టుకుంటూ తడిగా ఉన్నా, పిట్ట గోడ మీద అటు వైపు కాళ్ళు వేసి కూచుండిపోయాను. అక్కడ ఆకాశాన్నీ నేనే, పర్వతాన్నీ నేనే. ఒక గొప్ప ప్రేమ కావ్యమేదో మనసుని మెల్లగా మీటుతూ నా చుట్టూ పరిభ్రమిస్తూ నన్ను కవిత్వాలంకృతురాలిని చేసింది. అప్పటి నా మనసులో మెదిలిన అక్షరాలు ఆ సాయంత్రం కవిత్వీకరీంచే వరకూ మనసుకి శాంతి లభించలేదు.

అప్పుడు రాసిన కవిత ఇది:-

ఆకాశం-పర్వతం- అతను-నేను

అతను నన్ను కౌగిట్లోకి తీసుకుని గాఢంగా బిగించినట్లు

ఆకాశం ఆ మంచు పర్వతాన్ని అలా ఎత్తుకుందంతే-

సియాటిల్ నగరం పై ముసిరిన

మంచు తెల్లని పెను మబ్బు లా

గగనమంతా పరిచిన దూది కంబళీ

కల్లోనూ ఊహించని

మహోన్నత శిఖరం

మౌంట్ రైనర్

వేల ఏళ్లుగా అతను నా కోసం తపస్సు చేస్తున్నట్లు

ధీర గంభీర ముద్రలో

వర ప్రద స్వప్నాలకు

కన్నీటి సాక్ష్యమై

మబ్బు చెదిరిన వేళ

మహోన్నత మేఘం

మహిమాన్విత శిఖరం

మౌంట్ రైనర్

అక్కడ

ధగ ధగా మెరిసే

నీలాకాశమై పర్వత చుబుకాన్నెత్తి అతను

నేల విడిచి గగనాన ఒదిగి అతని బాహువుల్లో నేను

అక్కడ

అతనికి చేతుల్లేవు చుట్టూ ముసిరే మబ్బుల కెరటాలు తప్ప

ఆకాశానికి ముఖం లేదు మేనంతా అల్లుకున్న ప్రేమైక తమకం తప్ప

అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాల బలం నా కురులనల్లుకుని ఒడలంతా వ్యాపించినట్లు

పర్వతంమీంచి ఆకాశంలోకి చెల్లా చెదురుగా లేస్తున్న మంచు పొగలు

ఒక గాఢ చుంబనం

ఒక కంటి చివరి బాష్పం

అతనూ నేనూ

అద్భుతాన్ని మైమరిచి చూస్తున్న వేళ

పర్వతమ్మీదికి పరుగెత్తి

దాని ఒళ్ళంతా తాకి

కేరింతలు కొట్టి

మెత్తని మంచు ముద్దలై

పిల్లలు

అప్పుడే ఆకాశానికి పర్వతానికి

ఉద్భవించిన

పసి బుడుతలై ప్రత్యక్షమయ్యారు

అతను పిల్లల్ని చెరో వైపునా పొదువుకుని

పర్వతమ్మీదికి పరుగెడ్తూ

ఆగొక సారి గుండె తడుముకున్నట్లు

నా వైపు చూసిన వేళ

ఆకాశం పర్వతమూ ఏకమై

అమాంతం ఎగరేసుకుపోయినట్లు

అక్కడే అప్పటికప్పుడు

కవితనై జన్మించాను

కాగితంపై అడుగు మోపి

ఆనందతాండవం చేస్తూ పరవశించాను

                                  ****                           ****                     *****

అక్కడి నుంచి అసలు శిఖరం చూడడానికి ముందుకు బయలుదేరాల్సి వచ్చినపుడు ఎందుకో మనసు బాధతో మూలిగింది.

తీరా దగ్గరకు వెళ్ళేక చూద్దుము కదా. ఒక గొప్ప ధవళ శిఖరం రెండు చేతులూ సాచి మీదికి ఆహ్వానిస్తుందంతే. పిల్లలు, సత్య గ్లోవ్స్ వేసుకుని ఉత్సాహంగా మంచు మీదికి పరుగెత్తేరు. కానీ చాలా ఎత్తైన పర్వత శిఖరం కావడం వల్ల మొత్తం శిఖరాన్ని , ఆడే వాళ్లనీ కలిపి ఫోటో తీయడం మామూ లు కెమేరాల్తో అసాధ్యం. అప్పటికే అక్కడ దాదాపు వంద మంది వరకూ పిల్లలూ, పెద్దలూ ఆటల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఆ రోజు ఆదివారం కావడం వల్ల అక్కడ సహజంగా ఉండాల్సిన ఏ సర్వీసూ లేదు.

మనంతట మనం వెళ్లి ఆడుకుని రావాల్సిందే.

ఇక ఆ రోజు మధ్యాహ్నం నించి చూడవలసిన ప్రదేశాలకు మళ్లీ దూరానికి ప్రయాణం చేయాల్సి ఉండడం వల్ల తప్పనిసరిగా రైనీర్ పర్వతానికి వీడ్కోలు చెప్పవలిసి వచ్చింది.

స్నోకాల్మీ ఫాల్స్ :-

అక్కణ్ణించి స్నోకాల్మీ (Snoqualmie) ఫాల్స్ చూడడానికి బయలుదేరేం. దాదాపు మూడు గంటల ప్రయాణం అక్కణ్ణించి.

చూడ చక్కని రోడ్ల మీదుగా చాలా హాయిగా గడిచిన ప్రయాణం అది. మొత్తానికి సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో చేరుకున్నామక్కడికి.

స్నోకాల్మీ నదీ ప్రవాహానికి స్నోకాల్మీ, ఫాల్ సిటీ ల మధ్య ఏర్పడిందీ జలపాతం. ఈ జలపాతాన్ని ఎదురుగా, పై నుంచి చూడడం ఒక అందమైన అనుభూతి.

చిన్న పార్కులా ఉన్న చోటి నించి జలపాతం కనిపిస్తూ కనువిందు చేసింది. అక్కణ్ణించి కిందికి దిగే అవకాశమూ లేదు, సమయమూ లేదు. ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆఫీసు అక్కడికి దగ్గర్లోనే ఉండడం వల్ల చూడడానికి వచ్చిన వాళ్లలో తొంభై శాతం ఇండియన్సే ఉన్నారక్కడ.

దాదాపు 85 అడుగుల ఎత్తున ఉన్న ఈ జలపాతం దగ్గరే జల విద్యుదుత్పత్తి కేంద్రం ఉంది. పిల్లలు జలపాతాన్ని చూడగానే ఆనందంతో గంతులేసారు. ఆ ఉదయమే ఒక గొప్ప హిమవత్పర్వతాన్ని చూసొచ్చి, ఇక్కడ ఆకాశం నించి హఠాత్తుగా ప్రత్యక్షమైన స్వర్గంగను చూస్తున్న అనుభూతి కలిగింది.

సాయం సంధ్య కిరణాలు ప్రతిఫలించే నీటి పాయల్ని ముఖాన పరుచుకుని ఎంతో సేపు తన్మయంగా అక్కడే ఆగిపోవాలన్న అనుభూతి. ఇక అక్కడ ఉన్న గిఫ్ట్ షాపు అప్పటికే మూసి వేయడం వల్ల పిల్లలు అటూ ఇటూ మొక్కల్లో పడి పరుగులెత్తారు. మా అమ్మ, నేను అక్కడే కూచుని కాస్సేపు కబుర్లు చెప్పుకున్నాం. సత్య అటూ ఇటూ చూసొస్తానని వెళ్లొచ్చేడు. సరిగ్గా గంటలో బయలుదేరేం. నా వరకు నాకు శరీరం బయటి ప్రపంచంలో నడుస్తూన్నా, మనసు నచ్చిన చోటనే ఆగిపోయింది.

మైక్రోసాఫ్ట్ ఆఫీసు:-

ఆ రోజుకి మేం చూడాల్సిన మరో ప్రదేశం రెడ్మండ్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఆఫీసు. అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది.

నును వెల్తురులో ఆఫీసు ముందర ఫోటోలు తీసుకున్నాం. నిజానికి మా ఇంటికి రెండు మెళ్ల దూరంలో ఉన్న ఆపిల్, అయిదు మైళ్ళ లో ఉన్న గూగుల్, పది మైళ్ళ దూరంలో ఉన్న ఫేస్బుక్ ఆఫీసులకు ఎప్పుడూ వెళ్ళి ఫోటోలు తీసుకోలేదని గుర్తొచ్చి బాగా నవ్వుకున్నాం.

మా చిరకాల మిత్రులు సోమయ్య గారు అక్కణ్ణించి చాలా దగ్గర్లో ఉన్న వాళ్లబ్బాయి అజయ్ ఇంటి దగ్గిరే ఉండడం, ఆ రాత్రి భోజనానికి వారు మమ్మల్ని ఆహ్వానించడంతో నాకు ఇష్టమైన ఆపిల్ పై స్వీటు, తులిప్ పూల గుత్తులను వాళ్ళ కోసం కొని అటు బయలుదేరేం.

అన్నీ ఒకేలా ఉన్న వేల ఎకరాల మేర ఉన్న రోడ్లు , కాలనీలు దాటుకుని మిత్రుల ఇంటికి చేరుకున్నాం. వారి చిన్నారి పాప వయొలీన్ వాదన తో స్వాగతం పలికింది. వారంతా కుటుంబ సమేతంగా చూపించిన ఆదరాభిమానాలకు ఎంతో ఆనందం కలిగింది. మేం ఉన్నది రెండు, మూడు గంటలైనా సంగీతం, సాహిత్యాసక్తి కలిగిన కుటుంబం కావడం వల్ల అందరం హాయిగా గడిపేం.

పిల్లలు బాగా ఆనందించడం విశేషం. మనదనే ప్రపంచానికి దూరంగా బంధువుల్ని మరిచిపోయి సంవత్సరాల తరబడి కాలం వెళ్లదీస్తున్న సమయాన ఇలా హఠాత్తుగా కలిసే మిత్రులు ఆ లోటు తీరుస్తారనడం అతిశయోక్తి కాదు. నిజానికి సియాటిల్ లో ఎక్కడ ఏవేమి చూడాలో అజయ్ గారు ఈ- మెయిల్స్ ద్వారా మొదట్నించీ బాగా గైడ్ చేసి చాలాసహాయం చేసేరు మాకు.

చాలా సంతృప్తిగా గడిపేం ఆ రోజంతా. మర్నాడే మా తిరుగు ప్రయాణం. అయితే సాయంత్రం ఫ్లయిట్ కావడం వల్ల ఉదయానే మరేదైనా చూసే అవకాశం ఉందేమో అని నేను ఆలోచించడం మొదలు పెట్టేను.

-కె.గీత

– See more at: http://vihanga.com/?p=16170#sthash.qR3tYKac.dpuf

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s