నాలుగు పదుల తర్వాత (కవిత )- కె .గీత

నాలుగు పదుల తర్వాత వచ్చే పుట్టినరోజు
అబద్ధపు వయసుతో మొదలవుతుంది
నాలుగు పదుల తర్వాత వచ్చే పుట్టినరోజు
ఇరవై నాలుగ్గంటల
జీవన భారమై బాధ్యతల్ని పెంచుతుంది
నాలుగు పదుల ముల్లు
గుండెలో గుచ్చుకున్నట్లు
పుట్టిన రోజు దిగులుతో మొదలవుతుంది
ఉదయానే మంచం దిగాలనిపించని
బద్ధకంతో బాటూ
తల స్నానాల, కొత్త బట్టల
ఉత్సాహమూ ముడుచుకుని పడుకునుంటుంది
గుడికెళ్లి, బడికెళ్లి
గెంతుకుంటూ పంచిన
చాక్లెట్ల పుట్టినరోజులన్నీ
దుప్పటీలో ప్రత్యక్షమవుతాయి
మనస్సు మడుగు మధ్య
ఆలోచనలు చిలికినట్లు
జ్ఞాపకాల అలలు
మెదడంతా విస్తరిస్తాయి
అమ్మ చేసిన సేమ్యా పాయసం రుచిగా నాలిక్కి తగులుతుంది
వేసుకున్న లేత గులాబీ రంగు గౌను ఆహ్లాదంగా ఒంటికి అంటుకుంటుంది
“హేపీ బర్త్ డే టూ యూ” ప్రతి నోటి వెంటా కొత్తగా వినిపిస్తుంది
ప్రతీ సంవత్సరం అప్పుడే
జన్మించినట్లు సరికొత్త ఉత్సాహమూ
పుట్టినరోజు కోసం అలుపెరగని ఎదురుచూపూ
అజ్ఞాతపు అబ్బాయి పంపిన పోస్టల్ గ్రీటింగ్సు
స్నేహితురాలి చేతి డిసెంబరంపూల మాల
ఓహ్…ప్రపంచంలో
అప్పటికప్పుడు
తాజాగా మొదలైన
మొట్టమొదటి క్షణం
ఇప్పటి దుప్పటీలో పరకాయ ప్రవేశించిన మందహాసం –
ఒత్తిగిలిన కాలు కదపగానే కనుమరుగవుతుంది
నలభైలలో అడుగు పెట్టగానే
జీవితపు మలి శకం మొదలయినట్లు
వృద్ధాప్యం మోకాలి నించి మొదలవుతుంది
తల పండిన చేనై
ముఖం ఒడిలిన బెరడై
అద్దంలో సడలిన అందాల శరీరం
పగిలిన ప్రతిబింబమవుతుంది
ఇంటిలో పాయసం కాదుకదా
పొయ్యిలో పిల్లి కూడా లేవదు
సహచరుడి గుండెల మీద
గడవగలిగే చివరి రోజు కోసం
అదృష్టపు ప్రార్థనతోనో
ఉద్యోగపు చికాకుతోనో
ఆర్థిక లావాదేవీల సంగతులతోనో
కేకుల పుట్టినరోజులేవిటని
పిల్లల్ని మందలించే
ఉదయం మొదలవుతుంది
అయినా పిల్లల కౌగిలింతల
వెచ్చని శుభాకాంక్షలు
హఠాత్తుగా హాలులో
ప్రత్యక్షమయ్యే
పూలపరిమళాల సంబరాలు
సహచరుడి కంట్లో
వేల నక్షత్రాల పుట్టినరోజు
కాంతులన్నీ కొత్తగా జన్మింపజేసే చోట
చిన్ననాటి స్నేహితురాలు
రోజులో ఎక్కడో చోట ప్రత్యక్షమై
డిసెంబరం పూల ఆహ్వానం పలికించే చోట
నాలుగు పదుల తర్వాతి పుట్టినరోజు
అబద్ధపు వయసునే
నిజం చేస్తున్నట్లు
చిన్ననాటి జ్ఞాపకాక్షతాశీస్సుల్ని
నెత్తిన జల్లి ఆశీర్వదిస్తుంది

-కె.గీత

విహంగ ప్రచురణ-జనవరి, 2016

http://vihanga.com/?p=16509

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s