యార్డ్ డ్యూటీ

year-duty-twkew4

యార్డ్ డ్యూటీ

గాలి వాటుకి మిడతల దండొచ్చి వాలినట్లు
ఒక్క సారిగా అన్ని వైపుల్నించీ
బడి పచ్చికలోకి పరుగెత్తుకొస్తారు పిల్లలు
వీళ్లకు తోక లొక్కటే తక్కువ
కాదు కాదు- తోకలు మరీ ఎక్కువ
అందుకే కామోసు
ఇనుప ఊచల మీద తల క్రిందులుగా వేళ్లాడుతూనే కనిపిస్తారెప్పుడూ
అజమయిషీల చేతికర్రలు లేని
అమెరికా ఇది
మధ్యాహ్నపు పహారా
ఉద్యోగంలో
పిల్ల కోతులెన్ని కుప్పిగంతులేసినా
మందలించడానిక్కూడా
మర్యాద పూర్వకమైన
స్వరం కావాలిక్కడ
అబద్ధపు మెచ్చుకోలు పదాలు,
అన్నిటికీ నవ్వాల్సిన పెదాలు కావాలిక్కడ
ఒక చిన్న బుడతడు
తల పైకెత్తి ఆకాశంలోకి చూస్తున్నట్లు
ముఖంలోకి అమాయకంగా చూస్తూనే
సవాలక్ష యక్ష ప్రశ్నల్తో
పెను మస్తిష్కాన్నైనా చిత్తు చేస్తాడు
ఒక రెండో తరగతి గడుగ్గాయి
కనుసన్నల్లోంచి
తుర్రుమని తప్పించుకునే మార్గాల్లో
అప్పటికే పండిపోయి ఉంటాడు
అయిదో తరగతి
ముదురు టెంకాయి
నిర్లక్ష్యపు చూపుల్తో
ప్రపంచాన్ని ఎదిరించడానికైనా
సిద్ధమన్నట్లుంటాడు
పిల్లలు ఎన్ని కోతిపన్లు చేసినా
ఊచల మీద వేళ్లాడేవన్నీ మృదువైన తురాయి పూలే
చిన్నారుల చిలిపి కళ్లల్లో దాగున్నవన్నీ అందమైన బాల్యాలే
అటూ ఇటూ పరుగులిడుతూనే
చెక్కుకున్న మోకాలుతోనూ
విరగ్గొట్టుకున్న ముంజేయితోనూ
ఏడుస్తూ వచ్చే
పసి పిల్లల్ని చూడగానే
గుండె ఆగి కొట్టుకుంటుంది
అప్పటికప్పుడు భుజాన
మోసిన కడుపు తీపి జ్ఞప్తికి వస్తుంది
ఏ పసిహృదయంలోనూ
మొలకెత్తనివ్వని దు:ఖాన్ని
గుండె అతి భారంగా మోస్తుంది
నిమిషానికొక సారి ఊదే
విజిల్ శబ్దం వెనక
అప్పటికప్పుడు ఆటమానిపించి
కూచోబెట్టి లెక్కింపజేసే
రెండొందల అంకెల చాటున
జాలితో మూలిగే
హృదయమొకటి-
జారుడు బల్ల మీద
తల కిందులుగా జారే వాడూ-
మెడ మీద పాకే
చీమని కొట్టుకోకుండా
ఏడుపు లంకించుకునే చిన్నదీ-
రెండు చేతులూ వదిలేసి
ఊస మీద నిరాధారంగా
నిలబడే సాహసీ-
పరుగెత్తుకొచ్చి
గభాలున ఢీకొట్టుకుని
దులుపుకుని పారిపోయే బండోడూ-
పిల్లల తోడి లోకం
అత్యుత్తమ ప్రపంచమై
లోలోపల ఆనందతాండవం చేసే చోట
మధ్యాహ్నపు
పహారా ఉద్యోగంలో
“యార్డ్ డ్యూటీ” అన్న పిలుపు తప్ప
పేరులేని పర్యావరణంలో
ఎటు చూసినా
మిడతల వడగళ్ళన్నీ
తుంపరల సీతాకోకచిలుకలై
రెప రెపలాడుతూ వాలతాయి
బడి ప్రాంగణంలో
అందమైన ఆరు రెక్కల
మంచుపూలలా
ఆహ్లాదంగా గింగిరాలు కొడ్తూ
ఆకాశం నించి
మిరుమిట్లు గొల్పుతూ
ప్రత్యక్షమవుతాయి

——

“ఆంధ్ర ప్రదేశ్” ప్రచురణ- ఫిబ్రవరి, 2016

(“యార్డ్ డ్యూటీ” అనేది అమెరికా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన విరామంలో పిల్లల్ల్ని కాపలా కాసే వాలంటీర్ కార్యక్రమం.)
-కె.గీత

 

screen-shot-2016-12-03-at-7-19-40-pm

ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s