నా కళ్లతో అమెరికా-58-హవాయి దీవులు భాగం-4

                               అదృష్టవశాత్తు మౌనాకియా పర్వత అధిరోహణం ఆరోహణమంత కష్టంగా లేదు. వెళ్లేటప్పటిలా మట్టి రోడ్డు కాకుండా తారు రోడ్డు ఉండడంతో కిందికి సులభంగా రాగలిగేం. కాకపోతే ఎక్కడా విద్యుద్దీపాలు లేవు, జీపు లైట్లు తప్ప. చాలా విచిత్రంగా విజిటింగు సెంటర్ దగ్గర కూడా. పైగా చాలా మంది చీకట్లో విజిటింగు సెంటరు ఆవరణలో గుమిగూడి ఉండడం కనిపించింది. అప్పుడు అర్థమైంది. అక్కడ మాలా వచ్చే వీక్షకులకు టెలీస్కోప్లతో అనంతాకాశంలోకి తొంగి చూసే ప్రత్యేక ప్రదర్శన ఉందని. అంత చలిలో సిరి తట్టుకోలేదని, ఒకళ్ల తర్వాత ఒకళ్లం దిగి వెళ్లిచూసేం. దరిదాపుల్లో కారు పార్కింగు ఖాళీ లేదు. ఎక్కడో వరుసల్లో దూరంగా పార్కు చేసుకుని సెల్ఫోను లైటులో ముందు వరు, నేను నడిచేం. కోట్లు తొడుక్కున్నా ఎముకలు కొరికే చలిలో అంతరిక్ష విశేషాలు అక్కడ గొంతెత్తి రేంజర్లు చెప్తూంటే ఆసక్తిగా వింటున్నారందరూ. రెండు లైన్లలో రెండు సైజుల్లో టెలీస్కోపులు చూసేందుకు ఉన్నాయి. ఒక్కొక్క లైనులో పది నించి పదిహేను మంది వరకు ఉన్నారు.

                           చలిని అధిగమించి వొణుకుతూ లైన్లలో నిలబడి చూసేం. మొదటిది మామూలు కంటికి కనిపించని నక్షత్రం, ఆ పక్కనే పరుచుకున్న నెబ్యులా. రెండవది చందమామ లోని లోయ. రెంటికి రెండూ చూసి తీరవలసినవే. అంత చలిగాలిలోనూ మబ్బుల్లేని ఆకాశం లో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి టెలీస్కోపులో. అప్పుడు గుర్తుకు వచ్చింది. మేం ఉన్నది మబ్బులకు పైన ఉన్న ఎత్తైన కొండల మీద అని.

                            రెండు టెలీస్కోపులు చూసేక ఇక చలిలో ఉండలేక పరుగెత్తుకు జీపులోకి వచ్చేసేం.ఆ రాత్రి వెనక్కి వస్తూంటే ఏదో గ్రహాంతరాలకు వెళ్ళి తిరిగి వస్తున్న అనుభూతి కలిగింది. బయట వెన్నెలలేని అమావాస్య రాత్రి కావడంతో జీపు వెనక కరిగిపోతున్న కొండల్ని చూసే అవకాశం కలగలేదు.

                                    రోజల్లా బిగ్ ఐలాండ్ లోని వెచ్చని తూర్పు తీరాన్ని చూసి, సాయంత్రపు వేళ ద్వీపానికి మధ్య ఉన్న మౌనాకియా పర్వత శిఖరమ్మీద కొలువున్న నక్షత్ర పరిశోధక స్థలమ్మీద ఎముకలు కొరికే చలి సూర్యాస్తమయాన్ని, నక్షత్రమండలాంబరాన్ని వీక్షించి రాత్రికి తిరిగి పశ్చిమ తీరంలో ఉన్న వెచ్చని మా బసకు చేరుకున్నాం.

                             హోటలు కి పక్కనే ఉన్న షాపింగు మాలు లో రోడ్డు నానుకుని ఉన్న రెస్టారెంటుకు దాదాపుగా మూసివేసే సమయానికి చేరుకుని ఫిష్ & చిప్స్, వెజిటేరియన్ రైస్ వంటివేవో ఆర్డరు చేసి సగం మాత్రమే తినగలిగేం. కెరటాల హోరుతో అందమైన చీకటిని, దేవగన్నెరు పూల మంచి సువాసనని ఆఘ్రాణిస్తూ రాత్రి నిద్రకుపక్రమించాం.

                                మర్నాడు ఉదయం మేం దక్షిణ దిక్కుగా ద్వీపాన్ని చుట్టి, తూర్పు తీరంలో నిన్న వెళ్లిన హీలో నగరానికి దక్షిణంగా ఉన్న హవాయీ వాల్కనోస్ నేషనల్ పార్కు చూసి రావాలి. సాధారణంగా నేషనల్ పార్కులు చూడడానికి ఒక పూర్తి రోజు అవసరం. అందుకే ఆ రోజు దారిలో ఏవో చిన్న చిన్న మిగతా అట్రాక్షన్స్ వీలుంటే చూద్దాం, లేకపోతే లేదని నిర్ణయించుకున్నాం.

                            బ్రేక్ ఫాస్టు చేసే సమయం వృథా చెయ్యకుండా దారిలో ఎక్కడైనా తిందామని అనుకుని, అంతలోనే ముందు రోజు కొన్న స్వీట్ బ్రెడ్డు దారిలో కారులోనే హడావిడిగా తినేసి నవ్వుకున్నాం.

                           ఇక వెళ్లే దారిలో తప్పనిసరిగా చూడవలసిన పునాలు (Punalu’u) బ్లాక్ సాండ్ బీచ్ దగ్గర మాత్రం అరగంట ఆగేం. అక్కడ పెద్ద పెద్ద తాబేళ్లకు ప్రసిద్ధి. కానీ మేం వెళ్లిన సమయానికి మాకు తాబేలు కాదు కదా జాడలు కూడా కనబడలేదు. చెప్పులు విడిచి దిగడానికి వీలుగాలేని చిన్నగా గుచ్చుకునే ఇసుక అది. తెల్లని మెత్తగా జారిపోయే ఇసుక బీచ్ లో దొర్లడానికి అలవాటు పడ్డ పిల్లలేమో, సిరి అసలు బీచ్ లోకి రానని వెనక్కి పరుగెత్తింది. ముందు అదంతా బురద అనుకుని కాస్త, కాళ్ళకి గుచ్చుకుంటున్నందువల్ల కాస్త.

                        తూర్పు తీరంలో దాదాపు గంటన్నర దక్షిణానికి ప్రయాణం చేసేక గానీ పడమరకి మలుపు తిరగలేదు. ద్వీపపు కొసకి ప్రయాణం చెయ్యాలన్న నా కోరికని వెనక్కి వచ్చేటప్పటికి వాయిదా వేసేం. మేమున్న కోనా ప్రాంతాన్నించి దక్షిణంగా చాలా సేపు కొండల మీదుగా కింద ఎక్కడో కనిపిస్తున్న సముద్రతీరాన్ని కళ్లని నింపుకుంటూ ప్రయాణం సాగించాం. కోనా దాటి కాస్త దూరంలోనే కొండలని చుడుతూ సన్నని రహదారి పక్కన వరసగా ఎత్తైన వృక్షాలు, వాటికి వేళ్లాడుతూ వేలాది పిందెలు కనిపించాయి. తీరా చూస్తే అవి మామిడి చెట్లు, పిందెలు.

                          డ్రైవ్ చేస్తున్న సత్యని ఎక్కడైనా ఒక్క చెట్టు దగ్గరైనా ఆపమని ఒక్క ఉదుటున రోడ్డు పక్కనే ఉన్న చెట్టు మొదట్లోకి దుమికేను. మామిడి పిందెలు చకచకా దోసిలి నిండా కోసేను. అడివి మామిడిలా ఒకే గుత్తుకి అరవై వరకు పిందెలు ఉండి, బ్రహ్మాండంగా ఆకాశంలోకి పెరిగిపోయిన చెట్లవి. అమెరికా వచ్చేక మామిడి చెట్టు చూడడం అదే మొదటిసారి కావడంతో నా ఆనందానికి అవధి లేదు. చెట్టు మొదలుని తడిమి, ఆకుల్ని తెంపి వాసన చూసి, పిందెల్ని ఒడి నింపుకుని ఆనందానుభూతిలో తేలిపోయాను. కింద కాలు పెడితే దిగబడిపోయే ఎండుటాకులు, విరిగిన కొమ్మలతో నిజానికి అక్కడ నిలబడేందుకు కూడా అనువుగా లేదు. సన్నని రహదారి పక్కన పొరబాటున ఏ కొమ్మ జారినా కిందికి లోయలోకి పడ్తాం. సత్య గాభరాగా నా వెనకే కారు దిగి, ఇక చాలు రమ్మని నిమిషానికోసారి పిలుస్తున్నా, నాకు పది నిమిషాల పాటు అక్కడి నించి రావాలనిపించలేదు.

                       ఆ రోజు రాత్రి, మర్నాడు ఫ్లైటు ఎక్కే వరకు మామిడి పిందెల్ని చెక్కు తీసి రెండు చెక్కలు చేసి బ్రెడ్డు మధ్య పెట్టుకుని తిన్నాం. అమృతప్రాయంగా అనిపించింది ఉప్పూ, కారం లేకపోయినా. వరు మా వైపు ఆశ్చర్యంగా చూసింది. చిన్న నాట మా ఆవరణలో ఉన్న మామిడి చెట్ల పిందెల కోసం సంవత్సరమంతా వేచి చూడడం, చిన్న చిన్న పిందెల్ని ఆబగా చిన్న ఉప్పు, కారం కలిపిన కాగితం పొట్లాలలో ముంచుకుని అదే పనిగా నమలడం జ్ఞాపకం వచ్చింది. నాకు ఎప్పుడూ పళ్ళు పులిసిన జ్ఞాపకం లేదు. ఎంత పులుపైనా చకచకా తినేసే వయసది. ఆ జ్ఞాపకాలు చెపుతుంటే ఇంకా ఇంకా చెప్పమని ఆసక్తిగా వింది.

పదకొండు గంటల కల్లా నేషనల్ పార్కుకి చేరుకోవాలన్న ఆతృతలో మరెక్కడా చెట్లు కనబడ్డా ఆపనని చెప్తున్న సత్య వైపు నవ్వుతూ చూశాను.

ఇక్కడి ద్వీపపు కొస మొత్తం అమెరికా సంయుక్త రాష్ట్రాలకే దక్షిణ భాగం. పసిఫిక్ సముద్రపు తీరంలోనికి సాగి ఉన్నట్లున్న ఆ కొసని చూడాలని నా ఆకాంక్షని తిరిగి వచ్చేటప్పటికి దాచుకున్నాను.

పశ్చిమ తీరానికి మలుపు తిరిగిన తర్వాత సముద్రం కాసేపు దగ్గరలో దోబూచులాడింది. కొద్ది సేపటిలో దట్టమైన చెట్ల మలుపుల దగ్గర “కాఫీ టేస్టుంగు” అని బోర్డు కనబడితే అదేదో చూడాలని నా పట్టు చూసి కారు వెనక్కు తిప్పి మరీ ఆ ఫామ్ లోనికి పోనిచ్చాడు సత్య. కారు బయట అడుగుపెట్టే సరికి ప్రచండమైన గాలి కారు తలుపుల్ని తోసేస్తూ ప్రవేశించింది. అప్పటి వరకు అద్దాల తలుపుల చాటున ఉన్న మాకు అంత గొప్ప గాలి వీస్తూందని అర్థం కాలేదు. కారు ఆపగానే ఆవరణలో పక్కనే ఉన్న చిన్న గొర్రె పిల్లల వైపు పరుగెత్తింది సిరి. చిన్న టెంట్ లో ఉన్న దుకాణపు కౌంటరులో ఉన్న ఆఫ్రికను అమెరికను యువతి నాకు పరిచయమయ్యింది. లాస్ ఏంజిలస్ ప్రాంతం నించి ఈ ద్వీపానికి మొదటి సారి వచ్చేక, ఇక జనారణ్యంలోకి వెళ్లాలనిపించలేదట. అందుకే ఇక్కడే ఉద్యోగం చూసుకుని ఉండిపోయేనని చెప్పింది. ఇక్కడి గాలి, ఈ సముద్రం, ఈ నిశ్శబ్దం తనకెంతో ఇష్టమని చెప్పింది. అమెరికాలో రోజల్లా పరుగు తీసే జీవితాలకు ఒక గొప్ప ఆటవిడుపు హవాయి దీవులు. నాకైతే అక్కడే ఆమెలా ఉండిపోతే బావుణ్ణని అనిపించింది. అటువంటి జీవితాన్ని కావాలని ఎన్నుకున్న ఆమెను అభినందించకుండా ఉండలేకపోయేను. అక్కడి ఉయ్యాలలో ఊగి, చేదు కాఫీని రుచి చూసి, నట్స్ తో తయారుచేసిన బెల్లపచ్చు వంటిది కొనుక్కుని తినుకుని, ఆమె దగ్గర సెలవు తీసుకుని ముందుకు ప్రయాణాన్ని కొనసాగించేం.

హోటలులో తొమ్మిది గంటలకు బయలుదేరినా పదకొండున్నర ప్రాంతానికి గాని నేషనల్ పార్కుకి చేరలేకపోయేం. అన్నిటి కంటే విశేషంగా అప్పటిదాకా ఉన్న ఎండ మాయమై ఉధృతంగా వాన పట్టుకుంది. నేషనల్ పార్కు అని బోర్డు ఉన్న చోటి నుంచి విజిటింగు సెంటర్ కి చాలా లోపలికి ప్రయాణం చేసేం. అక్కడ దిగినది మొదలు రోజంతా తడుస్తూనే ఉన్నాం. తడి బట్టల్తో తిరుగుతూన్నా ఎక్కడా చలి వెయ్యకుండా ఆహ్లాదంగా నును వెచ్చగా భలే హాయిగా ఉంది. బిగ్ ఐలాండ్ లోని ఈ అగ్ని పర్వతాల జాతీయ పార్కు చూడకుండా ఐలాండ్ టూరు అర్థవంతం కాదని విని ఏమో అనుకున్నాం. అక్కడ ఆ రోజు గడిపేక అవన్నీ అక్షర సత్యాలని అర్థమైంది.

పార్కు రెండు వైపులుగా వ్యాపించి ఉంటుంది. అందులో చిన్నదారి వైపు కారు డ్రెవ్ చేయగలిగిన చివరి పాయింటు జాగర్ మ్యూజియం. అక్కణ్ణించి మళ్లీ విజిటర్ సెంటర్ మీదుగా వెనక్కి వచ్చి రెండో దారి లో వెళ్తే చివరగా కొండలన్నీ అవరోహణ చేసి సముద్ర తీరానికి చేరుతాం.

ఈ మొత్తం 38 మైళ్లే అయినా, ఆగి చూస్తూ వెళ్లడానికి మూణ్ణాలుగు గంటలు పట్టొచ్చు. సాయంత్రం నాలుగు గంటకల్లా పార్కు సందర్శన ముగించాలని అనుకున్నాం. ముందుగా చిన్నదారి వైపు వెళ్లేం. వెనక్కి వచ్చేటపుడు భోజన విరామం తీసుకుని పెద్ద దారి చూద్దామని ప్రణాళిక వేసుకున్నాం. అసలు చూడాల్సినవన్నీ ఆ దారిలోనే ఉన్నాయి మరి.

 

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

అటువైపుగా కనబడే పెద్ద విశేషం జాగర్ మ్యూజియం అనుకున్న మాకు మ్యూజియం ను ఆనుకుని ఉన్న అతి పెద్ద లోయ భాగాన్ని చూసి మతిపోయింది. అక్కడేదో ఎప్పుడో ఒక అతి పెద్ద ఆస్ట్రాయిడ్ పడ్డట్టు కనుచూపుమేర అత్యంత పెద్ద వృత్తాకారపు అగాధపు దృశ్యాన్ని చూసి ఒళ్లు గగుర్పొడిచింది. మ్యూజియం లో రకరకాల అగ్ని పర్వత శిలల్ని, వీడియోలని ప్రదర్శనకి ఉంచేరు.

తిరిగి వస్తూ త్వరగా విజిటింగు సెంటరుకి దగ్గర్లో ఉన్న పార్కు రెస్టారెంటులో భోజనం కానిచ్చి బయలుదేరేం. అక్కడే మొదటి సారి హవాయన్ భోజనం తిన్నాం. చక్కని అందమైన ప్లేటులో కొద్దిగా చల్లని ముద్ద లాంటి అన్నం, నూనెలో నానబెట్టినట్లున్న చిన్న పచ్చి చేప ముక్కలు, సీ వీడ్, కొద్దిగా తియ్యని టోఫూ, పచ్చి ఆకులు, ఒకే ఒక్క వేయించిన చేప ముక్క, బీన్స్ జావ. అందులో వేయించిన చేప, అన్నం తప్ప ఏవీ తినలేకపోయేం. ఇక వరు పూర్తి వెజిటేరియన్ కావాలని పేచీ పెట్టి బీట్ రూట్ చిప్స్, రెడ్ స్వీట్ పొటేటో చిప్స్ ఆర్డర్ చేసింది. గట్టిగ గుచ్చుకునే చిప్స్ అవి. పైగా ఉప్పు లేనివి. చూడ చక్కగా మాత్రం ఉన్నాయి. సత్య అప్పటి వరకు హవాయన్ భోజనం తిని తీరాలని పట్టుబట్టాడు. ఆ పూట తర్వాత ఇక ఆ ఆలోచన మానుకున్నాడు.

మొదటి పాయింటు “థర్స్ టన్ లావా ట్యూబు”(Thurston Lava Tube). తప్పని సరిగా చూసి తీరాల్సిన ప్రదేశాలలో ఇదొకటి. కారు పార్కింగు నించి భూగర్భంలోకి వెళ్తున్నట్లు కొంచెం దూరం నడవగానే వచ్చే చిన్న బ్రిడ్జి. అటువైపుగా పెద్ద గుహాంతర్భాగం. మానవ నిర్మిత రైలు గుహలాగా పెద్దది. ఒక పక్క భోరున కురుస్తున్న వాన. చుట్టూ ఎక్కడ చూసినా నాచు పట్టిన పరిసరాలు, నల్లని గుహలో పై నించి అన్ని చోట్లా కురుస్తున్న వాన నీళ్లు ఇటు నించి అటుకి పది నిమిషాల సేపు నడిచేక గానీ కనబడని అటు వైపు ద్వారం. అక్కడ మెట్లు, ఆ పైన కనిపిస్తున్న చిన్న ఆకాశం. ఒక గొప్ప మహాద్భుతం అది. అగ్ని పర్వతo మధ్యలో లావా ప్రవహించగా ఏర్పడ్డ సహజ సిద్ధ గుహ అది. అడుగుతీసి అడుగు వేస్తూంటే ఒక కొత్త ప్రపంచాన్ని కనుక్కుంటున్న ఉత్సుకత. చివరగా మెట్లు కనబడగానే హమ్మయ్య ప్రపంచం మళ్లీ కనబడిందన్న ఆనందం. ఒక అద్వితీయానుభూతి.

బయటికి రాగానే చుట్టూ గుబురుగా అల్లుకున్న సతత హరితారణ్యం అది. పచ్చదనం లేని ప్రదేశం లేదు. వాన నీరు పులకింపజేయని వృక్షజాలం లేదు.

నెత్తిన భోరున కురుస్తున్న వానని లక్ష్యపెట్టలేదు మేం. కోట్లు లేకుండా అక్కడి పచ్చని చెట్లంత స్వేఛ్చగా తిరుగాడాం. పక్షుల్లా గిరికీలు కొట్టేం. సిరి వాన నీళ్లలో తనివితీరా అడుగులు వేసి, నీళ్లు గుటకలు వేసి, సంతోషంగా పరుగు తీసింది. ఆ పిల్ల వెనుక మేం తూనీగల్లా ఆడుకున్నాం. రెండు చేతులూ చాచి ఆకాశం లో నించి భువిని వేళ్ళాడుతున్న వాన దారాల్ని ఎంత కప్పుకున్నా తనివితీరని అద్వితీయ పులకింత అది.

(ఇంకా ఉంది)

-కె .గీత

http://vihanga.com/?p=18503

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s