నా కళ్లతో అమెరికా-59 (హవాయి దీవులు- భాగం-5) -డా.కె.గీత

బిగ్ ఐలాండ్ లోని హవాయి నేషనల్ పార్కులో అడుగుపెట్టినప్పట్నించీ వర్షం ధారాపాతంగా కురుస్తూనే ఉంది. థర్స్ టన్ లావా ట్యూబ్ నించి తర్వాతగా చూడాల్సిన “ఛైన్ ఆఫ్ క్రేటర్స్ రోడ్డు” లోకి మళ్లేం. వరసగా ఒక దాని తర్వాత ఒకటిగా క్రేటర్స్తో మధ్య కారు వెళ్లే ప్రదేశం తప్ప మొత్తం గడ్డ కట్టిన లావా ప్రవాహాలతో భూమి పుట్టిన నాటి కాలానికి ప్రయాణించినట్లో, లావా తప్ప మరేదీ లేని మరో గ్రహానికి వచ్చి పడ్డట్లో అనిపించసాగింది.

లావా ప్రవాహం రాతి శిలల్ని కరిగించి అలలుగా పోత పోసిన మహా సముద్రంలా ఉంది.
అంతే కాదు ఒక అల మీద మరో అల దొంతరలుగా పేరుకుని కాల ప్రవాహం క్షణ కాలం ఆగిపోయినట్లు అత్యంత వింతైన దృశ్యమది.

లావా ప్రవాహం అంటే ఏదో సెలయేటి ప్రవాహంలా ఉంటుందనుకున్నాను కానీ, కనుచూపుమేర ఎక్కడ చూసినా మైళ్ల మేర విస్తరించి ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు.

చల్లారి గడ్డ కట్టిన లావా ని కళ్లారా చూడడం ఒక ఎత్తైతే, అందులో దిగి నడవడం మరొక ఎత్తు. బాగా పాత లావాలో నుంచి అక్కడక్కడా ఎవరో పెంచినట్లు మొక్కలు పుట్టుకు రావడం వింతగా అనిపించింది.

మకాపుహి క్రేటర్ నించి కలాపన సముద్ర తీరం వరకూ వ్యాపించి ఉన్న అనేక వరస క్రేటర్ లు, వాటి నించి ఉబికిన వరస లావా ప్రవాహాల మధ్య వాహనాలకి త్రోవ 1928 లోనే ఏర్పరచబడినా, 1969 లో “మౌనా ఊలూ” (Mauna Ulu) అగ్ని పర్వత విస్ఫోటనం వల్ల 1969 నుంచి 1979 వరకూ పది సంవత్సరాల పాటు ఈ త్రోవ మూత బడింది.

ఈ విస్ఫోటనం వల్ల తీర ప్రాంతపు ఆదిమ జాతుల గ్రామాలన్నీ చెల్లాచెదరయ్యాయి. 13 వ శతాబ్దం నించీ వారి సంస్కృతికి ప్రతిబింబాలైన పురాతన కుడ్య చిత్రాలు, దేవాలయాలు, ధాన్యాగారాలు మొ.నవన్నీ లావా ప్రవాహం కింద కప్పబడిపోయాయట.

అక్కడితో అయిపోయిందనుకుంటే పొరబాటే. 1986 లో జరిగిన మరో విస్ఫోటనం వల్ల దాదాపు తొమ్మిది మైళ్ళ దూరం రహదారి లావాలో కప్పబడిపోయింది.

1989 లో వహౌలా విజిటర్ సెంటర్, తత్సంబంధిత భవనాలన్నీ అగ్నిప్రమాదానికి గురయ్యాయి. ఆ ప్రాంతమంతా ఇలా అగ్ని పర్వతాల ప్రమాదాలకు గురవుతూ చివరగా 1997 లో పూర్తిగా దహనమైపోయి, నామరూపాలు లేకుండా పోయింది.

2003 లో ప్రవహించిన లావా రహదారిని పునర్ధ్వంసం చేస్తూ అంత ఎత్తు నించి సముద్ర తీరాన ఉన్న సీ ఆర్క్ వరకూ ప్రవహించిందట.

2014 లో చివరగా ప్రవాహించిన లావా తడి ఆరని గురుతుల్ని ఇంకా అక్కడ చూడొచ్చు.

అక్కడ ప్రతీ విస్ఫోటనం జరిగిన చోటా ఏర్పడిన అగాధాలు అతి పెద్దవి. అక్కడ అంతకు ముందు గొప్ప పర్వతాలు ఉండేవని అగాధాలలోకి పరికించి చూసినా అర్థం కాని పరిస్థితి. పర్వత విస్ప్ఫోటనాన్ని ఊహించుకోవడానికే వణుకు పుట్టుకొస్తుంది. ఇక ఆ చుట్టుపక్కల కనిపిస్తూన్న లావా ప్రవాహాల్ని చూస్తూంటే ఒళ్లు గగుర్పొడవక మానుతుందా?

మేం క్రేటర్ రోడ్డు లో ఒక్కొటిగా చూస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో వర్షం ధారా పాతంగా కురుస్తూ ఉంది. అయినా అలా తడుస్తూనే తిరిగేం. సముద్ర మట్టానికి 3700 అడుగుల ఎత్తున ఉన్న ఈ క్రేటర్ రోడ్డు నించి క్రమంగా సముద్ర తీరానికి దిగుతూ దాదాపు 18 మైళ్లలో 2 గంటల పాటు ప్రయాణం చేసేం.

అక్కడ దిగువన ఉన్న సముద్ర తీరం దిగి అలల్ని సృశించే చోటు కాదు. ఎత్తైన ప్రదేశం నించి దిగువన భీకరమైన రాళ్లకి ఒరుసుకుంటూ కనిపించింది సముద్రం.

రోడ్డు చివరికి, సముద్ర తీరానికి చేరేసరికి చిత్రంగా వాన లేదు. చక్కని ఎండ కాయడం మొదలెట్టింది. అక్కడ అసలు వాన పడ్డ ఛాయలు కూడా లేవు.

అప్పటికే సాయంత్రం 5 గంటలు కావస్తూంది. సీ అర్క్ కనిపించే చోటువరకే కార్లు వెళ్తాయి. అక్కణ్నించి నడిచే దారి ముందుకు వెళ్తూంది. వరు, సత్య అటు పరుగెత్తేరు. ఆ దారి ఇక అంతూ పొంతూ లేకుండా ముందుకు పోతూ ఉందని అరగంటలో వెనక్కి వచ్చేరు.untitled

మరిన్ని చిత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

అంతలో నేను, సిరి కూచున్న చోటికి ఇండియా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ మా లాంటి మరో కుటుంబం పరిచయమయ్యారు నాకు.

ఉత్తరాది వారు కావడం వల్ల ఆమె రెండు నిమిషాల్లో హిందీలోకి దిగింది. వాళ్లు హవాయిలోని అన్ని దీవులనూ స్వయంగా చూసుకుంటూ వెళ్తున్నామని, బిగ్ ఐలాండ్ వారి రెండో మజిలీ అని చెప్పింది. ఆ తర్వాత మేం వెళ్లబోతున్న ఒవాహూ ఐలాండ్, హానోలూలూల నుండి వాళ్లు అంతకు ముందురోజే వచ్చినందువల్ల వారినడిగి అక్కడి వివరాలు తెలుసుకున్నాను. “ఎలా ఉంది హవాయీ ప్రయాణపు అనుభవం?” అని అడిగితే ఆమె పెదవి విరిచి, “ఇక్కడి దీవుల్లో ఏమున్నాయని అంతా గొప్ప చెబుతారో అర్థం కావడం లేదు. ఈ రాళ్లూ, సముద్రం, చెట్టూ, పుట్టా ఎక్కడ లేవు?” అంది.

ఆమె మాటలకు నాకు నవ్వు వచ్చింది. అవన్నీ మధురంగా కంబడడానికి అన్నిటి వెనుక చూసే సౌందర్యాత్మక హృదయం కూడా ఉండాలి మరి.

ఇక నేషనల్ పార్కు నించి తిరుగుముఖం పట్టి మేం బయటకు వచ్చే సరికే ఆరుగంటలు కావొచ్చింది. ఆఘ మేఘాల మీద నేను జీపును దీవికి ఉన్న దక్షిణ కొస తీరం వైపు మళ్లించేను.

కానీ తీరా ఆ దక్షిణపు కొసకి చేరే సరికి అక్కడ కారు వెళ్లే మార్గం లేదు. అప్పటికే చీకటి కావచ్చింది. కారుని అక్కడ ఆపి అక్కణ్ణించి తీరం వరకూ మైలున్నర దూరం నడిచే

ఓపిక ఎవరికీ లేదు. ఇక అక్కడి నించే తీరానికి సెలవు తీసుకుని, తిరుగు ముఖం పట్టేం.

దాదాపు 7 గంటల ప్రాంతంలో పునాలులూ బ్లాక్ సేండ్ బీచ్ కి మళ్లీ చేరుకున్నాం. ఈ సారి నల్లని ఇసుకలో దిగి అడుకోవడానికి కాస్సేపు సమయం కేటాయించేం. సిరి దిగి ఇసుకలో పడుకుని పొర్లింది.

వాతావరణం గోరు వెచ్చగా ఉండడం వల్ల చీకటి పడ్డా అలా హాయిగా సముద్ర తీరంలో తిరిగే అవకాశం కలిగింది మాకు.

కాలిఫోర్నియాలో వేసవిలో రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకూ వెలుతురు ఉన్నా సాయంత్రం అయిదయ్యేసరికి తీరాన ఉండలేని చలిగాలులు మొదలవుతాయి.

పొద్దుట్నించీ పిల్లలు ఎంత అలిసిపోయినా సముద్రాన్ని చూసేసరికి ఉరకలేసేరు.

నేను పిల్లల్ని హడావిడి పెట్టేను. మేం తిరిగి హోటలుకి వెళ్ళేక ఇంకా నాకు సామాన్లు సర్దే పని ఉంది. మర్నాడే మేం ఆ దీవి నుంచి బయలుదేరి మరో దీవికి వెళ్లాల్సి ఉంది.

——-
(ఇంకా ఉంది)

http://vihanga.com/?p=18627

 

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , , , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s