“అమెరికా తెలుగు కవయిత్రులు ఏం రాసారు? ఏం రాస్తున్నారు? ఏం రాయాలి?” (వంగూరి ఫౌండేషన్ 10 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రసంగ వ్యాసం) -డా||కె.గీత

Image may contain: 1 person, standing

“అమెరికా తెలుగు కవయిత్రులు ఏం రాసారు? ఏం రాస్తున్నారు? ఏం రాయాలి?”
(వంగూరి ఫౌండేషన్ 10 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ప్రసంగ వ్యాసం)
-డా||కె.గీత

తెలుగు కవయిత్రులు అనగానే నాకు వెంటనే గుర్తుకొచ్చేది 90’వ దశకంలో ప్రభంజనమై వినిపించిన స్త్రీవాద కవిత్వం.

“మనిషితో రాజీపడలేక పోయినందుకు/నా వీపుకింద అంపశయ్యలా పరుచుకున్న/ ఈ రాత్రి గడిస్తే” అన్న రేవతి దేవి వేదనాత్మక కవిత దగ్గరనించి,
“పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని/ పంతులు గారన్నప్పుడే భయమేసింది /మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
/మమ్మల్ని విభజించి పాలిస్తోందని!” అన్న సావిత్రి దగ్గరనించి
స్త్రీలే రాయగలిగిన కవితలైన, కొండేపూడి నిర్మల “లేబర్ రూమ్”, ఘంటశాల నిర్మల “జుగల్బందీ”, పాటిబండ్ల రజని “అబార్షన్ స్టేట్ మెంట్”, జయప్రభ”పైటని తగలెయ్యాలి”, విమల “సౌందర్యాత్మక హింస” నించి, కె.గీత “నేను ఋతువునైన వేళ” వరకు గుర్తుకొస్తాయి.
స్త్రీ వాద ఉద్యమం ఉధృతంగా మొదలైన సమయంలో నేను కవిత్వం రాయడం ప్ర్రారంభించి భాగస్వామురాల్ని కావడం వల్లనో, ఎందరో స్త్రీలలా జీవితపు ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నపుడు స్త్రీ వాద సాహిత్యం కలిగించిన ఆత్మ స్థయిర్యం వల్లనో నాకు స్త్రీలు సృజించే సాహిత్యమంటే ఇష్టం, ప్రేమ .
గత పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న నాకు ఈ సమావేశానికి పిలుపు రాగానే మొదటగా అనిపించిన అంశం
“అమెరికా తెలుగు కవయిత్రులు ఏం రాసారు? ఏం రాస్తున్నారు?” అని. ఆ శోధన లో భాగంగా “ ఏం రాయాలి?” అనే విషయం కూడా తోడయ్యింది.

కవిత్వం అంటే ఏవిటి? ఏ విషయాల గురించి రాయాలి? అనేది ఆలోచిస్తే –

కవిత్వానికున్న అనేకానేక నిర్వచనాల్ని, అనిర్వచనాల్ని పక్కనబెడితే బాలగోపాల్ చెప్పిన విషయాన్ని కవిత్వానికి అన్వయం చేసుకుంటే “జీవితంలో ఖాళీల్ని పూరించడమే కవిత్వం” అని చెప్పుకోవచ్చు.

ఏ ఖాళీలు కవులని ప్రేరేపిస్తాయో అదే ఆ గళం నించి, ఆ కలం నించి ( ఆ కీబోర్డు అనాలేమో:)) కవిత్వంగా మారుతుంది.

కవిత్వం అంటే ఏవిటో అమెరికా తెలుగు కవయిత్రి మమత కొడిదెల రాసిన “వెళ్లిపోయింది” కవిత తెలియజేస్తుంది.

“చాల పక్షుల/కళ్ళు గప్పి దాక్కుని/ఆరుసార్లు/తనలోంచి తనను/చీల్చుకుని, చివరికి/తనలోంచే తాను పునర్జన్మించి
/అప్పుడప్పుడే తడి ఆరిన/రంగురంగుల రెక్కలను/కను రెప్పల్లా తాటించి/తానింకా బతికేవుండడం తానే/నమ్మలేనట్లు విప్పార్చి/పచ్చటి మైదానంలో/పూల కోసం బయల్దేరి/దారికడ్డంగా/వికృతంగా మొలిచిన/నల్లని రోడ్డు మీద దూసుకొచ్చిన కారులో/జీవితం గూర్చి మహా సిద్ధాంతాలు/ఒకరిమీదొకరు రువ్వుకుంటున్న నలుగురి/గుండెల్ని అదరగొడుతూ ‘టప్’ మని
విండ్ షీల్డ్ మీద ఒకే ఒక్క చారిక/తన గుర్తుగా ఈ లోకానికి వదిలి…”

ఇక ఈ వ్యాస శీర్షికలో “అమెరికా తెలుగు కవయిత్రులు” అంటే అమెరికాకు కేవలం చుట్టపుచూపుగానో, యాత్రలకో వచ్చిన వారు కాక, చిరకాలంగా ఇక్కడే ఉంటూ వచ్చి స్థిరపడిన వారన్నమాట. 70’ల నించి ఇక్కడ స్థిరపడిన వారున్నా తెలుగు సంస్థలు, అచ్చు పత్రికలు వచ్చిన 90’ ల నించే కవిత్వం వెలికి చూసినట్టుగా కనిపిస్తుంది. అప్పటికి భారతదేశంలోతెలుగు కవిత్వంలో చిచ్చయ్యి రగులుకున్న స్త్రీవాద, దళిత వాదాలు ఇక్కడ మచ్చుకి కూడా కనిపించక పోవడం విశేషం!

పైగా వచన కవిత్వానికంటే పద్య కవిత్వం అమెరికాలో ఇప్పటికీ అత్యధికంగా వినిపించడం చాలా ఆశ్చర్యకరం! ఆలోచించాల్సిన విషయం!

పదేళ్ల కిందట ఇక్కడికి వచ్చినపుడు ఇక్కడి తెలుగు సంఘాల్లో ‘వేషధారణలే కాదు, సాహిత్యంలోనూ 16 వ శతాబ్దానికి టైమ్ మెషీన్ ఎక్కి వెనక్కి ప్రయాణించి వచ్చానా’ అన్న భావన కలగజేసాయి.

పద్య కవిత్వం గురించి పక్కనబెడితే ఇక్కడి వచన కవిత్వం కూడా ఇక్కడి కథా సాహిత్యంలాగే మొదటగా నాస్టాల్జియా తోనే ప్రారంభమైంది. జ్ఞాపకాలు, ఒంటరితనాలు, విరక్తులు, వేదనలు, అనుభూతి ప్రధాన కవిత్వాల్లోనుంచి ఇప్పటికీ బయట పడనట్లు, పడలేనట్లు కనిపిస్తుంది.

అమెరికాలో రచయిత్రులు, అంటే వచన ప్రక్రియల్లో రాసేవారు సంఖ్యా పరంగా ఎక్కువగానే ఉన్నా, చాలా విచిత్రంగా కవయిత్రులు కేవలం వేళ్ళ మీద లెక్కబెట్టగలిగినంత మందే ఉన్నారు.

అలా నా దృష్టి లోకి వచ్చిన వారు -అపర్ణ గునుపూడి, ఇంద్రాణి పాలపర్తి, నిడదవోలు మాలతి, కల్పనా రెంటాల, కె.గీత, మమతా కొడిదెల, జయ, వైదేహీ శశిధర్, రాధిక రిమ్మలపూడి , మరువం ఉష, నిషిగంధ, మోహన తులసి రామినేని, షంషాద్.
వీరు కాక ఇంకెవరైనా ఉంటే ఈ ఉపన్యాసంలో పరిగణనించనందుకు క్షమించాలి.

అమెరికా తెలుగు కవయిత్రుల కవిత్వంలో వస్తు పరంగా చూస్తే ఈ కింది అంశాలు కనిపిస్తాయి.

విడిచి వచ్చిన దేశం/ మనుషుల జ్ఞాపకాలు
చూసిన ప్రదేశాలు
ప్రకృతి సంబంధిత కవిత్వం
అమెరికా జీవితంలో స్త్రీల సమస్యలు :
వీసా సమస్యలు(హెచ్ 4 మొ.నవి)
కుటుంబ సమస్యలు

ప్రవాస జీవితం పట్ల ఊహలు/అపోహలు/నిజాలు
ఒంటరి తనం
చుట్టూ ఉన్న ఇండియా/అమెరికా సంస్కృతి లో ఇమడలేకపోవడం
పడికట్టు/గానుగెద్దు జీవితం పట్ల విరక్తి
కౌటుంబిక జీవితంలో కొత్తగా లభించిన ఆనందం
దగ్గరి అనుబంధాల పట్ల ఎడబాటు
సామాజికాంశాలతో కూడిన కవితలు

విడిచి వచ్చిన దేశం/ మనుషుల జ్ఞాపకాలు
డయాస్పోరా మనుషులకు ఉండే సహజ లక్షణాలలో ప్రధానమయిన “జ్ఞాపకాల్లో జీవించడం” అనేది కవయిత్రుల కవిత్వంలోఎక్కువగా కనిపిస్తుంది.
వైదేహీ శశిధర్
“ఉగాది” కవితలో “కాలపు పరదాల వెనుక పేర్చిన /జ్ఞాపకాల దొంతరల లోంచి /నేను పోగొట్టుకున్న బాల్యం
శమంతక మణి లా తళుక్కుమని మెరుస్తుంది”
“జ్ఞాపకాల భోగిమంటలు” కవితలోధనుర్మాసంతో బాటూ జ్ఞాపకాల భోగిమంటలు మళ్ళీ రాజుకుంటాయి”
అంటారు.
“సత్యనారాయణపురం రైల్వే గేటు!” కవితలో కల్పనా రెంటాల-”అమ్మ వొడిలోకి పరుగెత్తాలి/నాన్నతో కలిసి క్రిష్ణ వొడ్డున నడవాలి/అన్నయ్యలతో తగాదాలాడాలి/అక్కయ్యతో రహస్యాలు చెప్పుకోవాలి… పిచ్చి కలలే కాని//ఇంకా పచ్చి పచ్చిగా
కాలీ కాలని మొక్కజొన్న కండెల్లా/కన్రెప్పల కింద కదలాడుతూనే వున్నాయి

“పాట ఒకటి” లో నిషిగంధ -”పొడవాటి కాలేజీ కారిడార్లలో/ఈ పాటతో మొదలైన పరిచయాలు, పదిలపడ్ద ఇష్టాలు
చీకటి ఒంటరి వేళల్లో ఈ పాటనెక్కి/చేసిన పాలపుంతల ప్రయాణాలు/ధూళిలా సనసన్నగా రాలుతున్న జ్ఞాపకాలు

“బొమ్మా బొరుసూ “ లో నిడదవోలు మాలతి “ఆపద్ధర్మాలు/ గతంలోఘనత వహించిన కులధర్మాలకి/ కొత్త భాష్యాలు
/పుట్టుక తో వచ్చిన విలువలు పూర్వవాసనలు/ఎంత కాదనుకున్నా వదలడం లేదు /జీడిమరకల్లాగా

“జ్ఞాపకాల వలస పక్షులు” కవితలో కె.గీత “చిలక్కొయ్యకు వేళ్లాడుతున్న/పాత వత్సరాన్ని తీసి బూజు దులపడం మొదలు పెట్టాను/జ్ఞాపకాలు ఒక్కోటిగా రాలిపడ్డాయి/గాలికి లాంతర్లు ఊగుతున్నట్లు/మదిలో జ్ఞాపకాలు”
ఆర్. రాధిక -”ఆలోచనలు” కవిత లో “ఏ ఏకాంతక్షణంలోనో/నన్నడగకుండా వచ్చేసి/పారిజాతాల తోటలోని నేస్తాలదగ్గరకి తీసుకుపోతాయి” అంటారు.

విహార ప్రదేశాలు

కె. గీత రాసిన “డంబార్టన్ బ్రిడ్జి”, “బ్రెయిడల్ వైల్ జ్ఞాపకం”, “ఎల్లోస్టోన్”, “గ్రాండ్ కెన్యన్ “ మొ.వి ఈ కోవలోకి వస్తాయి.
ఇతర కవయిత్రులెవ్వరైనా విహార ప్రదేశాల కవితలు రాసి ఉన్నారేమో మరి, ఎక్కడా లభ్యం కాలేదు.

ప్రకృతి సంబంధిత కవిత్వం
ఈ తరహా కవితలు గొప్ప భావుకత్వంతో, అందంగా సాగే పదబంధాలతో మన కాళ్లకు సంకెళ్లు వేస్తాయి.

మమత “లెట్ గో” కవితలో –
ఇదిగో ఇలా ఏటి ఒడ్డున గడ్డిలో పడుకుని చూడు
ఒకదాన్నొకటి ఒరుసుకుంటూ, కలిసిపోతూ, విడిపోతూ, వీగిపోతూ, మళ్లీ మళ్లీ మరింత కొత్తగా పుడుతున్న
ఆ చిట్టి అలలను చూడు
బుడి బుడి అడుగులతో అతి నిశ్శబ్దంగా గడ్డిగింజలను ఏరుకుంటున్న ఆ ఎర్ర రెక్కల నల్ల పిట్టను చూడు

“వానలో వసంతం ! “కవితలో కల్పన- “చెప్పా పెట్టకుండా వచ్చేసి చుట్టుకునే ప్రేమలా/ఆకాశం చూరు నుండి హోరున వర్షం

/ఎప్పటి విరహ వేదనో/ఈ వసంతపు వాన! అంటారు.
—–
“చందమామ రావే” కవితలో -మరువం ఉష -”సూదిబెజ్జంలో దూరి దూకుతున్నట్లు చినుకులు-/ సన్నసన్నని వాన …
….. సగం తెరిచి ఉంచిన కిటికీల్లో-/రాలిపడుతున్న పసుపుపూల రేకుల్లా, దీపపు కాంతులు.
“వర్షానంతరం” కవితలో వైదేహీ శశిధర్ “బూడిద రంగు బద్ధకాన్ని కప్పుకుని నల్లని మబ్బుల కంబళీ లోంచి
మసక మసక గా ఈ రోజు తెల్లవారింది”

పాలపర్తి ఇంద్రాణి- “ఇల్లు” కవిత
“మబ్బులు కప్పు/మన్ను నేల/గాలులు గోడలు/ మా ఇంటికి/వెన్నెల దీపం/పచ్చిక శయ్య….. /వానలు ఊచలు” అంటారు.

అమెరికా జీవితంలో స్త్రీల సమస్యలు :
వీసా సమస్యలు: హెచ్ 4
అమెరికా జీవితంలో స్త్రీలు తమ బాధల్ని చెప్పుకోవడానికి కవిత్వాన్ని మాధ్యమంగా దాదాపుగా ఎన్నుకోలేదనే అనిపిస్తుంది.
ముఖ్యంగా ఇక్కడ భర్త ఉద్యోగ రీత్యా వచ్చిన స్త్రీలకి ఉండే మొదటి సమస్య ఉద్యోగం చెయ్యనివ్వని డిపెండెంట్ వీసా.
ఒబామా పుణ్యమా అని కొంత సడలింపు గత ఏడాది రావడం గొప్ప మలుపు.
ఈ సమస్య మీద అనేక బ్లాగుల్లోనూ, ఇంటర్నెట్ వేదికలలోనూ సంవత్సరాల తరబడి చర్చలు కొనసాగేయి. కానీ ఈ విషయం కవితా వస్తువు గా రాసిన రెండు కవితల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను.

“డిపెండెంట్ స్వర్గం” కవితలో కె.గీత “ప్రతీ రోజూ ముఖాన్ని అద్దంలో చూసుకుంటూనే ఉన్నాను/ఏ మార్పూ లేదు-/డిపెండెంట్ ముఖానికి మార్పులేం వుంటాయి?/ఇస్త్రీ చేయాల్సిన ఇంటిల్లపాదీ బట్టల్లా బద్ధకం పేరుకు పోతూంది
/సింకులో పెనాలు/డిష్ వాషర్ లో ప్లేట్లు/అంతా సుఖమే
……
ఎంత చదూకున్నా నిరుద్యోగ వీసా గడప దాట నివ్వదు/ఏ రోజూ ఏ అద్భుత దీపమూ ప్రత్యక్షమవ్వదు/అతడి కెరీరే నా జీవిత గమ్యం
…….
వంట మనిషి, పని మనిషి/ఇస్త్రీ వాడు, డ్రైవరు/తోటమాలి, ఫైనాన్స్ మేనేజరు/షిఫ్టు తర్వాత షిఫ్టు…./ఓవర్ టెములున్నా ఒక్క పెన్నీ వుండదు
——
తల్లి కొత్తగా పెళ్లయిన అమ్మాయితో సంభాషిస్తున్నట్లున్న కవిత: “అప్పగింతలు” లో నిడదవోలు మాలతి

హాయిగా తిరగొచ్చు /అతడిని ఆఫీసులోనూ/పిల్లల్ని స్కూళ్ల లోనూ దిగిడిచేసింతరవాత.
అలా తిరుగుతున్నపుడు/ఇంటికాక్కావాల్సిన కూరా, కాయా/ఉప్పూ, పప్పూ తెచ్చేసుకోవచ్చు
చూడవచ్చిన చుట్టాల్నీ, పక్కాల్నీ/బజారంట తిప్పచ్చు
——-
కావలిస్తే అర్థరాత్రి నిద్ర పట్టనపుటుడు/లేచి కూచుని కథలో కవితలో రాసుకో/అభ్యంతరం చెప్పడు నీనాథుడు.
నీరచనల ఆశోకవృక్షానికి దోహదక్రియ సలుపగల ధీరోదాత్త నాయకుడతడు.
అంటారు.

కుటుంబ సమస్యలు
పెళ్లి తరవాత జీవితం మిగిల్చిన చీకటిని తన సంవేదనాత్మక కవిత్వంలో అడుగడుగునా వినిపించే షంషాద్ “నీ జీవితపు స్టూడియో లోంచి/ బయటికి రాలేకపోయినా/ నా హృదయపు డార్క్ రూమ్ లో/
నువ్వెప్పుడూ నెగెటివ్ వే” అంటారు.

‘హైడ్ అండ్ సీక్ !’ కవితలో –కల్పనా రెంటాల
ఏళ్ల తరబడి చేసిన సహజీవనం /ఒట్టి దొంగ కాపురం / నీకూ నాకూ మధ్య మిగిలింది/కొన్ని విఫల స్వప్నాలు మాత్రమే !
ఆకాశాన్ని రెక్కలుగా కత్తిరించినా /భూమి ని రెండు ముక్కలుగా విడగొట్టినా/ప్రేమ పేరుతో ఈ ద్వేషాన్ని /శవం చుట్టూ మోసే కుండ లా/జీవితాంతం మోస్తూ తిరగాల్సిందే !
——
ఆమే “స్వరం మార్చిన ఒక మాట” కవితలో “మాటలు లేని పగళ్ళు,/నిద్ర లేని రాత్రుళ్లు/స్పర్శ లేని సహజీవనాలు/ప్రేమ లేని అనుబంధాలు /శాంతినివ్వని యుద్ధాలు “ అంటారు.

ప్రవాస జీవితం పట్ల ఊహలు/అపోహలు/ నిజాలు
“ప్రవాస పునాదులు” లో మరువం ఉష “ప్రవాసం” అంటే అనాధారిత ప్రతిపాదనలు /తుడవలేని అపోహలే కొన్ని మెదడు కొలతల్లో” అని మొదలు పెట్టి
“యాంత్రిక వనాలలో మంద విడిన మేకలా/నోరెండిన పసి బిడ్డని చంకనేసుకుని/గుక్కెడు నీటికి అర్రులు చాస్తే
“డొల్లర్ అ బొత్త్లె” అంటూ దాహపు వెల కట్టిన నేలలో/నెర్రెలు విచ్చిన మానవత్వాన్ని పరిచయం చేసుకున్నాను” అంటారు.
“డాలర్ లైఫ్” కవితలో “అమెరికా ఇప్పుడు నా అత్తారిల్లయ్యింది. పురిటికయినా పుట్టింటికెళ్లే యోగంలేదు” అంటారు షంషాద్.

“ఎంచక్కా అమెరికా” కవితలో “కారులన్నీ జపాను, కొరియా ధర్మం /బట్టలు, వస్తువులు చైనా, తైవాన్ లాభం /ఆకాశాన్నంటే ఇంధనపు ధరలు /ఊడిపోయిన ఉద్యోగాలు,/పడిపోయిన ఇళ్ల ధరలు
త్రిశంకు స్వర్గంలో కొట్టుకుంటున్న మనుషులు /నామరూపాల్లేకుండా గడిపే నాకు
ఇంకెందుకు అమెరికా, ఎంచక్కా ఇండియా అంటారు” గునుపూడి అపర్ణ .

“ఇంటూ నలభై” కవితలో కె.గీత “రూపాయిల్లో తర్జుమా అయ్యే ప్రతి అంకే భూతద్దంలో కనిపించి వణుకు పుట్టిస్తుంది” అని, పక్క వాటాలో ఎవరుంటారో తెలీదు/ఎవరి భాష ఎవరికీ రాదు/ఇంగ్లీషు దారం కుట్టుకుని ఎన్ని ముళ్ళని వేసుకుంటాం?” అని వాపోతారు.

ఒంటరి తనం
ప్రవాసం లో ఉన్న మనిషికి ఒంటరితనం తప్పనిసరిగా కలిగే అనుభవం. ఎవరి కవిత్వంలోనైనా ఆ పాళ్లు అత్యధికమని వేరే చెప్పనవసరం లేదు.
అయితే ఒంటరితనాన్ని బాధ గానే కాక అద్భుతం అని అనుభూతించడం కూడా కవయిత్రుల కవిత్వంలో కనిపించిన విశేషాంశం.

“పొద్దుటి ఆకాశం” కవితలో రామినేని మోహన తులసి
“పగలేమో ఇన్ని కాంతిరేఖల్ని వేళ్ళకి చుట్టుకుని వేకువపై హుషారు పాటను కట్టడం/వెన్నెలసంతకం వేళల్లో ప్రపంచంలోని ప్రేమపాటలన్నీ గాలిలోకి విసిరివేయబడతాయో ఏమో//అవన్నీ తలదిండుకిందేసుకుని తెల్లకాగితమవ్వడం
ఎవరన్నారు, ఒంటరితనం వైనం అద్భుతం కాదని!”
మరో కవితలో” ఒద్దికగా ఇసుక రేణువుల్ని సర్దుతున్న ఆ అలలనే చూస్తున్నా/పల్చగా పేరుకుంటున్న ఆ పొడినూకలో ఏదో ప్రాణం కదలాడుతున్నట్టుంటే/ తడి అంచులతో రహస్య సంభాషణ చేస్తూ వేలికొసలు /ఇసుక యాస నేర్చుకుని నా పేరే రాసుకుంటున్నా” అంటారు.

“కొందరున్నారు కదు ఇలా!?” కవితలో మరువం ఉష
“కప్పుని అడ్డంపెట్టుకుని కన్నీరు దాచిన ఊసు ఇంకొకసారి పొలమారుతుంది”
అయినా…. “తేనీటి సమయాలు, ఉదయాలు విసిగించవు/ తప్పనిసరైతే తప్పా పంచుకోవాలనీ అనిపించదు” అంటారు.

—-
ఇక ఒంటరి తనం లో ఉండే రకరకాల భావోద్వేగాలకు అద్దం పట్టే కవితల్ని పరికిస్తే :
“పరిపాటి” కవితలో ఉష “కిటికీ వారగా కుర్చీతో స్వగతం/ మేజా బల్ల మీద మడిచిన కొత్త పుస్తకం/పుట కొక అతుకుగా పాతకాగితాల ముక్కలు
అతుక్కుపోయి పుట్టిన కవలల్లా/ముక్కల అడుగున తేలుతూ కొత్త అక్షరాలు/తడి సిరా లో మిలమిల్లాడుతూ మరొక లేఖ
చేర్చాల్సిన చిరునామా దొరక్క వెర్రి నిర్వేదం /నిదుర రాని చలిరాత్రి జాగారం” అంటారు.

“నువ్వుండి వుంటే” లో నిషిగంధ “పొడవాటి యూకలిప్టస్ చెట్ల మధ్యలో
రెపరెపలాడే కాంతి నీడల్లోవదలలేక.. వదిలి కదల్లేక.. తచ్చట్లాడిన ఆ ఒక రోజుని మడతలు తీసి/దిగులు సాయంత్రాల ముందరంతా పరుచుకున్నప్పుడల్లా/పక్కన నువ్వుంటే బావుండుననే అనిపిస్తుంది..
సెలయేటి అలల మీద దక్షిణపు గాలి సేదతీరే సమయాలు /ఆగి ఆగి సంతోషపెట్టే ఆ చిన్ని కలవరం చెంపల్ని నిమిరినప్పుడల్లా/పక్కన నువ్వుంటే చెప్పలేనంత బావుండుననే అనిపిస్తుంది!” అంటారు.

చుట్టూ ఉన్న సంస్కృతి (ఇండియా/అమెరికా ) లో ఇమడ లేకపోవడం
నిడదవోలు మాలతి”బొమ్మా- బొరుసూ “ కవితలో “పరంపరాగత సాంప్రదాయాలోపక్క/స్థానిక మర్యాదలు మరో పక్క/కొరుక్కు తింటున్నాయి/చెదపురుగుల్లాగా/బతుకంతా/కలగాపులగం/గందరగోళం/అయోమయం/అంధకారబంధురం”
“నాకు నవ్వొస్తోంది” కవితలో -”తెలుగు వాళ్ళు కనబడ్డ వాళ్లని కనబడినట్లు దోచే వ్యవస్థకి ఘాటు సమాధానం ఇది.
సంస్థల పేరిత డబ్బు నొల్లుకోవడం, ఉచిత సేవలకోసం ఉపయోగించుకోవడం” అంటారు మాలతి.

“జవాబు లెరుగని ప్రశ్నలు” కవితలో మరువం ఉష
తామరాకు మీద బొట్టు బతుకు ఎందరికి తెలుసు?/అతుక్కుపోలేక, నిలవలేక, ప్రవాహం లో కలిసిపొలేక /ఆకు మీద నర్తిస్తూ..


“డాలర్ లైఫ్” కవితలో షంషాద్ “కంప్యూటర్ ని కనుక్కున్న వాణ్ణి కసిదీరా మనసులో తిట్టుకుంటూ తప్పని తిరుగు ప్రయాణం” అంటారు.

పడికట్టు/గానుగెద్దు జీవితం పట్ల విరక్తి :
ఆర్.రాధిక “ఈ తరం” కవితలో అలారం మోతలతో ఉలికిపాటు మెలకువలు/అలసిన మనసులతో కలలులేని కలత నిదురలు/ పోగొట్టుకుంటున్నది పోల్చుకోలేని/పొందుతున్నది పంచుకోలేని/భారమయిన బిజీ జీవితాలు
/త్రుప్తి తెలియని చింతా చిత్తాలు” అంటారు.

మరువం ఉష “అర్థ/రహిత/శాస్త్రం” కవితలో “చీకటి రెక్కలు విదిలిస్తే /రాలిపడిన ఈకల్లా ఈ రాత్రులు
“తెలవారగానే వ్యాపారాలు మొదలౌతాయి/ముసుగులు తొడుక్కుని నువ్వు వెలికి వస్తావు-
డబ్బుగా, వస్తువులుగా /పగటివేషాల పెట్టుబడులు మోసుకుంటూ” అంటారు.

కౌటుంబిక జీవితంలో కొత్తగా లభించిన ఆనందం
“ఎగిరొచ్చిన ఇల్లు” కవితలో కె.గీత -వేన వేల మైళ్లు ఎగిరొస్తేనే గానీ నా ఇల్లు నాకు కనిపించలేదు
/అద్దె ఇల్లో, నాల్గు గదులో ఏదైనా గానీ/నా ఇల్లు -నా కలల ఇల్లు/నేను, నా పిల్లలు కలిసి హాయిగా ఆడుకునే ఇల్లు
/నా ప్రేమికుణ్ణి నచ్చినప్పుడు ముద్దుపెట్టుకునే ఇల్లు” అని,
“గుప్పిట ప్రేమ” కవితలో పాలపర్తి ఇంద్రాణి
ప్రతి నువ్వు/ప్రతి నేను/మరులుగొన్న ప్రతీసారీ
మంకెన పువ్వులు విచ్చే కాలం/పచ్చని ఆకులు మెరిసే కాలం/వెన్నెల పువ్వులు తురిమే కాలం/చంద్రుని చల్లని ముద్దుల కాలం/సూర్యుని వెచ్చని కౌగిలి కాలం
ప్రతి నువ్వు నువ్వే/ప్రతి నేనూ నేనే/ప్రేమ కాలం ఎప్పటికీ తర్లి పోదు. అనీ అంటారు.

దగ్గరి అనుబంధాల పట్ల ఎడబాటు

“ఎడబాటు”కవిత లో మమత “పొద్దుపొడుపు చుక్క మసక వెలుతురులో కరిగిపోయిన చోట
తొండమెత్తి మొదటి కిరణాన్ని రారమ్మని పిలుస్తోంది ఒక ఆవిరి ఏనుగు./నువు నన్ను అమాంతంగా గాల్లోకి ఎగరేసి
/పట్టుకుని గుండెకు హత్తుకుంటే/నీ మెడలో ముఖం దాచుకుని/కెరటాలపై నురగను అంటీ అంటనట్టుగా తాకి
ఎగిరిపోతున్న సీగల్ రెక్కల చప్పుళ్ళు వినాలని వుంది నాన్నా!”
“నీవు ఊరెళ్ళినపుడు” కవితలో వైదేహీ శశిధర్ “ఏర్పోర్ట్లో వీడుకోలు పలికి నీవు విమానమెక్కగానే /మన కిటికీ పక్కన ఏపుగా పెరిగిన మాగ్నోలియా నీడలలో /ఇన్నేళ్ళుగా దాక్కున్న ఒంటరితనం /రెక్కలు చాచిన పావురమై నా భుజాల మీద వాలుతుంది/ మళ్లీ తిరిగొచ్చే వరకూ నీవు నా జడలో చిక్కుకున్న జ్ఞాపకాల జాజిదండై పరిమళిస్తూ ఉంటావు.

“నీవు లేనప్పుడల్లా” కవితలో “నులివెచ్చని సూర్య కిరణాలు తాకిన/పొగమంచులా కరిగిపోవాల్సిన కాలం
/నీవు లేనప్పుడల్లా /ధృవాగ్రాలపై పేరుకున్న కఠిన శీతాకాలపు /కర్కశ హిమంలా ఘనీభవిస్తుంది
“ఇంటినొదల్లేని బెంగ”కవితలో కె.గీత “ఆదమరిచి నిద్రపోతున్న భార్యనొదిలి/ముద్దుగా ఒత్తిగిలిన చంటాడి నొదిలి
గౌతముడెలా వెళ్లాడో తెలీదు గానీ/ఆదివారం ఉదయం/ఎవరూ నిద్రలేవని/బద్ధకపు మంచు ఉదయం/ఒంట్లోని వెచ్చదనాన్ని దుప్పటీలోనే ఒదిలి/కాలేజీ చదువు కళ్లని నులుముకుంటూ/ఆదమరిచి హాయిగా నిద్రపోతున్న అతన్ని
అందాల కుందేలు పిల్లై పక్కనే ముడుచుకున్న/పసిపాపని ఒదిలి ఎలా వెళ్లగలను?!
ఇంటినొదిలి ఎక్కడికెళ్లినా తీరని బెంగ/సాయంత్రం ఇంటికొచ్చి గరాజు తీయగానే/ఏదో ఒక అట్టపెట్టెలోకి పోయి కూచుని
నా వెనకే మూసుకుంటున్న తలుపు వెనక/నిశ్శబ్దంగా నిద్రపోతుంది.
———-
సామాజికాంశాలతో కూడిన కవితలు:

సిరియన్ల దుస్థితికి అద్దం పట్టే “అయిలన్ కుర్దీ” గురించి మమత కొడిదెల రాసిన కవిత “ఎంతటి వెర్రివాడవు!”
“ఆకలిదప్పులను మరిపించి
బాంబుల వర్షం దాటి
కత్తిమొనకు నీ నాన్నను అర్పించి
సముద్రాన్నే జయించబోయావు
నిన్నందుకుంటామని ఆశ పడ్డావు కదూ

ఆవలితీరాన మేం కాక ఇంకెవరుంటారని చెప్పిందిరా నాన్నా, నీ వెర్రితల్లి?” అని దుఃఖ పడ్తారు.

సంప్రదాయాల మధ్య నలిగిపోయే ముస్లిం స్త్రీ దుస్థితికి తార్కాణం “ చాందినీమే అంధేరా”.
దువాల మన్నత్ ల ఫలాలను/పుణ్యకథలు గా వివరిస్తుంటే/ మూడు సార్ల తలాకే నా నల్ల పూసల గ్యారంటీ అయినపుడు/ నేనయిదుసార్లు నమాజ్ ఎవరి కోసం చెయ్యాలి?” అని ఆవేదనగా ప్రశ్నిస్తారు షంషాద్.

అమెరికా చరిత్ర/ సమాజ సమస్యలు:

అమెరికా లో అసమర్థులు అందలమెక్కి , ఏలడం గురించి “శునకేంద్రభోగాలు” కవిత లో నిడదవోలు మాలతి
“మానవజన్మనెత్తి/ నానా ఆగచాటులు పడుటేల/అమెరికాలో కుక్కగా/పుట్టిన కలుగు
/అష్టశ్వైర్యములు, అనన్యసామాన్య భోగబాగ్యాలు” అంటారు.

అమెరికా చరిత్ర, ఇక్కడి సమాజ సమస్యల గురించి కె.గీత రాసిన “చరిత్ర చలనం, మంచు గబ్బిలం, ఐడెంటిటీ మొ.న కవితలు.

మంచు గబ్బిలం లో – “ఎముకలు కొరికే చలిలో/ఆరో వీధి చెత్తకుప్ప సందులో/తెల్లారగట్ల అట్టముక్కల మధ్య
/ఎండిన చెక్కపొట్టు మధ్య చుట్టబెట్టిన ఆకారం/నిద్రలోనూ సలుపుతున్న ఆలోచన్లలా ఉలిక్కిపడ్తూ
/చివికిన బొచ్చు తల తోపీ లోంచి మకిలి దొర్లుతున్న జుట్టు/లోపల గాయాలు రేగి చర్మం వేళ్లాడుతున్నట్లు అసహనంగా కదిలే తుప్పు బూట్లు/ఎప్పుడు లేస్తుందో తెలీదు
అమెరికా రోడ్డు మీద/గూడు లేని పౌరుడికి/నిలువెల్లా వణికే మనిషికి/గుండె లో ఎక్కడో/బతికించే/ఒక వెచ్చని ఆశ
తెల్లారగట్ల చలిని మునిపంట కొరికే ఆకారం/భూతల స్వర్గపు వీధుల్లో/మంచు గబ్బిలమై వేళ్లాడుతూ
“చరిత్ర చలనంలో “అమెరికాలో స్థానిక రెడ్ ఇండియన్లని సమూలంగా తెగనరికి రూపొందిన ఇప్పటి అమెరికా నుద్దేశించి ఇలా అంటారు – నీ గొంతులో దిగబడ్డ ఆక్రందనలు పెనుగాలులై/మహా సముద్రాలు చుట్టి వెను తిరిగాయి/నీ ఒంటి మీద రోమాలై నిలబడ్డ ఎస్టేట్లన్నీ/చరిత్ర ముందు సిగ్గు లేక నిల్చున్నాయి”
“ఐడెంటిటీ” కవితలో -”ఇక్కడ నేను అన్ని రంగుల్నీ చూశాను-/ఆకాశంలో కాదు-నడిచే నిలువెత్తు మనుషుల్లో-
/నిన్ను చూడగానే గుర్తించే రంగు/నీ ముఖాకృతి -నీ ఐడెంటిటీ/నువ్వు అమెరికన్ ఇండియన్ వా/ఏసియన్ ఇండియన్ వా/నీ ఐడెంటిటీ కోసం ఎంత చరిత్ర వెనక్కి వెళ్ళాలి?
కూచిభొట్ల శ్రీనివాస్ మరణానికి నివాళిగా రాసిన డాలరు మరక లో కె.గీత “నీ మరణం డాలర్ల నిచ్చెన మెట్ల మీద /వేళ్లాడే పాదపు నెత్తుటి చారిక/
వలస బతుకు నుదుటి మీద/ ఎప్పటికీ చెరుపుకున్నా చెరగని మరక” అంటారు.

——

నాకు తెలిసినంత వరకు

జీవితం అంటే-
కొంచెం కన్నీట్లో రంగరించే ఆనందామృతం. కాస్త సంతోషం లోనే ముంచేసే వేదనాశ్రుపేతం.

కవిత్వం అంటే-
అనంత ఆనందం. ఒక గుక్కతిప్పుకోలేని వేదన. ఒక వెచ్చని ఊపిరి. ఒక పిడికిలి బిగింపు.

దానికి కొలమానాలు ఉండవు.

ఇంత వరకూ చూసిన కవిత్వం లో కొన్ని కన్నీళ్లు, కొన్ని ఎడబాట్లు, కొన్ని విరక్తులు, కొన్ని వేదనలు, కొన్ని సంతోషాలు, కొన్ని అనుభూతులు, కొన్ని పులకరింతలు.
ముఖ్యంగా జ్ఞాపకాలు, ప్రకృతి, ఒంటరి తనం, విరక్తి ..మొ.న వాటి చుట్టూ నే అధిక భాగం కవిత్వం ప్రదక్షిణలు చెయ్యడం మనం గమనిస్తాం.

అమెరికా రక్త చరిత్ర, సమాజంలోని అట్టడుగు వర్గాల కష్టాలు, ఇక్కడి భారతీయుల మీద దాడి, తెలుగు రాష్ట్రాల విభజన వంటి చారిత్రాత్మక సందర్భాలు , సమకాలీన భారతీయ సమస్యలు మొ.నవి ఈ కవితల్లో ఎక్కడో మచ్చుకి మాత్రమే కనిపించడం ఆశ్చర్యకరం!

కథలలో వచ్చినంత విస్తారంగా కవితా వస్తువులు రావడం లేదు. ఉదాహరణకి లెస్బియన్/ హోమో వ్యవస్థ, సింగిల్ పేరంట్, వర్గ /ఆర్థిక వివక్షలు.

“ఇక్కడి సమస్యలు అర్థం కావాలంటే ఇక్కడి వ్యవస్థలోకలిసిపోవాలి. ఇక్కడి సమాజంలో భాగస్వామ్యులు కావాలి.” అని అఫ్సర్ అంటారు. అది ఈ సందర్భంలో అక్షరాలా సత్యం. వలస వచ్చిన తరానికి అదంత సులభం కానప్పటికీ అసాధ్యం కాదు.

కవిత్వం కేవలం వైయక్తిక బాధలకు, వేదనలకు, అనుభూతులకు మాత్రమే పరిమితం కాకుండా ఇతరుల కన్నీళ్లు తమవిగా దుఃఖించే హృదయపు తలుపులు తెరవాలి. సామాజిక కన్ను తెరుచుకోవాలి. కొన్ని బలమైన గొంతుకలు రావాలి.

కవిత్వం ఒక సామాజిక బాధ్యత అని గుర్తించాలి.

———

ప్రకటనలు
This entry was posted in సాహిత్య వ్యాసాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s