ఒక రేకు రాలిపడిన వేళ-

ఒక రేకు రాలిపడిన వేళ-

లోకం కన్ను నాలో తెరుచుకున్నపుడు
మీరయిదుగురూ అయుదు రేకుల
అందాల పుష్పమై కనిపించారు
ఏదో నేను
మీ అయిదుగురి చిన్ననాటి
అల్లిబిల్లి మిరపకాయ బుడతనన్నట్లు
మీ పది చేతుల పైనే
నాకు నడక నేర్పేరు
అమ్మమ్మ ఇల్లని ఎప్పుడూ
తెలియకుండా
అపురూపంగా ఎత్తి పెంచేరు నన్ను
మీ చిర్నవ్వు కళ్ల కుటుంబంలో
పెద్దక్క కూతురినైనా
మీకు చిన్ని చెల్లెలు ఉద్భవించినట్లు
గొప్పగా ఉరకలేసిన మీ ఆనందమే
ఇవేళ్టికీ నాకు శ్రీరామ రక్ష
మీ సంగీతం నా వారసత్వ సంపదై
నాలో ఎప్పుడూ రక్తమై ప్రవహిస్తుంది
మీ చుట్టూ అల్లుకున్న నా బాల్యం
ఎప్పటికీ చెరగని ఆనందమై
నన్ను వెంటాడే అపురూప జ్ఞాపకమై
నాలో అనుక్షణం జీవిస్తుంది
ఒక రేకు రాలిపడిన వేళ
మీ అందరికీ ఎలా ఉందో తెలియదు గానీ
నాకు అమాంతంగా కాళ్లు మెలిపడి
తట్టుకుని పడినట్లుంది
తప్పిపోయిన గూడుని వెతికే
రెక్క విరిగిన పక్షి గిలగిలా కొట్టుకుంటున్న
మెలితిప్పే బాధ
కళ్లలో గుప్పెడు ఇసుక పోసినట్లు
అనుక్షణం మెరిగే
చురచురా కోసే బాధ
గుండె కిందనెక్కడో
గడ్డకట్టిన దు:ఖం
అకస్మాత్తుగా గొంతు నిండి
ఉక్కిరిబిక్కిరి ప్రవాహమై
నన్ను కుదిపివేస్తూంది
వేణాంటీ! అని ఇప్పుడు ఎవరిని పిలవాలి?
నీ పిల్లలకి బంగారు తల్లిని ఎక్కడి నించి తేవాలి?
అందరికంటే ఎక్కువ గిల్లికజ్జాలు పడే నిన్ను
అందరికంటే ఎక్కువ నవ్వించే నిన్ను
మళ్లీ ప్రాణం పోసి ఎలా తేవాలి?
నీ చివరి రోజుల్లో
నన్ను చూసి నువ్వు రాల్చిన
నీ కన్నీటి చుక్కలు
ఇప్పుడు నా బుగ్గలపై ధారాపాతమయ్యేయి
ఎముకలకు చర్మం అంటుకుపోయి
పాలిపోయిన నీ మేని పసిమి ఛాయ
ఇప్పుడు నా ప్రపంచాన్ని
వర్ణ విహీనం చేసింది
ఫోటోల్లోని నీ అందమైన
విశాలమైన కళ్లు
నగలతో సమానంగా
మెరిసే తళుకైన నవ్వు
అన్నీ.. అన్నీ…
అగరుపొగై
గాలిలో ఆవిరైపోయాయా?
గుప్పెడు బూడిదై
మట్టిలో కలిసిపోయాయా?
వేణాంటీ!
వేణాంటీ!
ఒక్కసారి ఎప్పటిలా
పండక్కి వచ్చి
గొడవ పడవూ!
ఒక్కసారి
ఏంటిరా గీతమ్మా
ఎలా ఉన్నావు? అని పలకరించవూ!
పూల రేకులు రాల్చొద్దని
చెట్టు కాండాన్ని
కౌగలించుకుని
వదలనని మొరాయించే
చిన్నపిల్లనై
వేడుకుంటున్నాను
ఒక్కసారి
తిరిగొచ్చి
ఏమీ కాలేదని ధైర్యం చెప్పవూ!
ఈ దు:ఖపూరిత హృదయాన్ని
ఓదార్చవూ!
——
(పెద్ద పిన్ని, వేణాంటీ కి నివాళిగా-)

గీత

Image may contain: 1 person
ప్రకటనలు
This entry was posted in కవితలు and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s