నా కళ్లతో అమెరికా-68 మెక్సికో నౌకా యాత్ర (భాగం-5)

నగర సందర్శన- టేస్ట్ ఆఫ్ మెక్సికో టూరు
అనుకున్న విధంగా ముందు రోజు నౌకలోకి అడుగు పెడ్తూనే మర్నాటికి మెక్సికో భూభాగంలో తిరిగే టూరు ఒకటి బుక్ చేసుకున్నాం.
ఉదయం దాదాపు ఏడు గంటల ప్రాంతంలో మా నౌక తీరాన్ని చేరింది.
అమెరికా పశ్చిమ తీరంలో దక్షిణ భాగంలో సరిహద్దుని ఆనుకుని ఉన్న “బాహా కాలిఫోర్నియా” అనే తాలూకాలోని “ఎన్సినాదా” అనే ఊరు అది.
మెక్సికో దేశంలోని ఈ ప్రాంతానికి ఇలా నౌకలో వెళ్లే వారికి వీసా అవసరం లేదు.
మేం బుక్ చేసుకున్నది “టేస్ట్ ఆఫ్ మెక్సికో” అనే ఫుడ్ టూరు అయినా అందులో నగర సందర్శన కూడా భాగం కావడంతో సంతోషపడ్డాం.
అక్కడి సముద్రం లోతు ఎక్కువగా ఉండడం వల్ల నౌకని తిన్నగా ఒడ్డు వరకూ తీసుకెళ్లి ఆపేరు. దిగి చూస్తే తీరాన అదొక పెద భవంతి అనే భ్రాంతి కలిగింది.
షిప్పు దిగగానే అక్కడి ప్రాంతీయ వస్త్ర ధారణతో కొందరు రంగురంగుల ఇంద్ర ధనుస్సుల్లా ప్రత్యక్షమయ్యేరు.
వారికి డబ్బులిచ్చి ఫోటోలు తీసుకోవచ్చు.
ఇక పోర్టు నించి బయటికి వెళ్లే దారి షెడ్డు లాంటి భవనం గుండా సాగుతుంది.
అందులోనే భద్రతా లైన్లు దాటగానే అటూ, ఇటూ గిఫ్టు షాపులున్నాయి. అవి దాటి అటు గుమ్మం బయటికి రాగానే అదొక సాధారణ బస్సు స్టేషనులా అగుపించింది.
టూర్లకు మినీ బస్సులు అక్కడ సిద్ధంగా ఉండి ఎక్కించుకున్నాయి. పోర్టు లో నుంచి దాదాపు ఒక కిలోమీటరు బయటికి వచ్చినా దూరంగా నౌక కనిపిస్తూనే ఉంది.
చుట్టూ ఎక్కడా చెట్టూ చేమా లేకుండా బల్ల పరుపుగా ఉన్న ఎర్ర నేల అది.

బస్సు ప్రధాన రహదారికి ఎక్కగానే అమెరికాకు, మెక్సికోకి వెంటనే తేడా తెలిసి పోవడం మొదలెట్టింది.
అతి సంపన్నమైన మొదటి ప్రపంచ దేశానికీ, ఎక్కడ చూసినా దారిద్ర్యం తాండవించే మూడవ ప్రపంచ దేశానికీ ఉన్న తేడా అది.
నిజానికి మేం దిగిన ఎన్సెనాదా అనే ఊరు మెక్సికోలోని అమెరికా దేశపు సరిహద్దులోనే ఉన్న బాహా కాలిఫోర్నియా ద్వీపకల్పం లో ఉంది.
సముద్రతీరంలోని ఎడారి ప్రాంతమది. బాహా కాలిఫోర్నియా రాష్ట్రం లో ఎన్సెనాదా మూడవ పెద్ద నగరం.
రాష్ట్రంలోని 75% జనాభా రాజధాని తియువానా, ఎన్సినాదా మొ.న నగరాలలోనే ఉన్నారు.
ఎన్సెనాదా సిటీ టూరులో భాగంగా బస్సులో నుంచే రివియెరా ఎన్సెనాడా చూసేం. అది చారిత్రాత్మకమైన కాసినో. ఇప్పుడు మ్యూజియం గా మార్చేరు. ఇక్కడే “మార్గరీటా కాక్ టేల్” ని కనిపెట్టారట.
ఇక అన్నిటి కంటే ముఖ్యంగా చూడవలసినది “సివిక్ ప్లాజా” (Civic Plaza). ఇక్కడ మెక్సికో వీరులు Benito Juarez, Venustiano Carranza and Miguel Hidalgo ల పెద్ద విగ్రహాలు, అతి పెద్ద మెక్సికో జెండా లను, మెక్సికో అమర వీరుల స్థూపాలను చూడవచ్చు. ఈ విగ్రహాల తలలు మాత్రమే ప్రతిష్ఠించి ఉండడం విశేషం. మా టూరులో మొదటి స్టాపు ఇక్కడే.
మేం బస్సు దిగగానే ఇద్దరు ముగ్గురు పిల్లలు చేతులకు అటూ ఇటూ పూసల దండలు, బ్రేస్లేట్ల గుత్తులు పట్టుకుని కొనుక్కోమని మా వెంట పడ్డారు. అమెరికాలో ఎక్కడా ఇలా చట్ట వ్యతిరేకంగా చైల్డ్ లేబర్ కనిపించరు. వాళ్ళను చూసి వరు, సిరి బెదిరి పోయేరు. వాళ్ళను వదిలించుకుని గైడు వెనక పరుగుతీసేరు.
మా బస్సు గైడు చకచకా ఆ మూల నించి ఈ మూలకి మమ్మల్ని నడిపించి, వివరాలన్నీ త్వరగా చెప్పి మరో అరగంట లో తిరిగి చూసి రమ్మని వెళ్ళి పోయింది.
చుట్టూ సందడిగా, జన సందోహంతో కళకళ్లాడుతూ ఉన్న ఆ జంక్షనులోని దాదాపు త్రికోణాకారపు ఆ పార్కులో ఎండిపోయిన గడ్డిని తడపడం కోసం నేల మీదే పారాడుతున్న నీళ్ళ పైపులు, అక్కడక్కడా లీకయ్యి మడుగులు కట్టిన బురద గుంటలు అచ్చు మన ప్రాంతంలాగానే. బాగా నవ్వు వచ్చింది మాకు. మందారం చెట్టు విరగబూసి ఉంది. చటుక్కున కోసి తలలో ఒక పువ్వు తురుముకున్న నన్ను చూసి ఇంకాస్త నవ్వేరు మా పిల్లలు.
అక్కణ్ణించి దాదాపు పదకొండు గంటల వేళ తిన్నగా మా అసలు సిసలు టూరు “టేస్ట్ ఆఫ్ మెక్సికో” ప్రదేశానికి చేరుకున్నాం.
బయటి నించి చూస్తే ఏదో పాత ఇల్లు అనుకునేలా ఉన్న రెస్టారెంటు అది.
లోపల హాలు ధాబా లాగా ఉంది. అది దాటి వెనక వైపు పెరట్లోకి అడుగు పెట్టేసరికి మా టూరు వాళ్ల కోసమే టేబుళ్ల మీద సరుకు, సరంజామా సర్ది పెట్టేరు. టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి… అవన్నీ కోయడానికి కత్తులు, కటర్ లతో బాటూ మనిషికి ఒక అమందస్తా (చిన్న రోలు) కూడా ఇచ్చే సరికి ఖంగు తిన్నాం.
-కె.గీత

(ఇంకా ఉంది)

http://vihanga.com/?p=20265

https://photos.app.goo.gl/mEv6erU4dG5lawkX2

ప్రకటనలు
This entry was posted in నా కళ్లతో అమెరికా(Travelog) and tagged , . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s