అనగనగా అమెరికా-33 (ఓట్ల లెక్కింపు మజా)

అనగనగా అమెరికా-33

ఓట్ల లెక్కింపు మజా

భారతీయుల ఎక్కువగా పనిచేసే ఆఫీసుల్లో క్రికెట్ మేచ్ ఉన్నరోజు ఆఫీసు దాదాపు ఖాళీగా కనిపిస్తుంది.

అంతా  “వర్క్ ఫ్రం హోం” చేస్తారన్న మాట-” క్రికెట్ మేచ్” లో కళ్లూ, చెవులూ  అప్పగించి.

అదెలా సాధ్యమో బయటి నుంచి చూసే వాళ్లకే కాదు, ఆ పైవాడిక్కూడా అర్థం కాదు.

సుందరానికి క్రికెట్ అంటే ఇష్టమే కానీ “పిచ్చి” లేదు.

కానీ అప్పుడప్పుడూ “మిగతావాళ్లు ఇంచక్కా ఇంటి నించి పనిచేస్తుంటే…” అన్న భార్య గోల పడలేక ఇంటినించి పనిచేస్తుంటాడు.

ఇవేళ ఎప్పటిలానే సుందరం “ట్రాఫిక్కులో ఇరుక్కోకుండా ఉండడం” అనే వంక పెట్టి  ఆఫీసుకి  లేటుగా వచ్చాడు.

మాములుగా అతను అడుగుపెట్టేసరికి  ఆఫీసులో అంతా ఎవరి క్యూబుల్లో వాళ్లు తలలు దూర్చి  తలమునకలయ్యి ఉంటారు. లాప్టాప్ కీ బోర్డ్ల సన్నని  టకటకల ధ్వనులు తప్ప ఏవీ వినబడవు.

ఈరోజు ఎక్కడో మూణ్ణాలుగు క్యూబుల్లో తప్ప ఎక్కడా అలికిడి లేదు. హఠాత్తుగా అనుమానం వచ్చింది సుందరానికి. ఇవేళా క్రికెట్ మాచ్ ఉందా! అని.

సెల్ఫోను తీసి చూసుకున్నాడు. తన కాలెండరులో అలాంటిదేమీ లేదే.

మరేమై ఉంటుందా అని నెత్తి గీక్కుంటూ కూచున్నాడు.

భారతీయులు అధికంగా ఉన్న ఆఫీసంటే తనకు మొదట్నించీ ఇష్టం. పని మాట దేవుడెరుగు, పిచ్చాపాటీ బాగా మాట్లాడుకోవచ్చు. ఇక  ఆఫీసులో బోల్డు మంది  తెలుగు వాళ్లే.

ఆఫీసులో ఫేసుబుక్ గట్రా నిషిద్ధం కాబట్టి ,  కేఫెటేరియాలో కొచ్చి సెల్ఫోను నించి కొలీగ్ కు డయల్ చేసేడు.

“ఉహూ…” ఫోను ఎత్తలేదు.

మరొకతనికి, మరొకళ్లకి… …. “ఉహూ…”  అదే పరిస్థితి.

ఇలా అంతా సెల్ఫోనుకి దొరక్కుండా అంత సీరియస్ వర్క్ ఫ్రం హోం చేసేస్తుండడం భలే విచిత్రంగా అనిపించింది.

భార్యకి ఫోను చేసి విషయం కనుక్కుందామని చూసేడు.

విచిత్రంగా ఆవిడ కూడా ఫోను ఎత్తడం లేదు.

“ఏలియన్సు వచ్చి  తెలుగు వాళ్ల సెల్ఫోనులు డిసేబుల్ చేసేసేరా”  అని సైన్సు ఫిక్షన్ అనుమానం కూడా వచ్చింది సుందరానికి.

మధ్యాహ్నం వరకూ ముళ్ల మీద ఉన్నట్టు  ఆపీసులో గడిపి, తనూ వర్క్ ఫ్రం హోం మెయిలొకటి పెట్టి ఇంటికి బయలుదేరేడు.

భార్యామణి ముందు గదిలో పని చేస్తూ కనబడేది రోజూ. ఇప్పుడక్కడ లేదు.

బెడ్రూములోనే లాప్టాప్ ముందేసుకుని సీరియస్ గా  ఆన్లైన్  టీవీలో మునిగి పోయి ఉంది.

“పక్కకు తల కూడా తిప్పకుండా అంత మునిగి పోయే విశేషం ఏవిటో” అన్నాడు.

బదులుగా  “ఉష్…” అని సైగ చేసింది.

ఉదయం నించీ ఇంటి పనేమీ కాలేదని ఇంటి అవతారం చూస్తే అర్థం అవుతూంది.

“ఏవిటోయ్ అంత ఇదిగా” అని పక్కనే తనూ చతికిలబడ్డాడు.

చెవులకి పెట్టుకున్న ఇయర్ ఫోన్సు ని తీయమని సైగ చేసాడు.

పైకి సౌండ్ వస్తుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చీందావిడ.

స్క్రీను మీద “ఓట్ల లెక్కింపు” జోరుగా జరుగుతూంది. అప్పటికి గాని  సుందరానికీ అందరూ ఫోన్లు ఎందుకు ఎత్తడం లేదో అర్థం కాలేదు.

తెలంగాణాలో నూ, ఆంధ్రలోనూ మార్చి మార్చి ఓట్ల కౌంట్ చూపిస్తున్నారు. ఒక పక్క ఓట్ల లెక్కింపుతో పాటూ వివిధ పార్టీల నేతల్ని కొందర్ని స్టూడియోలోనూ, కొందర్ని బయటెక్కడో పట్టుకుని రకరకాల  ప్రశ్నలడిగి, వాళ్ళు అరుచుకుంటూ, వాగ్వివాదాలు చేసుకూంటూంటే వినోదాలు చూస్తున్నారు టీవీ యాంకర్లు. అదెంతో  ఇష్టంగా కళ్ళప్పగించి చూస్తూంది భార్యామణి.

ఎక్కడైనా  ఎడ్వర్ టైజు మెంట్లు వస్తే పక్క ఛానెల్  మార్చి మరీ చూసేస్తూందావిడ.

“అవునూ , ఇక్కడ మనకి పగలు  టైములో లైవ్  వార్తలు అంటే అక్కడ రాత్రి పూట. లెక్కింపు అయ్యిపోయినట్లుందిగా, పేపర్ చూసుకోవచ్చుగా ఫలితాల కోసం ”  అన్నాడు సుందరం.

“ఉష్… అబ్బబ్బ మీకన్నీ సందేహాలే. పేపర్లో చదివితే మజా ఏముంది? చక్కగా ఇలా వీళ్ళ కీచులాటలతో ప్రతి స్టెప్పు చూస్తే మజా కానీ. ఇవేమైనా మాములు ఎన్నికల్లా? తల రాతలండీ. రెండు రాష్ట్రాలకు తల రాతలు. పొద్దుట్నించీ అక్కడ  జరిగిన వన్నీ రాత్రికి  ఇతర దేశాల్లో ఉండే మన లాంటి  వాళ్ల కోసం తిరిగి ప్రసారం చేస్తున్నారండీ. అయినా కాస్సేపట్లో తెల్లారిపోతుంది, మళ్లీ ఎన్నికల లెక్కింపు ఉంది. అయినా మీకివన్నీ పట్టవుగా. అయ్యో.. మీతో మాట్లాడుతూ విననేలేదు. మధ్యలో ఏం అయిపోయిందో  ఏవిటో…”అంది అటే దీక్షగా చూస్తూ.

చెమట్లు తుడుచుకూంటూ, ఉత్కంఠగా ఓట్ల ఫలితాలు వినేస్తున్న భార్యా మణికి ఒక టవల్ తీసుకొచ్చి ఇచ్చి ముందు గదిలోకి కదిలేడు వంట ప్రయత్నం ఏదైనా చేద్దామని.

…………….

http://www.andhraprabha.com/columns/a-column-by-kgeetha-maadavi/17305.html

Published: 14 May 2014in AndhraPrabha.com

This entry was posted in అనగనగా అమెరికా(ఆంధ్ర ప్రభ కాలం) and tagged . Bookmark the permalink.

వ్యాఖ్యానించండి