ద్రవభాష

అఆలు (అనుభూతులు-ఆలోచనలు)

http://kinige.com/kbook.php?id=8423
“ద్రవభాష” – పునర్ముద్రణ ఇప్పటికి సాకారం అయింది. 2001 లో వచ్చిన నా ఈ మొదటి కవితా సంపుటి 500 కాపీలు మొదటి నెలలోనే అయిపోయాయి.
అప్పటి ముద్రణలో వాడిన లిపిలో మళ్లీ వెంటనే ప్రచురణ చేపట్టడానికి వీలు కాలేదు.
అప్పటి నుంచి ప్రతి ఏడాదీ సంకల్పానికి వాయిదా పడుతూనే ఉంది. మళ్లీ టైపు, మళ్లీ ప్రూఫులు దిద్దే శ్రద్ధ, తీరిక చిక్కక, అనేకానేక ఈతి బాధల నడుమ పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి.
ఏదీ వాయిదా వెయ్యని నేను ఇదొక్కటీ ఎందుకు దాట వేసానో !!!

పుస్తకం ఎక్కడైనా దొరుకుతుందా అని ఇన్నాళ్లుగా, ఇన్నేళ్లుగా అడిగేవారికి- ఇదుగోనండీ- “ద్రవభాష” ఇప్పుడు కినిగె లో ఈ -పుస్తకంగా ఎప్పటికీ దొరుకుతుంది.
http://kinige.com/kbook.php?id=8423

అసలు టపాను చూడండి

ప్రకటనలు
Posted in కవితలు | వ్యాఖ్యానించండి

మా నారింజ చెట్టు

orange-tree

మా నారింజ చెట్టు

మా పెరటి నారింజచెట్టు తల్లయ్యింది

వందల అందాల నారింజ పళ్లతో

పరిపూర్ణ మాతృత్వాన్ని

పొదువుకున్న కల్పవల్లి

ఉదయారుణ కిరణాల్ని పిల్లలుగా కన్నట్లు

నిలువెల్లా అందమైన మేని ఛాయ

ఆకాశం ఇంద్ర ధనుస్సుని

విక్షేపించి బహూకరించినప్పుడు

రంగులన్నీ కూడబలుక్కుని

నారింజ రంగు గా మారినట్లు

మా పెరటి వాకిలంతా

గుండ్రని నక్షత్రాల గొడుగు పట్టిన

బంగారు తల్లి

నిన్నా మొన్నటి వరకు ఖాళీ కొమ్మలతో

పిల్లల్నీ, నన్నూ నిశ్శబ్దంగా గమనించేది

మారాం చేసే పసి కూనలు మైమరిచేలా

అమ్మ మనసు అర్థం చేసుకున్నట్లు

తన కొమ్మల మీద ఊయలలూపేది

ఆర్నెల్ల కిందట తొలి పువ్వు పూసింది

ఒక అందమైన ఉదయం

అడిగిన ప్రశ్నలన్నిటికీ

ఆహ్లాదంగా తలూపింది

అంతలోనే ఎదిగిన పిల్లల తల్లయ్యింది

మొన్న మొన్నటి వరకు

పచ్చని ఆకుల చాటున

ఎక్కడున్నాయో తెలియని

పిందెల బుడుతలివి

మొన్నా అటు మొన్న వరకు

సువాసన ధవళ పుష్పాలివి

ఎంతలో ఆర్తిగా అమ్మ చెట్టుని అల్లుకున్నాయి!

ఇప్పుడు ఎప్పుడూ

చిరుగాలికి బరువుగా కొమ్మలనూపుతూ

నారింజ పళ్లేసుకుని నవ్వుతుంది

గుంభనంగా మోయాల్సిన

జీవిత భారాల్ని గుర్తు చేస్తూ

గోడకి ఒరుసుకుని విస్తరించి

సఫల గాథల్ని వినిపిస్తుంది

అంతకు ముందంతా

చెట్టు కి గొప్పు తవ్వుతూ

ప్రతీ రోజూ నీళ్లు పెడ్తూ

ఆకులలములు ఏరి పారవేస్తూ

చెట్టు చుట్టూ అనుదినమూ

తిరుగుతూ తోటమాలినయ్యాను

పూత పరిమళం సోకగానే

చెట్టు చేతుల్ని తాకీ

హఠాత్ గాలికి పూత రాలిపడ్డప్పుడు

దిగులు చెట్టుని

అధైర్యపడొద్దని

వెన్ను రాసి ఓదార్చి

పెరిగే పిందెల చిర్నవ్వుల్ని

కలిసి తోడుగా పంచుకునీ

పళ్ల బరువు కొమ్మలకి

అమ్మ చేతులే అభయంగా

దాటు కర్రల్ని ధీమాగా నిలబెట్టీ

నారింజచెట్టుకి

ఇప్పుడు నేనే తల్లయ్యాను

……….

ఆటా సావెనీర్-2014

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

వీడ్కోలు విమానం

vimanam

వీడ్కోలు విమానం
బయటంతా మబ్బు ముసురుకుంది
నా మనస్సులాగే-
ఈ సరికి నువ్వెక్కిన విమానం
ఈ మబ్బుల్ని దాటే ఉంటుంది
అంత సులభంగా నువ్వు దాటగలవని తెలీదు నాకు
రెండు జీవితాలకి
రెండు జీవనాలకి
అలవాటు పడాల్సిన దు:ఖం
అద్దాల్ని జారుతోంది
నీ విమానం కిటికీ
చెమ్మగిల్లిన దృశ్యంలో
వేల ముక్కలై పగిలిన
నా వీడ్కోలు హృదయం
ఎలా భరిస్తూ వెనక్కి జేరబడ్డావో గానీ-
నిన్ను వీడ్కోలు విమానం ఎక్కించిన చివరి నిమిషంలో
నీ కనుకొలుకుల్లో విత్తనాలై మొలిచిన దు:ఖం
నా గొంతులో వృక్షమై మోయలేకున్నాను
నువ్వొచ్చిన ప్రతీసారీ విడవాల్సిన రోదన సత్యం
నువ్వెళ్లిన ప్రతీసారీ మళ్లీ వస్తావన్న భరోసా అసత్యం
మబ్బు కాస్త కాస్త తొలగింది
బాధ అంతకంతకూ ముసురుతూంది
భూమధ్య రేఖ చుట్టూ
పరిభ్రమిస్తూన్న జ్ఞాపకాలు
వాకిట్లో కిరణాలై ప్రసరిస్తూన్నాయి
నీ విమానం ప్రవేశించిన వెలుగురేఖలనుకుంటా-
దు:ఖం వేల చేతుల్తో
హృదయాన్ని నిద్దట్లోనూ జలదరింపజేస్తూంది
నీ విమానపు కుదుపులనుకుంటా-
రెండు జీవితాల
రెండు జీవనాల
మధ్య కవిత్వం ఒక్కటే
నిన్నూ నన్నూ కలుపుతూ-
దు:ఖాలకు, రోదనలకు
ఉదయాలకు, సాయంత్రాలకు
స్వాగతాలకు, వీడ్కోళ్లకు
అతీతంగా-
———

కౌముది వెబ్ పత్రిక, డిసెంబరు-2015

http://www.koumudi.net/Monthly/2015/december/dec_2015_kavitha_koumudi.pdf

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

కొత్త కవాతు

కొత్త కవాతు

ఒక రాత్రి జీవితాన్ని చీకటిమయం చెయ్యగలదా!?

ఒక తప్పు దిద్దుకోలేని గతమై వేధించగలదా!

ఒక అరక్షణం

నాది కాని ఒక క్షణం

నా ప్రపంచాన్ని దు:ఖమయం చెయ్యగలదా!?

లేదు-

లేదు-

తెలిసో

తెలీకో

వెంటబడ్డ దుస్సప్నం నించి మస్తిష్కం మేల్కోలేదా?!

కాదు-

కాదు-

నిన్నా మొన్నటి వరకు నా జీవితాన్ని సుసంపన్నం చేసిన

నా ఆశయాలెన్నో-

లక్ష్యాలెన్నో-

ఒక్క సంఘటనతో మాయమవుతాయా?!

కణాలు కల్లోలమైనంత మాత్రాన

మనో నేత్రాలు మూతబడతాయా!?

ఎన్నెన్ని సుడిగుండాలు!

ఎన్నెన్ని సుళ్లు తిరిగే ఆలోచనలు!!

కారణాంతరాలు వెతికి

కలలు చేజార్చుకునే అవివేకంలో

తల దించుకున్న

ప్రతి నిమిషం లో పామై కాటేసే అపరిపక్వతలో

లేదు- కాదు-

అయినా నా పిచ్చి గానీ

అసలెన్ని లేవు ప్రపంచంలో?!

ఒక జీవిత కాలాన్ని ఆకాశమై దర్శించగలిగినవెన్ని లేవు?!

అయినా నా పిచ్చి గానీ

ఎన్నాళ్లు బంక మట్టి లోకి

ఆలోచనల వేళ్లు చాపుక్కూర్చుంటాం ఎవరైనా?!

ఎన్నాళ్లు వరద బురద నీటితో

దు:ఖపు గొంతు తడుపుకుంటాం?!

మిత్రులారా!

నేనిక్కడ తూరుపు తొలి వెలుగులో

నిలబడి ఇప్పుడే

జన్మించిన ఒక కొత్త

శరీరమై చెబ్తున్నాను వినండి

కాస్సేపు ఉదయ కిరణమై జాలువారేందుకు

తళుకు మెరుపులై

నాతో రండి

మీ భుజాలపై జీవితమంత భారాన్ని మోసే మీకు

ఒక చిరు దీపాన్ని మొయ్యలేనితనముంటుందనుకోను

నాతో కాస్సేపు మనసు విప్పి మాట్లాడేందుకు

మీకభ్యంతరముంటుందనుకోను

ఒక్క మాట చెప్పాలనుంది మనసారా!

ఒక్క పిలుపునివ్వాలనుంది వింటారా?!

జీవితపు అంచు మీద పెళ్లున బ్రద్దలయ్యే

దు:ఖాశ్రువులతో మరో గొంతు తడుపుదాం రండి

నవ్వుతూ తుళ్లుతూ తిరిగే సీతాకోకచిలుకలమై

రెపరెపలాడే మరిన్ని జీవితపు రెక్కల మీద కొత్త రంగులలముదాం రండి

ఏ కొసనైతే జీవితం సవాలు విసురుతుందో

అదే చివర నిబ్బరమై నిలబడే సరికొత్త సైనికులమై కవాతు చేద్దాం రండి

ఎయిడ్స్ లేని ప్రపంచాన్ని పునర్నిర్మిద్దాం రండి

……………..

For AIDS Awareness Program, Hyderabad-2013

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

గ్రాండ్ కెన్యన్

grand-canyon

గ్రాండ్ కెన్యన్

జీవితాన్ని పరిపక్వం చేసే ఒక్క దృశ్యం
కళ్ల నింపుకోవాలంటే
లక్షల సంవత్సరాలు
వెనక్కి పరుగెత్తాలి
గ్రాండ్ కెన్యన్ ని గుండె నింపుకోవాలంటే
వేల స్వప్నాల్ని
ఒడిసిపట్టుకోవాలి
ఆకాశం మీంచి లోయ లోకి
ఒదిగిన ప్రతి మలుపులోనూ
మాయమైన మహోధృత
నదీ ప్రవాహాలు
ప్రత్యక్షమయ్యే
జ్ఞాపకాల ఎర్రని విభూది రేఖల జాడలు-
ఒక్కొక్క రేఖ మీద చెవొగ్గినపుడు

మస్తిష్కం లోంచి
నాడుల్లో ప్రవహించే
వేల సంవత్సరాల గాథలు –
గ్రాండ్ కెన్యన్
నీ మహాద్భుత
సౌందర్యం
హఠాత్తున కనిపించిన
తొలి క్షణం
రెక్కలు లేకున్నా
విహంగపు శరీరం కాకున్నా
అమాంతంగా
లోయ లోకి
దుమకాలన్న
ఆనందాదోళన
హృదయమంతా-
ఒకటా రెండా!
ఎన్నెన్ని మలుపులు!!
భూమి పై నున్న
జీవితాల్లో ఉన్నన్ని
మలుపులూ-
నీ శిరస్సు నుంచి
పాదాల వరకూ
ఎటు ప్రయాణించాలో

తెలీని తత్తరపాటు
ఎక్కడో దిగువన
కొలరెడో నది
అలల నురుగుతో
పారాణి పూస్తున్న గగుర్పాటు
నీ శిఖరాగ్రాల మీద నుంచుని
దిగంతాన్ని చూస్తున్నప్పుడు
మనసుకి స్థల కాలాలు లేవు
స్పర్శా ఉనికీ లేవు
ఉన్నదల్లా ఒక్కటే
నీ అసమాన గాంభీర్యం ముందు
స్థాణువై మోకరిల్లే
చెక్కిలి పై వెచ్చగా జాలువారే
కన్నీటి ప్రవాహం-
హృదయం నుంచి దిగంతాలకి
పర్చుకునే
అనుభూతి ధూపం-
———

తెలుగు వెలుగు – బాటా ఉగాది సావెనీర్- 2014

 

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

ఎల్లోస్టోన్

yellowstone

ఎల్లోస్టోన్!

నువ్వొక సప్త వర్ణ సంగీతివి

అయినా నిన్నెందుకు ఎల్లోస్టోన్ అని మాత్రమే అన్నారో మరి!!

నీ శరీరమ్మీద ఎక్కడ స్పృశించినా

భగ భగా అంతరాంతరాల్లో మండి

గప్పున ఎగిసే పొగల సెగలు

బుగా బుగా ఉడికే మట్టి బుడగలు

ఎటు చూసినా

యుగ యుగాలుగా నీలో దాగి ఉన్న ఆక్రోశం

స్పష్టంగా నీటి బుగ్గలై ఉబికి విస్తరిస్తున్న

సప్త వర్ణ దు:ఖావేశం

ఎటు చూసినా

భూమ్యంతరాళాన్నించి వేల నాలుకల

వాయు సర్పాలు ఒక్క సారి ఆకాశంలోకి దూసుకొచ్చినట్లు

భీకర శబ్దాల దుర్వాసనల గగుర్పొడుపు గంధక జలాలు

అయినా

ఎల్లో స్టోన్!

నిన్ను చూస్తే ఆవేశంగా హత్తుకోవాలనిపిస్తుంది

రెండు చేతుల్లో దాచలేని

నీ మార్మిక సౌందర్యాన్ని

కళ్లకి వేళ్లాడదీసుకోవడం తప్ప

ఉవ్వెత్తున ఎగిసే నీ వెచ్చ వెచ్చని బుగ్గల్ని

తడమాలని ఉన్నా

అమాంతం దుమక లేని

నీ రహస్యాంతర గొంతుని

చిత్రపటాలలో బందీ చేయడం తప్ప

ఏం చేయగలను?

ఒక వైపు

భీకర అలల మధ్య ఊగిసలాడించిన

నీ హిమ శీతల సరస్సు

శరీరాన్ని వణికించిన జ్ఞాపకం

అంతలోనే

ఆకాశపుటంచుల మధ్యనించి

హఠాత్తుగా ప్రత్యక్షమయ్యే

శర వేగపు జలపాతాల జ్ఞాపకం

ఎట్నించెటు తిరిగినా

లయ తప్పే గుండె చప్పుడు తప్ప

తల్చుకున్న క్షణం

గగుర్పొడిచే వింతమడుగుల

మధ్య వివశమయ్యే హృదయం తప్ప

ఎల్లోస్టోన్! ఎల్లోస్టోన్!

నన్నెందుకు మాయని మచ్చల దోమై కుట్టి బాధించావ్?

నీ చెంతకు పసిపాపనై వచ్చిన నన్ను జ్వరమై పీడీంచావ్?

అయినా నువ్వంటే కోపం లేదు నాకు

నువ్వంటే ద్వేషం లేదు నాకు

ఎందుకంటే

నువ్వూ నాలాగే

కాదు కాదు నేనూ నీలాగే

ఏదీ దాచుకోకుండా

——-

తెలుగు వెలుగు – బాటా ఉగాది సావెనీర్- 2015

————–

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

కనుపాప సవ్వడి

కనుపాప సవ్వడి

ఆకాశం వాన పుష్పాల సంబరాల్ని రాల్చుతూంది

అక్కడెక్కడో రెక్కలు సాచిన విహంగమ్మీద

నీ పాదాలు మోపిన సవ్వడి తెలిసే కాబోలు

చెట్లు చిగురింతల పులకరింతల్తో

మబ్బుల లేలేత కాంతి పుంజాల్ని వెదజల్లుతున్నాయి

ఆకుల సందుల్లోంచి సంభ్రమాశ్చర్యాల ఆకాశాన్ని

పరిచయం చెయ్యడానికి కాబోలు

ఇన్నాళ్ల దిగులు గుండె

ఇంకెప్పుడా అని  చేతులు సాచి ప్రార్థిస్తూంది

ఒక్క క్షణం  నిన్ను చూసి

దాటి వెళ్లే కనుపాప సవ్వడి చాటు

కన్నీరే గానీ మరేమీ కాదు

ఒక్క సారి దూరాంతరాల్లోంచి

దృష్టి సారించగలిగే

చిరు కోరికే గానీ మరేమీ కాదు

ఆకాశానివి నువ్వు

ధైర్యంగా తలెత్తి ఎలా చూడగలను నిన్ను?

కనిపించేవల్లా నీ పాదాలే

అడుగు మోపుతూ, ఆగుతూ

హృదయాంతరాళాన్ని

తలక్రిందులు చేస్తున్న నీ పాదాల సవ్వడే

ఎటు వత్తిగిలినా

స్పర్శేంద్రియాలన్నీ చెవులు రిక్కించుకుని

ఎదురు చూస్తున్న సవ్వడే

ఏ మూలనున్నావో

ఎక్కడ బయలుదేరుతావో ప్రపంచానికి తెలుసు

తడబాటు గుండెకెలా తెల్సు?

క్రీ గంట వాకిటనల్లుకున్న ఎదురు చూపు

ఒక్కటే పనిగా ద్వారాన్నంటి పెట్టుకుని ఉంది

ఏమీ తోచని బెంగటిల్లిన

ఒక బాధాన్విత గుండె

అవిశ్రాంతంగా ఆలోచనల దారల్ని

అటూ ఇటూ అల్లుతూ ఉంది

అయినా-

ఏదో మూల పులకరింపజేస్తున్న గొప్ప జ్ఞాపకం-

అణువణువునా విరబూస్తున్న ఆశాన్విత క్షణం-

ఒక రోజు-

వేల రెక్కలు సాచుకుని

ఈ వాకిట వాలే విహంగం

నీ పాద ముద్రలు రాల్చిన కాసింత ధూళి

నా జీవిత కాలపు స్వప్నాల మీద

జల్లి నన్ను నిద్రలేవదీస్తుంది

అవిశ్రాంతంగా ఆకాశం నించి

భూమ్మీద వరకూ నే పరుచుకున్న

స్వాగతపు కలల్ని సాకరం చేసి

నన్ను ఆలింగనం చేసుకుంటుంది

—–

వీక్షణం సాహితీ మిత్రుల రచనా సంకలనం -2016

——

Posted in కవితలు | వ్యాఖ్యానించండి