ఔర్ చాలీస్ బాకీహై-

ఇక ఆ తలుపులు ఎంత బాదినా తెరుచుకోవు-
తలపులు మాత్రం ఇటువైపు రోదిస్తూ
ఇక ఆ ఫోను మోగదు-
పాతవేవో సంభాషణలు చెవుల మోగుతూ
ఆ వేళ్ల నించి మెసేజీ రాదు-
దు:ఖం ఇంకిపోయిన బాధాత్మకవేర్లు
గుండెలోతుల్లో పాతుకుపోతూ
ఔర్ చాలీస్ బాకీహై-
ఔర్ చాలీస్ బాకీహై-
ఇంకా వినిపిస్తూనే ఉంది..
అరవయ్యేళ్ళకే తనువు
పరిమితం కాదంటూ
అనేవారుగా
ఔర్ చాలీస్ బాకీహై-
నిజమనిపించేంత
ఆశాపాశం-
తల్చుకున్నప్పుడల్లా
ఎంత బావుండేదీ-
ఎప్పుడో ఒకప్పుడు
ఒక్కసారే చేరాలనుకున్న
వృద్ధాశ్రమం-
ఎప్పుడో ఒకప్పుడు
భూగోళానికివతల
కలిసి చెప్పుకోవాలనుకున్న
కబుర్లు-
తొందరేముంది
ఔర్ చాలీస్ బాకీహై-
ఎప్పుడో ఒకప్పటికి
మిగలని భవిష్యత్తు
నిర్దాక్షిణ్యంగా
క్రూరంగా
అన్యాయంగా
చిత్తు చిత్తుగా
చితిలో బూడిదవుతూ-
అవునూ..
ఇప్పుడు మీరు అబద్ధం చేసిన
ఔర్ చాలీస్ కా బాకీ కహా హై-
మీరు విగతజీవిగా
భూగోళానికవతల
గాజుపెట్టెలో దీర్ఘంగా నిద్రిస్తుంటే
మేం ఇక్కడ చుట్టూ
గాజులేని పెట్టెల్లో
అవిశ్రాంతంగా శ్వాసిస్తున్నాం
మీరు అక్కడ
కణకణ కాలే కట్టెల్లో
కపాలమోక్షం చెందుతుంటే
మీరు లేని ప్రపంచంలో
మోక్షమెప్పుడా
అని ఎదురుచూస్తూ
బతుకునీడుస్తున్నాం
మీ కానుకగా
అందుకున్న
దేవగన్నేరులేవో
మీరిక లేరని తెలిసీ
విరబూస్తున్నాయి
మీరు
పంచిన
అపురూప ఫలాలేవో
మీరిక ఆస్వాదించరని తెలిసీ
నోరూరిస్తున్నాయి
మీరు
వెలిగించమన్న
వేల ఒత్తుల
కార్తీక పౌర్ణమి చంద్రుడు
మీ దాకా చేరవని తెలిసీ
వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాడు
మీకిష్టమైన
కవితలు
మీరిక అందుకోరని తెలిసీ
అక్షరాలుగా మారి
జీవితాంతం
ఎదురుచూస్తూనే ఉన్నాయి
ఔర్ చాలీస్ బాకీహై-
జీవించిన క్షణాల
చెదరని జ్ఞాపకాల
తడి ఆరని కన్నీళ్ల
సాక్ష్యంగా-
బాధాత్మక గుండెని
కుదుపుతూ-
రగులుతూ-
ఓ అబద్ధపు వాక్యం
పొద్దు పొడిచిన దగ్గరనించి
పొద్దు వాలే వరకూ
ఔర్ చాలీస్ బాకీహై-
—-
(మోహన రెడ్డి గారి స్మృతిలో-)

*****

(“నెచ్చెలి” అంతర్జాల వనితా పత్రిక- జులై, 2023 ప్రచురణ)

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

గతపు పెట్టె

గతపు పెట్టెని తెరవనే కూడదు
బిలబిలా ఎగిరే తూనీగల్తో బాటూ
తోకలు విరగదీసి
తలకిందులుగా వేళ్ళాడదీసిన
ముళ్ళ తాళ్ళు కూడా ఉంటాయి
మిలమిలా మెరిసే నక్షత్రాలతో బాటూ
అగాధాంధకారంలోకి
విసిరేసే ఖగోళాంతరాలు కూడా ఉంటాయి
గలగలా పారే జలపాతాలతో బాటూ
కాళ్ళకి బరువై ముంచేసే
బండరాళ్ళు కూడా ఉంటాయి
సువాసనలు అలుముకున్న అడవుల్లో
వేటాడే క్రూరమృగాలు
పచ్చని పరిమళాల పూల పొదల్లోనే
బలంగా చుట్టుకున్న నాగుబాములు
ప్రశాంత తామర కొలనుల్లో
రహస్యంగా పొంచి ఉన్న మొసళ్ళు

గతం పెట్టెని తెరవనే కూడదు
కన్ను మూసి తెరిచే లోగా
నీలోంచి
నీలోకి
ప్రవహించే
అనుభూతుల
చాటు
అనుభవాలు
నిన్ను
సలసలా మరిగిస్తాయి

అయినా
జలజలా జారే కన్నీళ్ళతోనే
గాయాల్ని కడిగే
సంయమనం ఒక్కటి చాలు

గతం పెట్టెని మోసుకుని
నువ్వెన్ని ఊళ్ళు తిరిగినా
తటాలున ఒక వాన చినుకు
దూరాన ఒక్క మిణుగురు
చిటారున వీచే ఒక తెమ్మెరలతో
నీ తల మీద భారాన్ని దించి

తూనీగల్ని
నక్షత్రాల్ని
జలపాతాల్ని
దోసిట పట్టి తెచ్చి
పరిమళాల
వర్తమానాన్ని
బహూకరిస్తుంది!


(న్యూజెర్సీ తెలుగు కళా సమితి 40 ఏళ్ల ప్రత్యేక సంచిక “తెలుగుజ్యోతి” ప్రచురణ-)

(“నెచ్చెలి” అంతర్జాల వనితా పత్రిక- అక్టోబర్, 2023 ప్రచురణ)

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

వ్యక్తి-శక్తి

వ్యక్తిగా మొదలవ్వడం అంటే 

నీకు నువ్వే అంకురమవ్వడం 

నీ జీవితానికి నువ్వే బాధ్యతకావడం 

నిన్ను నువ్వే ప్రేమించుకోవడం 

ద్వేషించుకోవడం 

నీలోనువ్వే మాట్లాడుకోవడం 

పోట్లాడుకోవడం 

నీకు నువ్వుగా మిగలడం 

వ్యక్తిగా ఉన్నంతసేపు 

నీ పరిధి

నీ కనుచూపుమేర-

నీ దుఃఖోపశమనం 

నీ అరచేతికందినంతమేర-

నీ బాధల్ని 

నువ్వే తుడుచుకోవడం 

నీ బంధాల్ని 

నువ్వే పెంచుకోవడం 

నువ్వే తుంచుకోవడం 

***

సమిష్టిగా మొదలవ్వడం అంటే 

నీకు నువ్వే కొత్తగా పరిచయం కావడం 

సమిష్టిశక్తిగా మొదలవ్వడం అంటే 

నీ  ప్రపంచానికి 

దిశానిర్దేశం చెయ్యడం

సమిష్టిశక్తిగా ముందుకు వెళ్లడం అంటే 

నీతో బాటూ 

నమ్మిన కాళ్లకి తోడెళ్లడం  

నమ్ముకున్న కళ్లని తుడవడం 

నీతో బాటూ 

సమిష్టిగా సంతోషాల్ని పంచుకోవడం

సమస్తాన్నీ  ప్రేమించడం 

ఒక్కోసారి 

బంధాలు 

మోసుకెళ్లలేనివైనా 

గుండె కింద పదిల పరుచుకోగలిగినవి 

ఒక్కోసారి  

మాట విరుపుతో ఛెళ్ళున చరిచేవైనా 

స్ఫూర్తి ప్రదాయకాలై 

ముందుకు నడిపించేవి 

సమిష్టిగా ముందుకు నడవడం అంటే 

జీవితం తేజోమయం కావడం

జీవనం సఫలం కావడం 

***

వీక్షణంగా ముందుకు నడవడం అంటే 

సాహితీ లోకానికి  

ఒక గవాక్షమై  తెరుచుకోవడం 

ఒకే గూటి పక్షులమై 

అప్పటికప్పుడు రూపుదిద్దుకున్న 

అక్షరాలమై 

ఒక కవితాత్మక వాక్యమై

అఖండ ప్రచండమై 

రెక్క విప్పుకోవడం  

*****

(కాలిఫోర్నియాలో నెల నెలా జరుపుతూ, ఇప్పటివరకు 85 సమావేశాల నిర్వాహకురాలిగా “వీక్షణం” సప్తమ వార్షికోత్సవం సందర్భంగా రాసిన కవిత)

(“నెచ్చెలి” అంతర్జాలవనితాపత్రిక- అక్టోబరు , 2019 ప్రచురణ )

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

2019 ఉగాది  పండగ

ఉగాది పండగ నాడు

ఉదయానే నిద్ర లేచానా

పక్షుల కిలకిలా రావాలతో తెల్లారింది

ట్వీట్ ట్వీట్ కీచ్ కీచ్…….

అయ్యో అలెక్సా

బర్డ్ సౌండ్స్ అంటే

ట్వీట్ ట్వీట్ కీచ్ కీచ్…….

కాదమ్మా…

కమ్మని కోయిల కూత-

నీ దగ్గిర లేదంటావా?

“నా యూట్యూబ్ అకౌంట్ కి వెళ్లు”

ఈ డివైస్ లో యూట్యూబ్ సెటప్ లేదంటావా?

ఓహో! అది నువ్వు కాదు కదూ!

సర్లే-

ఇప్పుడు నిన్ను కాన్ ఫిగర్ చెయ్యలేను కానీ

“ఓకే, గూగుల్!

ప్లే కోయిల సౌండ్”

అయో…రామ!

కొయిలా బేర్ కాదమ్మా

కోయిల… కోకిల…కోకిలమ్మ…

మావి చిగుళ్లు మెత్తగా

నెమరువేస్తూ

అల చిటారు కొమ్మన

కులాసాగా కూచుని

ఉగాది వచ్చిందని

నిద్ర లేపుతుందే

మా పెరటి కోకిలమ్మ-

ఆ…ఓకే గూగుల్!

“కుకూ తియ్యని పాట”

“కుకూ  పాటా”

“కుకూ సౌండ్”

ఏదోటి తగలెట్టు…

హమ్మయ్య-

యూట్యూబ్ పుణ్యమా అని

“కుకూ” సౌండ్తో తెల్లారే భాగ్యం కలిగింది

సమయానికి ఎవరో మహానుభావుడు

అప్ లోడ్ చేసి పెట్టేడు

హేయ్ సిరి!

పిల్లలని ఒక్కొక్కళ్ళని కాల్ చెయ్యి-

ఆ… ఏవర్రా!

తల స్నానాలు చేసేరా?

రాక రాక వీకెండ్ వచ్చినట్టు

ఆ మొద్దు నిద్రలేవిటి?

రాక రాక పండగ – వీకెండ్ వచ్చింది

అన్నట్లు ఏవండోయ్! ఇండియన్ స్టోర్ లో

సరుకులన్నీ దొరికేయా

కిందతేడాది కొబ్బరికాయ

పులుపు లేని హైబ్రిడ్ మామిడి కాయ

చలికి ఓ పట్టాన ముగ్గని అరటి పళ్లు

ఆర్గానిక్ పుట్నాల పప్పు

అట్ట కట్టిన

పురానా జమానా నాటి

చింత పండు

బ్రాన్ డెడ్ బెల్లం

అయొడైడ్ సాల్టు

థాయ్ మిరప కాయా

ఆ….

ఆ తెలుగు స్టోర్ వాళ్లు

ప్రసాదంగా ఇచ్చిన

రెండు ఎండిపోయిన 

వేప పువ్వు రేకులు

ఊ…ఇంకేం కావాలీ?

అన్నీ ఉన్నట్లేనా?

ఓక్, గూగుల్!

“టెల్ మీ హౌ టు డూ ఉగాది పచ్చడి”

అదేలేమ్మా తల్లీ!

యూట్యూబు లోంచి

“ఉగాది పచ్చడి తయారీ”

హయ్యో రాత!

ఇది మా ఇంటి పచ్చడి కాదే!!

చిన్నప్పుడు

నాన్నని ఇంటిచుట్టూ 

పరుగులెత్తించిన ఉగాది పచ్చడి

అమ్మ చేత్తో కలిపిన

ఉగాది పచ్చడి

అప్పుడు తినడానికి హడలు గొట్టించి

ఇప్పుడు కళ్లల్లో ఊరిస్తున్న

ఉగాది పచ్చడి

హేయ్ సిరి!

టీవీలో

ఇండియన్ ఛానెల్ నించి 

పంచాంగ శ్రవణం

వినిపించు

”అయ్యో ఎలక్షన్ గోల కాదమ్మా”

పంచాంగం…

పంచాంగం…

మా నిన్న సాయంత్రం

ఇండియాలో ప్రసారం

అయ్యింది చూడూ!

పోన్లే ఇక చాలు

అలెక్సా!

ఒక పాట పాడు

బాగా నిద్రొస్తోంది

అదేలే అమెజాన్ మ్యూజిక్కో

ఐట్యూన్సో

యూట్యూబో

సావనో

నిద్దట్లోనైనా

ఉగాదిని ఊహించుకుంటాను

కళ్లల్లోంచి జారిపోయి

కలల్లో తడై మిగిలిపోయిన

ఉగాదిని తల్చుకుంటాను

*****

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

కొత్త జీవితం

కొత్త జీవితం కొత్త కలల్నించి పుడుతుంది

కొత్త కలలు కొత్త ఆలోచనలనించి పుడతాయి

ఆకాశం నించి తెరచాప వేళ్లాడినట్టు 

అటక మీద జాబిల్లి దాక్కున్నట్టు 

అల్లిబిల్లిగా హత్తుకున్నవేవేవో కలలు

దూరాల్ని దారాలుగా మార్చేవేవేవో ఆలోచనలు

ఉన్నదొక్కటే జీవితం

పది జీవితాల పెట్టు

పడే ప్రతీ సారీ

వెయ్యేనుగుల బలంతో లేవనిచ్చే

ప్రతీ కొత్త ఆలోచన వెనకా

సాధించనిదేదో 

కలల్లోనూ నూగై గుచ్చుకునే పట్టుదలేదో

రప్పున రగిలి దహించే కసి మంటేదో

అవమానపు గతమేదో

కన్నీటి ప్రాయాల్ని

కళ్ల ముందు నుంచి 

చెరిపివేయనివ్వని కొరివేదో 

‘కొత్త ‘ జీవితానికి ప్రాణ ప్రతిష్ట చేస్తుంది

కథ ఎక్కడ మొదలైనా

చివరికి మిగిలే అందమైన జ్ఞాపకమేదో

చుక్కానై నడిపించే వేళ

చెదరని చిరునవ్వు  

హృదయాన పాతుకున్న

బాధల ఊట బావి నించే

పచ్చని మొక్కై

మొలకెత్తకేం చేస్తుంది!

ఎక్కడున్నా 

ప్రేమించే అదృశ్య హృదయమేదో

వెన్ను నిమిరే వేళ

విజయాల

హర్షాతిరేకపు జల్లు 

కురవకేం చేస్తుంది!!

*****

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

వెనుచూడని విహంగం

పెనవేసుకున్న బంధం

ఒక్కటి

తంత్రి తెగిపడ్డట్టు

రాలిపోయింది

నిశ్శబ్దంగా 

కాలంలో

ప్రవహిస్తున్న

నును వెచ్చని నీరు-

నన్ను నేను ఓదార్చుకోలేక

విహ్వలంగా 

వేళ్ల చివర వేళ్లాడే

ద్రవ హృదయం

చాటున 

కరడు కట్టి

మూలిగే వేదన

ఎలా తీరుతుంది?

ఎన్ని రాత్రుళ్లు

రోదించినా 

వెనుచూడని

విహంగంలా

వెళ్ళిపోయిన

ప్రాణం

దాపున 

జ్ఞాపకాలు

వర్తమానమై 

మిగిలిన 

బహుమానం-

పొద్దు గుంకినప్పటి

వెలుతురు కిరణాల్లా  

నిశ్శబ్ద సహజంగా 

అందరూ

ఒక్కొక్కరుగా

తెలీకుండానే

రాలిపోవలసిందేనని

తెలిసినా

కరడు కట్టని

జీవితమే

గొప్ప అనుభూతిగా

పెనవేసుకున్న స్నేహం

ఏ అర్థరాత్రో 

కుదిపినప్పుడు

తనని తను 

ఓదార్చుకోలేక

నిస్సహాయంగా

కళ్లని వేళ్లాడే

ద్రవ హృదయం

ఎప్పటికి తెప్పరిల్లుతుంది?

*****

(అత్యంత ఆత్మీయులు పుట్ల హేమలత గార్కి నివాళిగా-) 


(విహంగ, మార్చి 2019 ప్రచురణ)

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

ఊపిరాడనివ్వడం లేదు

జార్జ్ ఫ్లాయిడ్! 

నీ చివరి శ్వాస

ఊపిరాడనివ్వడం లేదు

మొన్నటిదాకా

నువెవ్వరివో-

ఇవేళ మాత్రం నువ్వు 

అణిగణిగి 

పెల్లుబికిన ప్రజాలావావి  

పెళపెళమని

విరుచుకుపడ్డ జనాకాశానివి  

పీకె మీద కాలు

నీ గొంతులో గుచ్చుకుంటున్న దృశ్యం  

అనామకంగా ఇంకనివ్వకుండా     

చరిత్రనేల విచ్చిన 

మహోగ్ర మానవగర్జనవి   

నినాదాలు మండేనాలుకలై ఎగిసిన  

మానుష బడబానలానివి   

నువ్విపుడు

ఒక్కో కన్నీటి చుక్కా పోగై 

జాత్యహంకారాన్ని తోసుకువస్తున్న 

ప్రభం”జన” చెలియలికట్టవి  

జార్జ్ ఫ్లాయిడ్! 

నీ చివరి శ్వాస

ప్రళయంలా 

ఎవరికీ ఊపిరాడనివ్వడం లేదు

నీ మరణ పోరాటమ్మీద 

కొరడా ఝళిపిస్తున్న 

శ్వేత సౌధంతో సహా! 

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

బంగారమంటి

ష్ …. పాపా

నాన్నని డిస్టర్బ్ చెయ్యకు

పని చేసుకొనీ

అర్థరాత్రి వరకూ మీటింగులనీ

చాటింగులనీ

పాపం ఇంటి నించే

మొత్తం పనంతా

భుజాన మోస్తున్న బ్రహ్మాండుడు

పొద్దుటే కప్పుడు కాఫీ

ఏదో ఇంత టిఫిను 

లంచ్ టైముకి

కాస్త అన్నం 

మధ్య ఎప్పుడైనా టీనో, బిస్కట్టో

రాత్రికి ఓ చిన్న చపాతీ

ఏదో ఓ కూరో, పప్పో

పాపం సింపుల్ జీవితం

అట్టే ఆదరాబాదరా లేని జీవితం

లాక్ డవున్ లోనూ

ఇవన్నీ ఎలా వస్తున్నాయో

ఎట్నుంచి ఏది మారినా

ఇల్లు ఎలా గడుస్తుందో

తెలియక్కరలేని అదృష్టవంతుడు

పాపా!

నాన్నని డిస్టర్బ్ చెయ్యకు

పాపం ఉన్నవి రెండే చేతులు

ఎటూ తిప్పలేని తల ఒకటి

ఉదయమధ్యాహ్నసాయంత్రాలు

ఒక్కలాగే చెమటోడ్చే

కంప్యూటరు కార్మికుడు-

పాపా!

అమ్మని డిస్టర్బ్ చేసినా పర్లేదు

హెడ్ ఫోన్స్ లో

మీటింగు నడుస్తున్నా

చంటిదాని

ముడ్డి తుడవగలిగిన నేర్పరి 

పోపుల డబ్బా పక్కనే

లాప్ టాప్  పెట్టుకుని

ఫ్రిజ్ తలుపు మీద

టైం టేబుల్ రాసుకుని

ఇంటిల్లిపాదీ

తిన్నారో ఉన్నారో

పది చేతులతో

పట్టి చూసుకునే

మల్టీ టాలెంటెడ్ మనిషి

పని మనిషీ

పరుగెత్తే మనిషీ

తనే అయ్యి

సమయానికి అన్నీ అమర్చి పెట్టే

సకల కళామ తల్లి-

అగ్రరాజ్యమైనా

డిపెండెంటు వీసాలో

సగ జీవితం మగ్గిన అమ్మకి

గృహ నిర్బంధం

కొత్తేవీ కాదు కదా

నాలుగ్గోడల మధ్య

తనదైన ప్రపంచాన్ని

నిర్మించుకోగల ధీశాలైనా

కాదన్న ప్రపంచాన్ని

ఔననిపించగలిగే ధీమతైనా

“బంగారమంటి పెళ్ళాం” అన్న

నాన్న ధీమా మాట

ఒక్కసారి వినబడితే చాలు

అతని భుజాన బరువునీ

తన భుజానేసుకుని

ఇంటినేం ఖర్మ

భువనాన్నే  మోస్తుంది

(“నెచ్చెలి” అంతర్జాల వనితా పత్రిక- మే, 2020 ప్రచురణ)

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

అసింట

అయ్యగోరికీ దణ్ణంబెట్టు

అమ్మగోరికీ దణ్ణవెట్టని

డూ డూ బసవన్న బతుకేనెహె 

అయ్యగోరు పెరట్లోకి పిలిత్తే  

అదురుస్టవనుకుని లగెత్తేవు

గొబ్బిరి గాయలు దించనాకెహె

అమ్మగోరు సెర్లో పూలు తెంపుకు రమ్మంటే

గుమ్మం తొక్కొచ్చకునేవు 

దేవుడు గూడా ఆళ్ల పార్టీయేనెహె

మటవేసుకుని మూలన 

కుయ్ కయ్ అనకండా కూకుని

పెసాదాన్ని మా సేతల్లోకి 

ఇసిరే సేతి కోరికలు 

మాత్తరవే తీరుత్తాడు

అమ్మాయిగోరు తొంగి తొంగి సూత్తంటే

బూలోకరంబ నీ మీద మనసుపడ్డాదనుకునేవు

అసింట మొకం ఎలా ఉంటాదో సూద్దావనెహె 

నీ తమ్ముళ్లు   

పుట్టంగానే ఆళ్ల పాలేర్లే 

నీ సెల్లెళ్లు 

ఎప్పుడూ “పాసిపని”పిల్లలే

ఉప్పుడు పెద్దాసిన్నా తేడా లేకండా 

అందరికీ అసింటంట

ఎవరింటోళ్లు ఆళ్లకే పనోళ్లూ పాలేర్లూనంట

సేతులు తోంకునేది

పొరబాట్న మనకి తగిలి కాదంట

మూతులకి గుడ్డలు

మన గాలి తగిలి కాదంట 

మరి మేవేం అన్నేయం సేసేవండీ- 

బాబ్బాబు 

దరమ పెబువులూ!

మీ అసింట మీకాడెట్టుకుని

మా పన్లు మాకిచ్చీయండి

ముట్టుకుంటే సావొచ్చీలోగా

మాడే కడుపుల సావొద్దు మాకు

Posted in కవితలు | వ్యాఖ్యానించండి

ఏడికి? – డా|| కె.గీత

1
ఏడికి బోతున్నవే?
బతుకుదెర్వుకి-
ఈడనె ఉంటె ఏమైతది?
బతుకు బుగ్గయితది-

2
యాడికి బోతున్నావు?
పొట్ట కూటికి-
ఈడేడనో నెతుక్కోరాదూ?
బతుకా ఇది-

3
ఎందాక?
అడగ్గూడదు-
ఊళ్లోనే సూసుకుంటేనో?
కూలి పనైనా లేందే-


1
ఎందాక?
ఏమో-

2
యాడికి?
ఊరికి-

3
ఏడికి?
బతకనీకి-


(“నెచ్చెలి” అంతర్జాల వనితా పత్రిక- జూన్, 2020 ప్రచురణ )

Posted in కవితలు | వ్యాఖ్యానించండి