ఔర్ చాలీస్ బాకీహై-

ఇక ఆ తలుపులు ఎంత బాదినా తెరుచుకోవు-
తలపులు మాత్రం ఇటువైపు రోదిస్తూ
ఇక ఆ ఫోను మోగదు-
పాతవేవో సంభాషణలు చెవుల మోగుతూ
ఆ వేళ్ల నించి మెసేజీ రాదు-
దు:ఖం ఇంకిపోయిన బాధాత్మకవేర్లు
గుండెలోతుల్లో పాతుకుపోతూ
ఔర్ చాలీస్ బాకీహై-
ఔర్ చాలీస్ బాకీహై-
ఇంకా వినిపిస్తూనే ఉంది..
అరవయ్యేళ్ళకే తనువు
పరిమితం కాదంటూ
అనేవారుగా
ఔర్ చాలీస్ బాకీహై-
నిజమనిపించేంత
ఆశాపాశం-
తల్చుకున్నప్పుడల్లా
ఎంత బావుండేదీ-
ఎప్పుడో ఒకప్పుడు
ఒక్కసారే చేరాలనుకున్న
వృద్ధాశ్రమం-
ఎప్పుడో ఒకప్పుడు
భూగోళానికివతల
కలిసి చెప్పుకోవాలనుకున్న
కబుర్లు-
తొందరేముంది
ఔర్ చాలీస్ బాకీహై-
ఎప్పుడో ఒకప్పటికి
మిగలని భవిష్యత్తు
నిర్దాక్షిణ్యంగా
క్రూరంగా
అన్యాయంగా
చిత్తు చిత్తుగా
చితిలో బూడిదవుతూ-
అవునూ..
ఇప్పుడు మీరు అబద్ధం చేసిన
ఔర్ చాలీస్ కా బాకీ కహా హై-
మీరు విగతజీవిగా
భూగోళానికవతల
గాజుపెట్టెలో దీర్ఘంగా నిద్రిస్తుంటే
మేం ఇక్కడ చుట్టూ
గాజులేని పెట్టెల్లో
అవిశ్రాంతంగా శ్వాసిస్తున్నాం
మీరు అక్కడ
కణకణ కాలే కట్టెల్లో
కపాలమోక్షం చెందుతుంటే
మీరు లేని ప్రపంచంలో
మోక్షమెప్పుడా
అని ఎదురుచూస్తూ
బతుకునీడుస్తున్నాం
మీ కానుకగా
అందుకున్న
దేవగన్నేరులేవో
మీరిక లేరని తెలిసీ
విరబూస్తున్నాయి
మీరు
పంచిన
అపురూప ఫలాలేవో
మీరిక ఆస్వాదించరని తెలిసీ
నోరూరిస్తున్నాయి
మీరు
వెలిగించమన్న
వేల ఒత్తుల
కార్తీక పౌర్ణమి చంద్రుడు
మీ దాకా చేరవని తెలిసీ
వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాడు
మీకిష్టమైన
కవితలు
మీరిక అందుకోరని తెలిసీ
అక్షరాలుగా మారి
జీవితాంతం
ఎదురుచూస్తూనే ఉన్నాయి
ఔర్ చాలీస్ బాకీహై-
జీవించిన క్షణాల
చెదరని జ్ఞాపకాల
తడి ఆరని కన్నీళ్ల
సాక్ష్యంగా-
బాధాత్మక గుండెని
కుదుపుతూ-
రగులుతూ-
ఓ అబద్ధపు వాక్యం
పొద్దు పొడిచిన దగ్గరనించి
పొద్దు వాలే వరకూ
ఔర్ చాలీస్ బాకీహై-
—-
(మోహన రెడ్డి గారి స్మృతిలో-)

*****

(“నెచ్చెలి” అంతర్జాల వనితా పత్రిక- జులై, 2023 ప్రచురణ)

This entry was posted in కవితలు. Bookmark the permalink.

వ్యాఖ్యానించండి