కార్మికులారా వర్ధిల్లండి!(కవిత ) -డా|| కె.గీత

కార్మికులారా వర్ధిల్లండి!

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల

కార్మికులారా వర్ధిల్లండి!

మీ మెదళ్ల పెట్టుబడి మీద

గజాలు దిగ్గజాలుగా రూపుదిద్దుకునే

కార్మికులారా!

చివరి బొట్టు వరకూ శ్రమించండి

పచ్చ నోటో

పచ్చ కార్డో

జీవిత ధ్యేయమైన చోట

మీ నరనరాల తాకట్టు మీద

అఖండ శక్తులుగా ఎదిగే దిగ్గజాల్ని తీర్చి దిద్దడానికి

బిలియన్లకు పడగలెత్తించి బ్రహ్మండాన్ని ఏలడానికి

శాయశక్తులా పిప్పి కండి

కార్మికులారా వర్ధిల్లండి!

విస్తట్లో పంచ భక్ష్య పరమాన్నాలున్నా

తినడానికి సమయం ఉండదు

అత్యుత్తమ జీతాలున్నా

ఒక్క పెన్నీ మిగలదు

సంపాదించే ప్రతీ డాలరు వెనకా

తరుముకొచ్చే మూడొంతుల టాక్సు

నెల తిరిగే సరికి పెనుభూతంలా నిలుచున్న

నాలుగంకెల ఇంటద్దె

నిద్దట్లోనూ ఉలిక్కిపడేట్లు

ఎప్పుడూ తీరని

అయిదంకెల క్రెడిట్ కార్డు

దాటి

సరదాగా

సినిమాకి షికారుకి

నోచుకోని

ఘన కార్మికులారా వర్ధిల్లండి!

మీ మెదళ్ల మొదళ్ల

ఊటలతో సహా పీల్చివేసి

అందమైన ఆశల్ని ఎర వేసి

ఎనిమిది గంటల కాంట్రాక్టు ఉద్యోగం మాటున

ఎనభై గంటల పని చేయించే

సాఫ్ట్వేర్ దిగ్గజాలు

లాభాపూరిత ప్రేతాలై

జుర్రుకునే మొదటి నెత్తుటిని ధారపోసే

ఉత్తమ కార్మికులారా వర్ధిల్లండి!

మీ రక్తపోటు నుంచి

మీ మధుమేహం నుంచి

మీ గుండెదడ నుంచి

పుట్టే

కంపెనీల పెనువేగపు వృద్ధి

జీవన ప్రమాణాల్ని పెంచుతోందో

జీవితాల్ని హరిస్తుందో

ఆలోచించే తీరికలేని

అత్యుత్తమ కార్మికులారా వర్ధిల్లండి!

పదవీ విరామ కాలాన

జీవితాన్ని తడుముకుంటే

పెన్షను ఎలాగూ ఉండదు

అయ్యో! కాసిన్ని బతికిన క్షణాలైనా ఉంటే బావుణ్ణు

పడీలేచీ పాకులాటలో

నెమలికన్ను వంటి ఒక్క జ్ఞాపకమైనా మిగిల్తే బావుణ్ణు

లక్షలాది కార్మికుల

వెన్ను మీద

మొలిచే ఆకాశ హర్మ్యాలు

వెన్నుదన్ను కాలేని

మయ సభలు

చేతి వేళ్ల మీద

నిర్మితమయ్యే

అత్యుత్తమ పరికరాలు

కొన ఊపిరిని సైతం

హరించే

మాయాజాలాలు

ఫలితాల కొద్దీ సత్వరిత వృద్ధిని

పరుగుల కొద్దీ సాధించే

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల

కార్మికులమని గొప్పగా పొంగిపోయే

బానిసలారా వర్ధిల్లండి!

పని రాక్షసులారా వర్ధిల్లండి!

-డా|| కె.గీత

విహంగ మే, 2019 ప్రచురణ

https://vihanga.com/?p=21307

This entry was posted in కవితలు. Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s