గతపు పెట్టె

గతపు పెట్టెని తెరవనే కూడదు
బిలబిలా ఎగిరే తూనీగల్తో బాటూ
తోకలు విరగదీసి
తలకిందులుగా వేళ్ళాడదీసిన
ముళ్ళ తాళ్ళు కూడా ఉంటాయి
మిలమిలా మెరిసే నక్షత్రాలతో బాటూ
అగాధాంధకారంలోకి
విసిరేసే ఖగోళాంతరాలు కూడా ఉంటాయి
గలగలా పారే జలపాతాలతో బాటూ
కాళ్ళకి బరువై ముంచేసే
బండరాళ్ళు కూడా ఉంటాయి
సువాసనలు అలుముకున్న అడవుల్లో
వేటాడే క్రూరమృగాలు
పచ్చని పరిమళాల పూల పొదల్లోనే
బలంగా చుట్టుకున్న నాగుబాములు
ప్రశాంత తామర కొలనుల్లో
రహస్యంగా పొంచి ఉన్న మొసళ్ళు

గతం పెట్టెని తెరవనే కూడదు
కన్ను మూసి తెరిచే లోగా
నీలోంచి
నీలోకి
ప్రవహించే
అనుభూతుల
చాటు
అనుభవాలు
నిన్ను
సలసలా మరిగిస్తాయి

అయినా
జలజలా జారే కన్నీళ్ళతోనే
గాయాల్ని కడిగే
సంయమనం ఒక్కటి చాలు

గతం పెట్టెని మోసుకుని
నువ్వెన్ని ఊళ్ళు తిరిగినా
తటాలున ఒక వాన చినుకు
దూరాన ఒక్క మిణుగురు
చిటారున వీచే ఒక తెమ్మెరలతో
నీ తల మీద భారాన్ని దించి

తూనీగల్ని
నక్షత్రాల్ని
జలపాతాల్ని
దోసిట పట్టి తెచ్చి
పరిమళాల
వర్తమానాన్ని
బహూకరిస్తుంది!


(న్యూజెర్సీ తెలుగు కళా సమితి 40 ఏళ్ల ప్రత్యేక సంచిక “తెలుగుజ్యోతి” ప్రచురణ-)

(“నెచ్చెలి” అంతర్జాల వనితా పత్రిక- అక్టోబర్, 2023 ప్రచురణ)

This entry was posted in కవితలు. Bookmark the permalink.

వ్యాఖ్యానించండి